Share News

గంజాయి శాశ్వత నిర్మూలన అందరి బాధ్యత

ABN , Publish Date - Sep 24 , 2025 | 11:04 PM

జిల్లాలో గంజాయిని శాశ్వతంగా నిర్మూలించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం గంజాయి నిర్మూలనపై జిల్లా ఎస్‌పీ అమిత్‌బర్ధార్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

గంజాయి శాశ్వత నిర్మూలన అందరి బాధ్యత
మాట్లాడుతున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, పక్కన ఎస్‌పీ అమిత్‌బర్ధార్‌

సాగు, వినియోగంపై అధికారులకు పక్కా సమాచారం ఉండాలి

విద్యాలయాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి

అధికారులకు కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ ఆదేశం

పాడేరు, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గంజాయిని శాశ్వతంగా నిర్మూలించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం గంజాయి నిర్మూలనపై జిల్లా ఎస్‌పీ అమిత్‌బర్ధార్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో గంజాయి సాగు, వినియోగంపై అధికారులకు పక్కా సమాచారం ఉండాలన్నారు. గంజాయి సాగుతో కలిగే నష్టాలపై ప్రజలకు, వినియోగం వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. గిరిజనుల్ని గంజాయి సాగు నుంచి విముక్తి చేసి, వారిని ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సహించాలన్నారు. డిగ్రీ, జూనియర్‌ కాలేజీల్లో, ఇతర విద్యాలయాల్లోనూ గంజాయి వల్ల కలిగే నష్టాలపై ప్రణాళికాబద్ధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అలాగే గంజాయిని వీడిన గిరిజన రైతులకు స్వయం ఉపాధి కల్పన, బ్యాంకు రుణాలు మంజూరు చేయాలన్నారు. గంజాయి సాగు, రవాణా చేస్తున్న వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఎస్‌పీ అమిత్‌బర్ధార్‌ మాట్లాడుతూ గంజాయి సాగు, రవాణా అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నామని, సమాజంలోనూ మార్పు రావాలన్నారు. గంజాయి ద్వారా సంపాదించిన ఆస్తులను జప్తు చేయడం వంటి చర్యలు చేపడుతున్నామని, గంజాయి స్మగ్లర్లకు గ్రామాల్లో ఆశ్రయం కల్పించవద్దన్నారు. గంజాయి రవాణాను అరికట్టేందుకు ప్రతి చోటా పటిష్ట నిఘా పెట్టామని తెలిపారు. విద్యాలయాల్లోనూ గంజాయి వల్ల కలిగే నష్టాలను తెలియజేస్తూ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో గంజాయి నిర్మూలనకు వివిధ ప్రభుత్వ శాఖలు చేపట్టాల్సిన చర్యలను పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా కలెక్టర్‌, ఎస్‌పీ అందరికీ వివరించారు. ఈ కార్యక్రమంలో పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పీవోలు శ్రీపూజ, స్మరణ్‌రాజ్‌, అపూర్వభరత్‌, రంపచోడవరం సబ్‌కలెక్టర్‌ శుభంనొక్వల్‌, డీఎఫ్‌వో పీవీ సందీప్‌రెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ టి.విశ్వేశ్వరనాయుడు, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్‌.నందు, జిల్లా ఉద్యానవనాధికారి కె.బాలకర్ణ, రైతు సాధికారత సంస్థ ఏడీఎం ఎల్‌.భాస్కరరావు, ఐసీడీఎస్‌ పీడీ ఝాన్సీబాయి, సీపీవో ప్రసాద్‌, ఎల్‌డీఎం మాతునాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 24 , 2025 | 11:04 PM