Share News

అక్కడ నర్సులే వైద్యులు

ABN , Publish Date - Jul 01 , 2025 | 12:17 AM

మునిసిపాలిటీలోని 1వ వార్డు సోమలింగపాలెం, 20 వ వార్డు పెదపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు లేకపోవడంతో నర్సులే రోగులకు వైద్య సేవలందిస్తున్నారు. సుమారు ఎనిమిది నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

అక్కడ నర్సులే వైద్యులు
వైద్యుల కోసం సోమలింగపాలెం ఆస్పత్రిలో ఎదురు చూస్తున్న రోగులు

మునిసిపాలిటీలోని సోమలింగపాలెం, పెదపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని దుస్థితి

ఎనిమిది నెలలుగా వైద్యులు లేకపోవడంతో ఇదే పరిస్థితి

మొక్కుబడిగా ఇన్‌చార్జి వైద్యులను నియమించినా సేవలందించని వైనం

పేద రోగులకు అందని వైద్యం

పట్టించుకోని వైద్య ఆరోగ్యశాఖాధికారులు

ఎలమంచిలి, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీలోని 1వ వార్డు సోమలింగపాలెం, 20 వ వార్డు పెదపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు లేకపోవడంతో నర్సులే రోగులకు వైద్య సేవలందిస్తున్నారు. సుమారు ఎనిమిది నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఆయా ఆరోగ్య కేంద్రాలకు ఇన్‌చార్జి వైద్యులను నియమించినా వారు సక్రమంగా రావడం లేదని రోగులు చెబుతున్నారు. ఆయా ఆస్పత్రుల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒక వైద్యుడు, ఆరుగురు సిబ్బంది చొప్పున విధులు నిర్వహించాలి. పెదపల్లి ఆరోగ్య కేంద్రానికి పెదపల్లి, గొల్లలపాలెం, కొక్కిరాపల్లి, మంత్రిపాలెం, చిన గొల్లలపాలెం ప్రాంతాలకు చెందిన రోగులు వస్తుంటారు. అలాగే సోమలింగపాలెం ఆరోగ్య కేంద్రానికి నారాయణపురం, కొత్తూరు, జంపపాలెం నుంచి రోగులు వస్తుంటారు. ఈ రెండు ఆస్పత్రుల వైద్యులు బదిలీపై వెళ్లిపోవడంతో అనకాపల్లికి చెందిన ఇద్దరు వైద్యులను ఇన్‌చార్జులుగా నియమించారు. అయితే వాళ్లు కేవలం సిబ్బందికి లక్ష్యాలు నిర్దేశించడానికి, సమావేశాలకు మాత్రమే ఇక్కడికి వస్తారని తెలిసింది. దీంతో ఈ రెండు ఆస్పత్రుల పరిధిలోని పేద రోగులు వైద్య సేవలు పొందలేకపోతున్నారు. సాధారణ జ్వరం, జలుబు, దగ్గుకు నర్సులే మందులు ఇచ్చి పంపుతున్నారు. ఈ ఆస్పత్రుల్లో వైద్యులు లేకపోవడం వల్ల ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోందని, స్థోమత లేకపోతే నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తున్నామని పేద రోగులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ ఆస్పత్రులకు పూర్తి స్థాయిలో వైద్యులను నియమించాలని వారు కోరుతున్నారు.

Updated Date - Jul 01 , 2025 | 12:17 AM