యాత్రి నివాస్ సిద్ధం
ABN , Publish Date - Aug 08 , 2025 | 01:00 AM
దాదాపుగా రెండేళ్ల తరువాత విశాఖపట్నంలో ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) పర్యాటకులకు వసతి సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చింది.
అందుబాటులోకి హరిత హోటల్
రెండేళ్ల తరువాత అందుబాటులోకి హరిత హోటల్
రూ.12.5 కోట్లతో ఆధునికీకరణ
42 ఏసీ రూమ్‌లు, బార్, రెస్టారెంట్, మీటింగ్ హాల్
బుకింగ్స్ ప్రారంభం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
దాదాపుగా రెండేళ్ల తరువాత విశాఖపట్నంలో ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) పర్యాటకులకు వసతి సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చింది. గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా విశాఖపట్నం వచ్చే పర్యాటకులకు ఎటువంటి వసతి కల్పించలేని దుస్థితి ఏర్పడింది. రుషికొండలో సముద్రతీరాన అందమైన హరిత రిసార్ట్స్ ఉండేవి. నాటి సీఎం జగన్ మోహన్‌రెడ్డి పర్యాటకులకు స్టార్ హోటల్ నిర్మిస్తామంటూ మాయమాటలు చెప్పి దానిని కూలగొట్టారు. అక్కడ సొంత కుటుంబం నివాసం కోసం రూ.450 కోట్లతో ప్యాలెస్ నిర్మించుకున్నారు. అది ఎందుకూ కొరగాకుండా పోయింది. ఎంవీపీ కాలనీలో అప్పుఘర్ వద్ద హరిత హోటల్ (యాత్రీ నివాస్) ఉండేది. దానిని మరమ్మతుల పేరుతో 2023 ఆగస్టులో మూసేశారు. అప్పటి నుంచి విశాఖపట్నం వచ్చే పర్యాటకులు ప్రైవేటు హోటళ్లలోనే దిగాల్సి వచ్చింది. ఇలా రెండేళ్లు నడిచింది. యాత్రీ నివాస్ ఆధునికీకరణ పనులను ఆరు కోట్ల రూపాయల అంచనాతో ప్రారంభించి రూ.12.5 కోట్లకు తీసుకువెళ్లారు. అప్పటి ఏపీటీడీసీ ఇంజనీరింగ్ అధికారులు అనూహ్యంగా ఖర్చు పెంచేశారు. దానిపై అనేక విచారణలు చేపట్టారు. ఎట్టకేలకు కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో మిగిలిన పనులు పూర్తిచేసి అప్పగించారు.
ఆఽధునిక వసతులతో
ఆధునికీకరించిన యాత్రీ నివాస్‌లో 42 ఏసీ రూమ్‌లు ఉన్నాయి. ఏసీ సూట్, ఏసీ డీలక్స్, ఏసీ ఎగ్జిక్యూటివ్ రూమ్‌లుగా విభజించారు. ఎగ్జిక్యూటివ్ రూమ్ రూ.3920కే ఇస్తున్నారు. ఏసీ డీలక్స్‌లో నలుగురు ఉంటే రూ.5,600 తీసుకుంటున్నారు. ఉండే మనుషులను బట్టి టారిఫ్ నిర్ణయిస్తున్నారు. రెస్టారెంట్, బార్, సమావేశ మందిరం వంటి వసతులు సమకూర్చారు. దీనిని పర్యాటక శాఖా మంత్రితో ప్రారంభింపజేయాలని యోచిస్తున్నారు. ఈలోగా పర్యాటకులు ఎవరైనా వచ్చి ఉంటామంటే...తాత్కాలికంగా రూమ్‌లు అద్దెకు ఇస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఏపీటీడీసీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి బుక్ చేసుకోవచ్చు. వారం, పది రోజుల్లో దీనిని అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉందని పర్యాటక శాఖ వర్గాలు చెబుతున్నాయి.