Share News

మండపాలు నిరుపయోగం!

ABN , Publish Date - Aug 25 , 2025 | 12:42 AM

వివాహాది కార్యక్రమాల నిర్వహణకు తగిన వసతి లేక ఇబ్బందిపడే వారికోసం అన్ని వసతులతో కూడిన సుమారు 50 కల్యాణ మండపాలను నిర్మించాలని సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త, కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత గోవా గవర్నర్‌ పూసపాటి అశోక్‌గజపతిరాజు తలంచారు.

మండపాలు నిరుపయోగం!

అశోక్‌ ఆశయానికి సింహాచలం దేవస్థానం అధికారుల తూట్లు

దేవస్థానం నిధులతో 50 కల్యాణ మండపాల నిర్మాణానికి పాలకమండలి ఆమోదం

రూ.11.5 కోట్లతో రెండు చోట్ల నిర్మాణం

ప్రణాళిక లేని పనులతో నిరుపయోగం

ఇప్పటికీ మారని యంత్రాంగం తీరు

సింహాచలం, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి):

వివాహాది కార్యక్రమాల నిర్వహణకు తగిన వసతి లేక ఇబ్బందిపడే వారికోసం అన్ని వసతులతో కూడిన సుమారు 50 కల్యాణ మండపాలను నిర్మించాలని సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త, కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత గోవా గవర్నర్‌ పూసపాటి అశోక్‌గజపతిరాజు తలంచారు. వీటిని దేవస్థానం నిధులతో చేపట్టాలని భావించి తీర్మానాన్ని పాలకమండలి సమావేశంలో ప్రవేశపెట్టారు. దీనివల్ల ఎంతోమంది అప్పన్న భక్తులకు మేలు జరుగుతుందనే సంకల్పంతో పాలక మండలి ఆమోదించింది. దీంతో హడావుడిగా ప్రణాళికలు సిద్ధం చేసిన అధికారులు రెండుచోట్ల రూ.11.5 కోట్ల వ్యయంతో 8 కల్యాణ మండపాలను నిర్మించేశారు. కానీ మౌలిక వసతులు కల్పించడంలో విఫలమవడంతో ఎందుకూ కొరగాకుండా వృథాగా మిగిలిపోయాయి.

నగర పరిధిలో కల్యాణ మండపాలు లేక ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో దేవస్థానానికి చెందిన ఖాళీ స్థలాల్లో 50 కల్యాణ మండపాలు నిర్మించాలన్నది అశోక్‌గజపతిరాజు ఆలోచన. వాటిని పేద, మధ్యతరగతి వారికి నామమాత్రపు అద్దెకు ఇవ్వాలని భావించారు. ఇందులో భాగంగా సింహాచలం, వేపగుంట, పెందుర్తి, ముడసర్లోవ, తదితర ప్రాంతాల్లో అత్యాధునిక హంగులతో కల్యాణ మండపాల నిర్మాణానికి సింహాచల దేవస్థానం ఇంజనీరింగ్‌ అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. ముందుగా సింహాచలం ప్రధాన రహదారికి అనుకుని ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో గల స్థలంలో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. శ్రీదేవి కాంప్లెక్స్‌ పేరుతో 2019లోనే రూ.3.5 కోట్ల వ్యయంతో భవన నిర్మాణం చేపట్టారు. ఇందులో దిగువ అంతస్థులో దుకాణాల సముదాయం, పైఅంతస్థులో నాలుగు కల్యాణ మండపాలను అందుబాటులోకి తీసుకువచ్చారు.

అవగాహన లేని పనులు

అయితే సరైన అవగాహన, పక్కా ప్రణాళిక లేకుండా పనులు చేపట్టడంతో ఇవి ఎందుకూ కొరగాకుండా మిగిలిపోయాయి. కల్యాణ మండపాల్లో సాధారణంగా పెళ్లి కుమారుడు, పెళ్లికుమార్తెకు ప్రత్యేక గదులు నిర్మించాలి. వాటితో పాటు మరుగుదొడ్లు తప్పనిసరి. అయితే శ్రీదేవి కాంప్లెక్స్‌లోని నాలుగు కల్యాణ మండపాల్లో ఇవేవీ నిర్మించలేదు. దీంతో వివాహాది కార్యక్రమాలు నిర్వహించే వారికి పనికిరాకుండా పోయాయి. రూ.కోట్ల వ్యయంతో నిర్మించిన భవనాలు కావడంతో వాటిలో ప్రస్తుతం సుదూర ప్రాంతాల నుంచి అప్పన్న దర్శనానికి వచ్చే భక్తులకు వసతి కల్పిస్తున్నారు.

వినియోగానికి దూరంగా...

దీంతో పాటు సత్తెమ్మతల్లి ఆలయానికి ఎదురుగా దేవస్థానానికి చెందిన సుమారు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రూ.8 కోట్లకు పైగా వ్యయంతో నాలుగు కల్యాణ మండపాల కాంప్లెక్స్‌ నిర్మించారు. ఈ ఏడాది చందనోత్సవానికి ముందు ఏప్రిల్‌ 26న ఇక్కడ మంత్రుల ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఆ తరువాత కల్యాణ మండపాల కాంప్లెక్స్‌ను వినియోగించిన దాఖలాలు కనిపించలేదు. దీనికి కారణాలపై ఆరా తీయగా ఆ భవనానికి విద్యుత్‌ సరఫరా కల్పించేందుకు ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటుచేయాల్సి ఉందని తెలిసింది. మిగిలిన కల్యాణ మండపాల నిర్మాణాల మాటెలా ఉన్నా, ఇప్పటికే రూ.కోట్ల వ్యయంతో నిర్మించిన వాటినైనా అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

Updated Date - Aug 25 , 2025 | 12:42 AM