Share News

వీడని వాన

ABN , Publish Date - Oct 05 , 2025 | 10:28 PM

బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో జిల్లాలో ఆదివారం సాయంత్రం పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.

వీడని వాన
గూడెంకొత్తవీధిలో వర్షం

మన్యంలో కొనసాగుతున్న వర్షాలు

చింతూరు డివిజన్‌లో తొలగనిముంపు సమస్య

పాడేరు, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో జిల్లాలో ఆదివారం సాయంత్రం పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఇప్పటికే గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న వర్షాలతో పాడేరు డివిజన్‌లో గెడ్డలు, వాగుల ఉధృతి కొనసాగుతున్నది. దీంతో చింతూరు ప్రాంతంలోని గోదావరి, శబరి నదుల్లోకి వరద నీరు వచ్చి చేరుతున్నది. ఈ నేపథ్యంలో జిల్లాలో గోదావరి నదికి ఆరెంజ్‌ అలర్ట్‌ను ప్రకటించారు. జిల్లా కేంద్రం పాడేరు మొదలుకుని అన్ని మండలాల్లోనూ వాయుగుండం ప్రభావంతో ఆదివారం సైతం పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. పాడేరు, చింతపల్లి, జి.మాడుగుల, హుకుంపేట మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఈ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా జిల్లాలోని చింతూరు డివిజన్‌లో ఉన్న గోదావరి, శబరి నదుల్లోకి వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఆ నదులు ఉప్పొంగుతున్నాయి. అలాగే చింతూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో పలు గ్రామాల్లో ముంపు సమస్య కొనసాగుతుండగా, వాగులు సైతం రోడ్లపై నుంచి ప్రవహించడంతో సరిహద్దులోని ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు వాహనాల రాకపోకలకు సైతం అవస్థలు పడుతున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం సూచిస్తున్నది.

చింతపల్లిలో..

చింతపల్లి: మండలంలో భారీ వర్షం కురిసింది. ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి వరకు ఎడతెరిపిలేకుండా కుండపోత వర్షం కురిసింది. వర్షానికి ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు, పంట పొలాల్లో వర్షపు నీరు చేరింది.

జీకేవీధిలో..

గూడెంకొత్తవీధి: మండలంలో కుండపోత వర్షం కురిసింది. ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఏకధాటిగా వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. వర్షానికి జర్రెల వారపు సంతలో వర్తకులు, వినియోగదారులు ఇబ్బంది పడ్డారు.

Updated Date - Oct 05 , 2025 | 10:28 PM