రైల్వే స్టేషన్‌కు మహర్దశ
ABN , Publish Date - Dec 28 , 2025 | 12:18 AM
రాబోయే ఐదేళ్లలో ఎంపిక చేసిన నగరాల నుంచి రైళ్ల సంఖ్యను రెట్టింపు చేస్తామని, ప్రయాణికులకు వసతి సౌకర్యాలు పెంచుతామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేసిన ప్రకటన ఈ ప్రాంత వాసుల్లో ఆశలు రేకెత్తిస్తోంది.
దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 48 నగరాల్లో ‘విశాఖపట్నం’
రాబోయే ఐదేళ్లలో రైళ్ల సంఖ్య రెట్టింపు
ప్రయాణికులకు వసతి సౌకర్యాలు పెంపు
జగన్నాథపురంలో మెగా కోచింగ్ మెయింటెనెన్స్ డిపో ఏర్పాటుకు ప్రతిపాదనలు
రూ.500 కోట్లతో రైల్వే స్టేషన్ అభివృద్ధికి ఇప్పటికే ప్రణాళికలు
విశాఖపట్నం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి):
రాబోయే ఐదేళ్లలో ఎంపిక చేసిన నగరాల నుంచి రైళ్ల సంఖ్యను రెట్టింపు చేస్తామని, ప్రయాణికులకు వసతి సౌకర్యాలు పెంచుతామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేసిన ప్రకటన ఈ ప్రాంత వాసుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. ఆ నగరాల్లో విశాఖపట్నం కూడా ఉండడమే దీనికి కారణం. విశాఖ రైల్వే స్టేషన్‌ను రూ.500 కోట్లతో అభివృద్ధి చేయడానికి ఇప్పటికే ప్రణాళికలు రూపొందించారు. ప్లాట్‌ఫారాల సంఖ్యను ఎనిమిది నుంచి 14కు పెంచనున్నట్టు ఇటీవలె ఎంపీ శ్రీభరత్ ప్రకటించారు. రాబోయే ఐదేళ్లలో మరిన్ని అభివృద్ధి పనులు విశాఖపట్నం డివిజన్‌లో చేపడతామని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.
రైళ్ల సంఖ్య డబుల్
విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి రోజూ బయలుదేరే రైళ్ల సంఖ్య ప్రస్తుతం 37గా ఉంది. దీనిని వచ్చే ఐదేళ్లలో రెట్టింపు చేస్తామంటున్నారు. అంటే 74 అవుతాయి. డిమాండ్ అధికంగా ఉన్న ప్రాంతాలకు విశాఖపట్నం నుంచి కొత్త రైళ్లు అందుబాటులోకి వస్తాయి. బెంగళూరు, సికింద్రాబాద్, తిరుపతి, చెన్నై, అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్‌కత్తా, రాయపూర్‌తో పాటు అరకులోయ వంటి పర్యాటక ప్రాంతాలకు అదనపు రైళ్లు వస్తాయి. కాశీ వంటి పుణ్యక్షేత్రాలకు కూడా రైళ్లు వచ్చే అవకాశం ఉంది. తిరుపతి, బెంగళూరులకు వందేభారత్ వేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. అవన్నీ సాకారమవుతాయి.
శాటిలైట్ స్టేషన్‌గా జగన్నాథపురం
విశాఖపట్నం రైల్వేస్టేషన్ బిజీగా మారింది. లైన్ల సంఖ్య పరిమితంగా ఉండడంతో కొన్ని రైళ్లు దువ్వాడ దాటిన తరువాత అవుటర్‌లోనే ఉండిపోతున్నాయి. మరికొన్ని రైళ్లను ఒకటి, రెండు రోజుల తరువాత షెడ్యూల్ చేయాల్సి ఉంటోంది. అటువంటి సమయంలో వాటిని నిలిపి ఉంచడానికి సరైన వసతి లేక శివారు మార్గాల్లో ఏ లైన్ ఖాళీగా ఉందో చూసుకొని అక్కడ ఉంచుతున్నారు. దీనివల్ల మెయింటెనెన్స్ ఇబ్బందిగా ఉంటోంది. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా కొత్తవలస-అనకాపల్లి మార్గంలో జగన్నాథపురాన్ని శాటిలైట్ స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని అధికారులు ప్రతిపాదించారు. అక్కడ మెగా కోచింగ్ మెయింటెనెన్స్ డిపోతో పాటు లార్జ్ స్కేల్ కాంప్లెక్స్ ఏర్పాటుచేయాలని భావిస్తున్నారు. దీనికి రూ.2,800 కోట్లతో ప్రతిపాదనలు రైల్వే బోర్డుకు పంపించారు. ఇది మాత్రమే కాకుండా విశాఖలో యార్డును ఆధునికీకరించడానికి డీపీఆర్ రూపొందించారు. అందులో ఐదు కొత్త లైన్లు, అదనంగా పాసింజర్ ప్లాట్‌ఫారాలు, పది స్టేబిలింగ్ లైన్లు, ఎలక్ర్టానిక్ ఇంటర్ లాకింగ్ వంటి సదుపాయాలు కల్పించాలని బోర్డుకు ప్రతిపాదించారు. వీటితో పాటు ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్, ఫ్లైఓవర్లు, బైపాస్‌లు నిర్మించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. ఇవన్నీ పూర్తయితే వందలాది మందికి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని అధికారులు చెబుతున్నారు.