బంతి పూల ధర పతనం!
ABN , Publish Date - Oct 24 , 2025 | 11:08 PM
మన్యంలో బంతి పూల ధర పడిపోయింది. కొనుగోలు చేసేవారు లేక ధర భారీగా పతనమైంది. గత వారం బుట్ట పూలు(పది కేజీలు) రూ.250 వరకు విక్రయం కాగా ఈ వారం అవే బుట్ట పూలు రూ.50 తగ్గింది. దీంతో గిరిజనులు లబోదిబోమంటున్నారు.
గతవారం బుట్ట పూలు రూ.200 నుంచి రూ.250
ప్రస్తుతం కేవలం రూ.50
దసరా ఉత్సవాలు ముగియడమే కారణం
ప్రతికూల వాతావరణంతో ఇతర ప్రాంతాల
వర్తకులు రాకపోవడం ఒక కారణం
(పాడేరు-ఆంధ్రజ్యోతి)
ఏజెన్సీలో బంతి పూలకు గిరాకీ తగ్గింది. గతవారం పది కిలోల పూల బుట్ట రూ.200 నుంచి రూ.250లకు గిరిజన రైతుల వద్ద వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ వారం కేవలం రూ.50లకు మాత్రమే విక్రయించారు. దీంతో గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీలో పాడేరు, హుకుంపేట, జి.మాడుగుల మండలాల్లో అధిక విస్తీర్ణంలో గిరిజన రైతులు బంతిపూల సాగు చేస్తున్నారు. మూడు మండలాల్లోని బంతి పూలను పాడేరులో ప్రతి రోజు జరిగే ‘బంతి పూల మార్కెట్’లో క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, నర్సీపట్నం, తుని, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు ప్రాంతాలకు చెందిన వర్తకులు ఇక్కడికి వచ్చి వాటిని కొనుగోలు చేసి, బస్తాల్లో ప్యాక్ చేసి ఆయా ప్రాంతాలకు వాహనాల్లో రవాణా చేసుకుంటారు.
ఘోరంగా పతనమైన ధర
ప్రస్తుతం బంతి పూల ధర ఘోరంగా పతనమైందని రైతులు ఆవేదన చెందుతున్నారు. శుక్రవారం పాడేరు మార్కెట్‌లో బుట్ట పూలు రూ.50లకు మించి అమ్ముకోలేని దుస్థితి ఏర్పడింది. అలాగే కొనుగోలుదారుల కోసం గిరిజనులు ఎదురుచూశారు. దసరా ఉత్సవాలు, భవానీ మాలధారణ చేసిన భక్తులున్న సమయాల్లో బంతిపూలకు మంచి డిమాండ్ ఉండేది. ప్రస్తుతం ఆ సీజన్ ముగియడంతో పాటు వర్షాల కారణంగా ఇతర ప్రాంతాలకు చెందిన వర్తకులు రాకపోవడంతో డిమాండ్ లేకుండా పోయిందని గిరిజన రైతులు తెలిపారు. అయితే ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల నుంచి వర్తకులు వస్తే ధర రెట్టింపుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అల్పపీడన ప్రభావంతో ఇతర ప్రాంతాలకు చెందిన వర్తకులు అంతగా రాలేదని రైతులు తెలిపారు.
మన్యం పూలకు భలే డిమాండ్
ఏజెన్సీలో సహజ సిద్ధంగా సాగయ్యే బంతి పూలకు ఇతర ప్రాంతాల్లో చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే.. ఇతర ప్రాంతాల్లో పూలు కోసిన రెండు, మూడు రోజుల్లో వాడిపోతాయి. దీంతో కొనుగోలు చేసిన పూలను ఇతర ప్రాంతాల్లోని మార్కెట్‌లకు సకాలంలో రవాణా చేయకపోతే వర్తకులు నష్టపోయే అవకాశముంది. అదే ఏజెన్సీలోని పువ్వులైతే కోసిన వారం రోజులకు గాని వాడిపోవు. అందువల్ల ఇక్కడ కొనుగోలు చేసిన పూలను ఎక్కడికైనా ఎటువంటి భయం లేకుండా రవాణా చేసుకోవచ్చుననే ఽధీమాతో వర్తకులు వాటిని కొనుగోలు ఎగబడుతుంటారు. అయితే ప్రస్తుతం అందుకు భిన్నమైన పరిస్థితి ఏర్పడడంతో గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.