Share News

మరో 12 గంటలు కీలకం

ABN , Publish Date - Oct 29 , 2025 | 12:39 AM

మొంథా తీవ్ర తుఫాన్‌ మంగళవారం రాత్రి తీరం దాటనున్నందున, మరో 12 గంటలపాటు అప్రమత్తంగా ఉందామని అధికారులకు కోస్తాంధ్రలోని తొమ్మిది జిల్లాల ప్రత్యేక అధికారి, రాష్ట్ర స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్‌ పిలుపునిచ్చారు.

మరో 12 గంటలు కీలకం

  • మరింత అప్రమత్తంగా ఉండాలి

  • అధికారులకు ప్రత్యేకాధికారి, ప్రభుత్వ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్‌ సూచన

విశాఖపట్నం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి):

మొంథా తీవ్ర తుఫాన్‌ మంగళవారం రాత్రి తీరం దాటనున్నందున, మరో 12 గంటలపాటు అప్రమత్తంగా ఉందామని అధికారులకు కోస్తాంధ్రలోని తొమ్మిది జిల్లాల ప్రత్యేక అధికారి, రాష్ట్ర స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్‌ పిలుపునిచ్చారు. ఎంపీ ఎం.శ్రీభరత్‌, జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌తో కలిసి ఆయన కలెక్టరేట్‌లోని వీసీ హాలులో మంగళవారం రాత్రి మీడియాతో మాట్లాడారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకూ మొంథా ప్రభావం ఉంటుందని, ప్రధానంగా కాకినాడ, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలపై ఎక్కువ ఉంటుందన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు.

తక్షణ సహాయ బృందాలు ఏర్పాటు: కలెక్టర్‌

సోమవారం ఉదయం 8.30 నుంచి మంగళవారం ఉదయం 8.30 గంటల వరకు విశాఖ జిల్లాలో 147 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైందని కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌ వెల్లడించారు. మంగళవారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం మూడు గంటల వరకు 1.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. జీవీఎంసీ పరిధిలో జోన్‌కు రెండు చొప్పున క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్‌లను అందుబాటులో ఉంచామన్నారు. ఎప్పటికప్పుడు చెట్ల కొమ్మలను, డ్రెయిన్లలో పూడికను తొలగిస్తున్నామని వివరించారు. కొండవాలు ప్రాంతాల్లో ప్రజలను సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. ములగాడ, సీతకొండ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయని, ఇతర చోట్ల రాళ్లు జారాయన్నారు. ప్రజలు ఏదైనా అత్యవసరమైతే హెల్ప్‌లైన్‌ నంబర్లు 0891-2590100, 96669 09192, 180042500009కు సంప్రతించాలన్నారు.

సరదాలకు సమయం కాదు: ఎంపీ శ్రీ భరత్‌

ఎంపీ శ్రీభరత్‌ మాట్లాడుతూ కొందరు బీచ్‌లో సెల్ఫీలు తీసుకుంటున్నారని, దయచేసి అలా చేయవద్దని హితవు పలికారు. సరదాలకు ఇది సమయం కాదన్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని సూచించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించానని, అధికారులు, సిబ్బంది పక్కాగా చర్యలు చేపట్టారన్నారు.

సమీక్షించిన మంత్రి

మంగళవారం రాత్రి జిల్లా అధికారులతో ఇన్‌చార్జి మంత్రి బాల వీరాంజనేయస్వామి టెలీ కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. జిల్లా కలెక్టర్‌తోపాటు పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరో 24 గంటలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

Updated Date - Oct 29 , 2025 | 12:39 AM