వచ్చే నెల 21న ప్రధాని రాక
ABN , Publish Date - May 03 , 2025 | 01:20 AM
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వచ్చే నెల 21వ తేదీన నగరంలో నిర్వహించనున్న కార్యక్రమానికి భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరుకానున్నారు.
విశాఖపట్నం, మే 2 (ఆంధ్రజ్యోతి):
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వచ్చే నెల 21వ తేదీన నగరంలో నిర్వహించనున్న కార్యక్రమానికి భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరుకానున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి జిల్లా అధికారులకు సమాచారం అందింది. నగరంలో ఏటా తూర్పు నౌకాదళం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, జిల్లా యంత్రాంగం వేర్వేరుగా యోగా దినోత్సవాలు నిర్వహిస్తుంటాయి. అయితే ప్రధాని ఏ కార్యక్రమంలో పాల్గొననున్నారో స్పష్టత రావలసి ఉంది.
వచ్చే నెల 9, 10 తేదీల్లో ఈ-గవర్నెన్స్
జాతీయ సదస్సు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో సహా పలువురు ప్రముఖులు రాక
హోటళ్లలో 600 గదులు బుకింగ్
విశాఖపట్నం, మే 2 (ఆంధ్రజ్యోతి):
నగరంలో వచ్చే నెల 9, 10 తేదీల్లో ఈ-గవర్నెన్స్‌పై జాతీయ సదస్సు జరగనున్నది. ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం సదస్సును నోవాటెల్‌లో నిర్వహించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులు, పలు రాష్ట్రాల ప్రతినిధులు హాజరవుతారు. ‘వికసిత్ భారత్-సివిల్ సర్వీసెస్ ఆన్ డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్’ పేరిట ఈ సదస్సును కేంద్ర ప్రభుత్వంలోని డిపార్టుమెంట్ ఆఫ్ అడ్మినిస్ర్టేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్‌స్, కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటీ మంత్రిత్వ శాఖ, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. తక్కువ సిబ్బందితో అధిక ఫలితాలు సాధించేలా పాలనకు సంబంధించి మేధావులు, పారిశ్రామికవేత్తలు, విద్యావంతుల నుంచి సలహాలు తీసుకుని పాలసీ రూపొందించడమే సదస్సు ముఖ్య ఉద్దేశం. కాగా సదస్సుకు కేంద్రం, పలు రాష్ట్రాల నుంచి ప్రతినిధులు, ఉన్నతాధికారులు రానున్న నేపథ్యంలో నగరంలోని హోటళ్లలో 600 గదులను ముందుగానే రిజర్వు చేశారు. వాహనాలు ప్రధానంగా ఏసీ బస్సులు, కార్లు కోసం ట్రావెల్స్ సంస్థలతో మాట్లాడుతున్నారు. సదస్సు ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించింది. కలెక్టర్ అధ్యక్షతన పలు కమిటీలు ఏర్పాటుచేశారు. విశాఖ వేదికగా 2017లో చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఈ గవర్నెన్స్ జాతీయ సదస్సు జరిగింది.