అడుగుకో గొయ్యి!
ABN , Publish Date - Aug 22 , 2025 | 12:35 AM
ఇప్పటికే అధ్వానంగా వున్న పీఎస్‌పేట- జన్నవరం రోడ్డు.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మరింత దయనీయంగా తయారైంది. పాత గోతులు పెద్దవి అయ్యాయి. కొత్తగా గోతులు ఏర్పడ్డాయి. వర్షాలు ఆగిపోయి రెండు రోజులైనప్పటికీ గోతుల్లో చేరిన నీరు మాత్రం అలాగే వుండిపోయింది.
దారుణంగా తయారైన పీఎస్‌పేట- జన్నవరం రోడ్డు
వర్షాలతో మరింత అధ్వానం
రాకపోకలకు మూడు మండలాల ప్రజల ఇక్కట్లు
చోడవరం, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): ఇప్పటికే అధ్వానంగా వున్న పీఎస్‌పేట- జన్నవరం రోడ్డు.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మరింత దయనీయంగా తయారైంది. పాత గోతులు పెద్దవి అయ్యాయి. కొత్తగా గోతులు ఏర్పడ్డాయి. వర్షాలు ఆగిపోయి రెండు రోజులైనప్పటికీ గోతుల్లో చేరిన నీరు మాత్రం అలాగే వుండిపోయింది. ఈ రహదారి మీదుగా చోడవరం, బుచ్చెయ్యపేట, రావికమతం మండలాలకు చెందిన పలు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఏళ్ల తరబడి నిర్వహణ పనులకు నోచుకోకపోవడంతో గుంతలమయంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వం చోడవరం నుంచి పీఎస్ పేట మీదుగా జన్నవరం వరకు ఐదు కిలోమీటర్ల రహదారి అభివృద్ధికి రూ.2.83 కోట్లు మంజూరు చేసింది. రోడ్డు పనులకు అప్పటి స్థానిక ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి చేతులు దులుపుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ‘పల్లె పండుగ’ కార్యక్రమంలో భాగంగా రూ.1.2 కోట్లతో చోడవరం పట్టణంలో కొత్తూరు జంక్షన్ నుంచి కిలోమీటరు మేర సీసీ రోడ్డు నిర్మించారు. తరువాత జన్నవరం వరకు మిగిలిన నాలుగు కిలోమీటర్ల రోడ్డు బాగుపడలేదు. చాలా ఏళ్ల క్రితం వేసిన తారురోడ్డు ఆనవాళ్లు లేకుండా పోయింది. అడుగడుగునా గోతులు ఏర్పడి మెటల్ రోడ్డులా తయారైంది. దీనివల్ల ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు పాడైపోతున్నాయని ఆయా వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రిపూట ప్రయాణం ప్రమాదకరంగా మారిందని వాపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే స్పందించి, పీఎస్‌పేట నుంచి జన్నవరం వరకు రోడ్డు అభివృద్ధికి చర్యలు చేపట్టాలని పలు గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.