కొనసాగుతున్న గెడ్డల ఉధృతి!
ABN , Publish Date - Aug 29 , 2025 | 11:17 PM
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం కాస్తా తగ్గినా జిల్లాలో శుక్రవారం నాటికి గెడ్డలు, వాగుల ఉధృతి కొనసాగుతున్నది.
పూర్తిగా సాధారణ స్థితికిరాని
మారుమూల ప్రాంతాల్లో జనజీవనం
వర్షాలు తగ్గినా పొంగి ప్రవహిస్తున్న గెడ్డలు, వాగులు
చింతూరు డివిజన్ పరిధిలో వరద ముంపు పరిస్థితులు
పాడేరు, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం కాస్తా తగ్గినా జిల్లాలో శుక్రవారం నాటికి గెడ్డలు, వాగుల ఉధృతి కొనసాగుతున్నది. గత కొన్ని రోజులుగా ఏజెన్సీలో వర్షాలు కొనసాగుతుండడంతో వీటి ఉధృతి మరింతగా పెరిగింది. వర్షాలు తగ్గుముఖం పట్టినా గెడ్డలు, వాగుల ప్రభావం మాత్రం పెద్దగా తగ్గడం లేదు. దీంతో నేటికీ మారుమూల గిరిజన పల్లెల్లో జనజీవనం సాధారణ స్థితికి రాలేదు. అలాగే పంట పొలాల్లోనూ వర్షం నీరు నిల్వలున్నాయి. పాడేరు, పెదబయలు, జి.మాడుగుల, ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ, జీకేవీధి, చింతపల్లి, అనంతగిరి మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లోని గెడ్డలకు అవతల ఉన్న పల్లెల్లోని జనం ఇళ్లకే పరిమితమయ్యారు.
చింతూరులో కొనసాగుతున్న కంట్రోల్ రూమ్‌లు
ఏజెన్సీ ప్రాంతంలో భారీ వర్షాలకు జిల్లాలోని గోదావరి, శబరి నదుల్లోకి వరద నీరు అధికంగా వచ్చి చేరింది. దీంతో ఆయా నదుల వద్ద ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో చింతూరులోని ఐటీడీఏ, సబ్‌కలెక్టర్ కార్యాలయాల్లోని ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లను కొనసాగిస్తున్నారు. జిల్లాలోని చింతూరు రెవెన్యూ డివిజన్‌లోని వరద ముంపునకు గురయ్యే చింతూరు, కూనవరం, వీఆర్.పురం, ఎటపాక మండలాల్లోని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. జలపాతాల్లోకి పర్యాటకులను అనుమతించవద్దని స్పష్టం చేశారు.