వీడని వాన
ABN , Publish Date - Aug 13 , 2025 | 11:30 PM
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో బుధవారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండ కాసి ఆ తరువాత భారీ వర్షం కురిసింది.
పలు మండలాల్లో వర్షం
పాడేరు, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో బుధవారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండ కాసి ఆ తరువాత భారీ వర్షం కురిసింది. పాడేరులో తేలికపాటి జల్లులు పడగా, ఒడిశాను ఆనుకుని ఉన్న ముంచంగిపుట్టులో, జిల్లా శివారున ఉన్న కొయ్యూరులో భారీ వర్షం కురిసింది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాలైన చింతూరు, కూనవరం, ఎటపాక ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు పడ్డాయి. కాగా బుధవారం కొయ్యూరులో 36.4, పాడేరులో 34.1, అనంతగిరిలో 32.4, జి.మాడుగులలో 31.5, అరకులోయలో 31.4, జీకేవీధిలో 30.1, పెదబయలులో 29.6, హుకుంపేటలో 29.0, ముంచంగిపుట్టులో 28.5, చింతపల్లిలో 28.0 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ముంచంగిపుట్టులో..
ముంచంగిపుట్టు: మండలంలో బుధవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా భారీ వర్షం కురిసింది. మండల కేంద్రంతో పాటు జోలాపుట్టు, సంగడ, కుమడ వెళ్లే ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహించింది. వాగులు, మత్స్యగెడ్డ పాయలు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద నీటితో డుడుమ, జోలాపుట్టు జలాశయాలు కళకళలాడుతున్నాయి.
కొయ్యూరులో..
కొయ్యూరు: మండలంలో బుధవారం మధ్యాహ్నం ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. సుమారు గంటన్నర సేపు వర్షం కురవగా, ఆ తరువాత ముసురు వాతావరణం నెలకొంది.