Share News

వన్నె తగ్గిన వలిసె

ABN , Publish Date - Dec 02 , 2025 | 12:36 AM

మన్యంలోని ప్రకృతి అందాలకు ఎంతో శోభ తెస్తున్న పచ్చని వలిసె పూలు ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో వన్నె తగ్గుతున్నాయి.

వన్నె తగ్గిన వలిసె
డుంబ్రిగుడ మండలం కించుమండకు సమీపంలో వేసిన వలిసె పంట

క్రమంగా తగ్గుతున్న సాగు విస్తీర్ణం

ప్రతికూల వాతావరణం, ఆకాశ పందిరి తెగులు బెడదే కారణం

గతంలో 20 వేల ఎకరాల పైబడి సాగు.... ఇప్పుడు 500 ఎకరాలకు పరిమితం

రాజ్‌మా పంటను ప్రత్యామ్నాయంగా సాగు చేస్తున్న వలిసె రైతులు

వలిసె విస్తీర్ణం తగ్గుదలతో తేనె ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

మన్యంలోని ప్రకృతి అందాలకు ఎంతో శోభ తెస్తున్న పచ్చని వలిసె పూలు ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో వన్నె తగ్గుతున్నాయి. మన్యంలోని గిరిజనులు గత ఐదు దశాబ్దాలుగా వలిసె పంటను సాగుచేస్తున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంలో క్రమంగా దానిని వదిలేసి, రాజ్‌మా సాగుపై దృష్టి పెట్టారు. దీంతో మన్యంలో వలిసె పూల సాగు విస్తీర్ణం రోజు రోజుకూ తగ్గుముఖం పడుతున్నది. ఈ పరిస్థితులు ఏజెన్సీలో తేనె ఉత్పత్తిపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

మన్యంలో గతంలో అంటే దశాబ్దం క్రితం వరకు గిరిజన రైతులు 20 వేల ఎకరాలు పైబడి వలిసె పంటను సాగు చేసేవారు. ప్రధానంగా వలిసె పూల ద్వారా నూనెను తీసి వారి వంటకాలకు వినియోగించుకోవడంతో పాటు వాణిజ్యపరంగాను వాటిని వర్తకులకు విక్రయించేవారు. దీంతో వలిసె పంట ద్వారా వారికి ప్రతి ఏడాది చక్కని ఆదాయం సమకూరేది. అలాగే మార్కెట్‌లో సైతం వలిసె పూలకు చక్కని డిమాండ్‌ ఉండడంతో రైతులకు గిట్టుబాటు అయ్యేది. దీంతో ఏజెన్సీలో కొయ్యూరు మినహా పది మండలాల్లోనూ గిరిజన రైతులు వలిసె పంటను విధిగా సాగు చేస్తుండేవాళ్లు. అలాగే అరకులోయ, డుంబ్రిగుడ, అనంతగిరి మండలాల్లో పచ్చని వలిసె పూలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుండడంతో ఆయా ప్రాంతాల్లో విరివిగా వాటిని పండించేవారు. దీంతో అరకులోయ పర్యటన అంటే విధిగా పచ్చని వలిసె పూలలో ఫొటోలు, వీడియో తీసుకోవడం ఒక ఆనవాయితీగా మారింది. పలువురు సందర్శకులు కేవలం వలిసె పూల అందాలను తిలకించేందుకే అరకులోయ పర్యటనకు వచ్చేవారంటే అతిశయోక్తి కాదు. దీంతో మన్యం అంటే పచ్చని వలిసె పంట అన్నట్టుగా ఉండేది. కానీ ఆ స్థాయి నుంచి నేడు కేవలం 500 ఎకరాలకు మాత్రమే వలిసె సాగు పరిమితమైంది. వలిసె సాగు తగ్గుముఖం పడుతుండడం వలన ఏజెన్సీ ప్రాంతంలో తేనె ఉత్పత్తిపైనా దాని ప్రభావం పడుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు. తేనె టీగలకు అవసరమైన మకరందం వలిసె పంటలో అధికంగా ఉండడంతో తేనె ఉత్పత్తి బాగుండేదని, కానీ నేడు అందుకు భిన్నమైన పరిస్థితులు కొనసాగుతున్నాయని వ్యవసాయాధికారులు అంటున్నారు. ఫలితంగా మన్యంలో క్రమంగా తేనె ఉత్పత్తి తగ్గుతుందని పేర్కొంటున్నారు.

ప్రతికూల పరిస్థితుల్లో వలిసెకు దూరం

చాలా ఏళ్లుగా మన్యానికి ప్రత్యేక గుర్తింపు, గిరిజన రైతులకు ఆదాయాన్ని తెచ్చిపెట్టే వలిసె పంటకు ప్రతికూల పరిస్థితులు అధికం కావడంతో గిరిజన రైతులకు వలిసె పంట క్రమంగా దూరమైంది. ప్రధానంగా వలిసె పూలు వికసించే అక్టోబరు, నవంబరు నెలల్లో వర్షాలు కురుస్తుండడంతో పంట నాశనం కావడంతో పాటు ఆనుకోని విధంగా ఆకాశపందిరి అనే ఒక తెగులు పంటను ఆశించడంతో మొక్క దశలోనే పంట పాడవడం మొదలైంది. ఆకాశపందిరి సోకితే వలిసె మొక్కకు ఒక తీగలాంటిది మొత్తం మొక్కను చుట్టేసి ఎదుగుదల లేకుండా చేసేయడంతో పంట నాశనమైపోయేది. వలిసె పంటపై ఆధారపడిన గిరిజన రైతులకు ఆ పంట చేతికి వస్తుందనే నమ్మకం లేకుండాపోయింది. దీంతో క్రమంగా వలిసె పంటకు గిరిజన రైతులు దూరమయ్యారు. అదే క్రమంలో చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో రాజ్‌మా పంటపై జరిగిన పరిశోఽధనలు ఫలించడంతో తొలుత చింతపల్లి, జీకేవీధి మండలాల్లోని గిరిజన రైతులు వలిసె స్థానంలో రాజ్‌మా పంటను సాగు చేయడం ప్రారంభించారు. దానికి ఎటువంటి తెగులు, ఇతర సమస్యలు తలెత్తకుండా దిగుబడి సైతం ఆశాజనకంగా ఉండడంతో క్రమంగా రాజ్‌మా సాగుపైనే గిరిజన రైతులు ఆసక్తి కనబరిచారు. ఏజెన్సీలో చింతపల్లి, జీకేవీధిలో ప్రారంభమైన రాజ్‌మా పంట సాగు క్రమంగా ఏజెన్సీలోని అన్ని మండలాలకు విస్తరించింది. దీంతో వలిసె పంట విస్తీర్ణం తగ్గి, దాని స్థానంలో రాజ్‌మా పంట 20 వేల ఎకరాలు పైబడి విస్తీర్ణం పెరిగింది. అలాగే గిరిజన రైతులకు సైతం రాజ్‌మా పంటతో ఆశించిన దాని కంటే ఎక్కువ ఆదాయం లభిస్తుండడంతో ఆ పంటపైనే ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. అయితే అధికారులు మన్యంలోని వలిసె సాగుకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కృషి చేయాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Dec 02 , 2025 | 12:36 AM