ధర దిగింది!
ABN , Publish Date - Sep 22 , 2025 | 12:50 AM
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జీఎస్టీ సంస్కరణలు సోమవారం నుంచి అమల్లోకి రానుండడంతో విశాఖ డెయిరీ పాల ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి.
తగ్గిన విశాఖ డెయిరీ పాల ఉత్పత్తుల ధరలు
నేటి నుంచి అమల్లోకి కొత్త రేట్లు
జీఎస్టీ సంస్కరణల ప్రభావం
అక్కిరెడ్డిపాలెం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి) :
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జీఎస్టీ సంస్కరణలు సోమవారం నుంచి అమల్లోకి రానుండడంతో విశాఖ డెయిరీ పాల ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి. డెయిరీకి చెందిన పలు ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గుతుండడంతో వాటి ధరలను తగ్గించామని డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
డెయిరీ ఉత్పత్తి చేసే యూహెచ్‌టీ టోన్డ్ మిల్క్ లీటర్ ప్రస్తుతం రూ.69 ఉండగా ఇది రూ.66కు తగ్గనుంది. యూహెచ్‌టీ స్టాండర్డ్ మిల్క్ లీటర్ రూ.75 నుంచి రూ.72కు, ఆవు నెయ్యి 500 గ్రాములు రూ.330 నుంచి రూ.309కు, కేజీ రూ.650 నుంచి రూ.608కు తగ్గుతాయి. పన్నీర్ 200 గ్రాములు రూ.90 నుంచి రూ.86కు, కేజీ పన్నీరు రూ.420 నుంచి రూ.400కు, మిల్క్‌షేక్‌లు రూ.25 నుంచి రూ.24, ప్లమ్ కేక్ 100 గ్రాములు రూ.30 నుంచి రూ.27కు తగ్గనుంది. ఈ ధరలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని చైర్మన్ వివరించారు.
పోలీస్ కమిషనరేట్‌కు స్కోచ్ అవార్డు
విశాఖపట్నం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి):
నగర పోలీస్ కమిషనరేట్‌కు ప్రతిష్ఠాత్మకమైన స్కోచ్ అవార్డు లభించినట్టు సీపీ శంఖబ్రతబాగ్చి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం అందించేందుకు కమిషనరేట్‌లో ‘రోడ్డు ప్రమాద బాధితుల సహాయ కేంద్రం’ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కేంద్రం ద్వారా హిట్ అండ్ రన్ కేసుల్లో మృతిచెందినవారి కుటుంబసభ్యులకు, గాయపడినవారికి ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకున్నారు. ఒక్కో బాధితుడికి ఒక కానిస్టేబుల్‌ను అప్పగించి ఆయా శాఖల నుంచి సర్టిఫికెట్లను తీసుకుని బీమా కంపెనీలకు అందజేయడం, ప్రయోజనాలు విడుదలయ్యేలా చూస్తున్నారు. దీనివల్ల 2022 ఏప్రిల్ ఒకటి నుంచి ఇప్పటివరకు రూ.63.5 లక్షలను బాధితులకు అందజేశారు. దీనిని గుర్తించిన స్కోచ్ సంస్థ కమిషనరేట్‌కు అవార్డును ప్రకటించిందని సీపీ వివరించారు.
రైల్వేలో రౌండ్ ట్రిప్ ప్యాకేజీ
రానుపోను బేస్ చార్జీలపై 20 శాతం తగ్గింపు
విశాఖపట్నం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి):
రైలు ప్రయాణికులకు రౌండ్ ట్రిప్ ప్యాకేజీ అందుబాటులోకి వచ్చింది. పండగ రద్దీని నియంత్రించడానికి, ప్రయాణం సులభతరం చేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో ప్రయాణికులకు బేస్ చార్జీలపై 20 శాతం తగ్గింపు లభిస్తుంది. ఇరువైపుల ఒకే తరగతి, ఒకే మార్గంలో ప్రయాణించే వారికి మాత్రమే వర్తిస్తుంది. ఉదాహరణకు విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు వెళి, తిరిగి సికింద్రాబాద్ నుంచి విశాఖ వచ్చే వారికి ఒకే క్లాస్‌కు మాత్రమే వర్తిస్తుంది. అయితే తొలి ప్రయాణం అక్టోబరు 13 నుంచి 26 మధ్య, తిరుగు ప్రయాణం నవంబరు 17 నుంచి డిసెంబరు ఒకటి మధ్య చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రయాణికుల రానుపోను వివరాలు ఒకే విధంగా ఉండాలి, మార్పులు జరిగితే రాయితీ వర్తించదు. శాశ్వత ప్రాతిపదికన నడుస్తున్న రైళ్లతోపాటు ప్రత్యేక రైళ్లకు వర్తిస్తుందని అధికారులు పేర్కొన్నారు. రానుపోను టికెట్లు ఆన్‌లైన్/ ఆఫ్ లైన్‌లో తీసుకోవచ్చు. ఒకవైపు ప్రయాణాన్ని ఆన్‌లైన్‌లో, తిరుగు ప్రయాణం ఆఫ్‌లైన్‌లో చేస్తే రాయితీ వర్తించదు. ఈ పథకం కింద బుక్ చేసుకున్న టికెట్లకు చార్జీలు వాపసు ఇవ్వరు. అనివార్య కారణాల వలన టికెట్ రద్దు చేసుకున్నా వాపసు రావు. రైలు ప్రయాణ కూపన్లు, వోచర్ ఆధారిత బుకింగ్, పాస్‌లు, పీటీవోలు చెల్లవని స్పష్టం చేశారు.
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు
మహారాణిపేట, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి):
కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కరవేదిక కార్యక్రమాన్ని ఈనెల 22న రద్దుచేసినట్టు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 22, 23 తేదీల్లో నగరంలో జరగనున్న 28వ జాతీయ ఈ గవర్నెన్స్‌కు ముఖ్యమంత్రి హాజరవుతున్నారని, ఈ నేపథ్యంలో అధికారులంతా ఏర్పాట్లలో నిమగ్నమైన సందర్భంగా పీజీఆర్‌ఎస్‌ను తాత్కాలికంగా రద్దుచేశామన్నారు. జిల్లా వాసులు సహకరించాలని కోరారు. కాగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోనూ పీజీఆర్‌ఎస్‌ను రద్దుచేసినట్టు కమిషనర్ కేతన్‌గార్గ్ తెలిపారు.