Share News

రహదారుల నాణ్యత ప్రశ్నార్థకం

ABN , Publish Date - Dec 26 , 2025 | 12:14 AM

నాణ్యతా లోపంతో జిల్లాలోని పలు రహదారులు ఐదేళ్ల లోపు అధ్వానంగా తయారయ్యాయి.

రహదారుల నాణ్యత ప్రశ్నార్థకం
జీకేవీధి మండలం గాలికొండ సమీపంలో రాళ్లు తేలిన రహదారి

నిర్మించి ఐదేళ్లు కాకుండానే గోతులమయం

సప్పర్ల- గాలికొండ, భీసుపురం- బిర్జిగూడ రోడ్లే ఇందుకు నిదర్శనం

సీలేరు, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): నాణ్యతా లోపంతో జిల్లాలోని పలు రహదారులు ఐదేళ్ల లోపు అధ్వానంగా తయారయ్యాయి. ముఖ్యంగా జీకేవీధి మండలం గాలికొండ పంచాయతీ పరిధి సప్పర్ల నుంచి గాలికొండ వెళ్లే రహదారి, అలాగే అనంతగిరి మండలంలోని భీసుపురం నుంచి బిర్జిగూడ వెళ్లే రోడ్డు దెబ్బతిన్నది. దీంతో రాకపోకలకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

జీకేవీధి మండలం గాలికొండ పంచాయతీ పరిధి సప్పర్ల నుంచి గాలికొండ వరకు వెళ్లే రోడ్డు నిర్మించి ఐదేళ్లు పూర్తి కాకుండానే రాళ్లు తేలి దారుణంగా తయారైంది. అలాగే గాలికొండ గ్రామ సమీపాన వంతెన వద్ద రోడ్డు అంచు కోతకు గురైంది. కొద్ది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఇక్కడ రంధ్రం ఏర్పడడంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామస్థులు చెబుతున్నారు. అధికారులు స్పందించి వంతెన వద్ద రంధ్రాన్ని పూడ్చడంతో పాటు రహదారికి మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.

దిగువశోభ- ఎగువశోభ రోడ్డు అధ్వానం

అనంతగిరి: మండలంలోని ఎగువశోభ పంచాయతీలో గత ప్రభుత్వ హయాంలో ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన కింద భీసుపురం నుంచి బిర్జిగూడ వరకు సుమారు 6 కిలోమీటర్ల మేర రూ.6.18 కోట్లతో రింగురోడ్డు నిర్మించారు. అయితే ఆ తరువాత మొంథా తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఈ రోడ్డు దారుణంగా తయారైంది. అలాగే పూలుగుడ, దిగువశోభ సమీపంలో రోడ్డు పూర్తిగా కోతకు గురైంది. దీంతో బిర్జిగూడ, సరసపోదోర్‌, పోర్నపోదర్‌, దిగువశోభ, ఎగువశోభ, పూలుగుడ గ్రామాల గిరిజనులు నరకం చూస్తున్నారు. బొర్రా వైపు నుంచి బిర్జిగూడ వరకు రైల్వే టన్నెల్‌ పనుల కారణంగా భారీ లోడ్‌లతో లారీలు వెళ్లడంతో రోడ్డంతా దెబ్బతింది. సరసపోదోర్‌, పోర్ణపోదోర్‌, దిగువశోభ నుంచి ఎగువశోభ వరకు రోడ్డు అధ్వానంగా మారింది. పూలుగుడ నుంచి భీసుపురం వరకు రోడ్డు కోతకు గురైంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Dec 26 , 2025 | 12:14 AM