పోలీస్ కమిషనర్‌కు డీజీగా పదోన్నతి
ABN , Publish Date - Dec 28 , 2025 | 12:23 AM
నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చికి ప్రభుత్వం పదోన్నతి కల్పించింది.
మహారాణిపేట, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి):
నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చికి ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ప్రస్తుతం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా ఉండగా, ఇప్పుడు డైడెక్టర్ జనరల్‌గా ప్రమోషన్ ఇచ్చింది. అయితే ఆ హోదాలోనే విశాఖపట్నం పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించాలని సూచించింది.
రుషికొండ వెంకటేశ్వరస్వామి ఆలయంలో 30న ఉత్తరద్వార దర్శనం
సాగర్‌నగర్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి):
రుషికొండలో టీటీడీ ఆధ్వర్యాన నడుస్తున్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ నెల 30వ తేదీ తెల్లవారు జామున రెండు గంటల నుంచి భక్తులకు ఉత్తరద్వార దర్శనం కల్పించనున్నట్టు కార్యనిర్వహణాధికారి జగన్మోహనాచార్యులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రొటోకాల్ అధికారులకు వేకువజామున 4 నుంచి 6 గంటల వరకూ దర్శనం కల్పిస్తామన్నారు. ఆరోజున భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైకి ఎటువంటి వాహనాలను అనుమతించబోమన్నారు. కొండ దిగువన పార్కింగ్ ప్రదేశం నుంచి పైకి ఉచితంగా బస్సులు నడపనున్నట్టు వెల్లడించారు. స్వామి వారికి నైవేద్యం నివేదించేందుకు ఉదయం 8 నుంచి 8.45 గంటల వరకు, సాయంత్రం 7 నుంచి 7.30 గంటల వరకూ దర్శనాలకు విరామం ఉంటుందన్నారు. ఎండాడ నుంచి కార్లలో వచ్చే వారికి దేవాలయం వెనుక ఉన్న ప్రదేశంలో పార్కింగ్ సదుపాయం కల్పిస్తామన్నారు.
1,59,385 మందికి పింఛన్లు
31నే పంపిణీ
విశాఖపట్నం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో 1,59,385 మందికి సామాజిక భద్రతా పింఛన్ల కోసం రూ.70 కోట్లు విడుదలయ్యాయి. నాలుగు గ్రామీణ మండలాల్లో 26,464 మందికి రూ.11.21 కోట్లు, జీవీఎంసీ పరిధిలో 1,32,921 మందికి రూ.58.79 కోట్లు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛన్‌దారులకు అందజేస్తారు. కొత్త సంవత్సరం కావడంతో జనవరి ఒకటో తేదీన ఇవ్వాల్సిన పింఛన్లు ఒకరోజు ముందుగా ఈనెల 31వ తేదీన పంపిణీకి ఏర్పాట్లు చేశామని డీఆర్‌డీఎ పీడీ బి.లక్ష్మీపతి తెలిపారు.
30న జడ్పీ సర్వసభ్య సమావేశం
విశాఖపట్నం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి):
జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 30వ తేదీ మంగళవారం ఉదయం 10.30 గంటలకు చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన జరగనున్నదని సీఈవో పి.నారాయణమూర్తి తెలిపారు. ఉమ్మడి జిల్లాలో అన్ని శాఖల అధికారులు పూర్తి నివేదికలతో సమావేశానికి హాజరుకావాలన్నారు. జడ్పీటీసీ సభ్యులు, మండలాధ్యక్షులు సమావేశానికి హాజరుకావాలని కోరారు.