Share News

స్ర్తీశక్తికి ఘాట్‌ మార్గమే అడ్డంకి!

ABN , Publish Date - Aug 14 , 2025 | 11:33 PM

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించే స్ర్తీశక్తి పథకాన్ని పాడేరు ఆర్టీసీ డిపోలో శుక్రవారం కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌, ఆర్టీసీ విజయనగరం జోన్‌ చైర్మన్‌ సియ్యారి దొన్ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.

స్ర్తీశక్తికి ఘాట్‌ మార్గమే అడ్డంకి!
పాడేరు ఆర్టీసీ బస్‌ కాంప్లెక్స్‌

పాడేరు- అరకులోయకే ఉచిత ప్రయాణం

ఘాట్‌ నిబంధనల నేపథ్యం మిగతా ప్రాంతాలకు అవకాశం లేదు

నేడు పాడేరులో స్ర్తీశక్తి పథకం ప్రారంభం

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించే స్ర్తీశక్తి పథకాన్ని పాడేరు ఆర్టీసీ డిపోలో శుక్రవారం కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌, ఆర్టీసీ విజయనగరం జోన్‌ చైర్మన్‌ సియ్యారి దొన్ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఘాట్‌ మార్గంలో భద్రత, ప్రమాదాల దృష్ట్యా మన్యంలో కేవలం పాడేరు నుంచి అరకులోయకు తిరిగే బస్సుల్లో మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనున్నది. దీనిపై గిరిజనుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మన్యంలో కేవలం పాడేరు నుంచి అరకులోయకు రాకపోకలు సాగించేందుకు మాత్రమే స్ర్తీశక్తి పథకం వర్తిస్తుందని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. పాడేరు నుంచి అరకులోయ మినహా ఎటువైపు వెళ్లాలన్నా ఘాట్‌ ప్రయాణం తప్పనిసరి. ఈ క్రమంలో ఘాట్‌ మార్గాల్లో ప్రయాణించే మహిళలకు ఈ పథకం వర్తించదని అధికారులు చెబుతుండగా, ఏజెన్సీలో 5 శాతం మంది మహిళలు కూడా ఈ పథకాన్ని వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంటుంది. పూర్తిగా ఘాట్‌ మార్గాలుండే గిరిజన ప్రాంతాల్లో ఇటువంటి నిబంధన పెట్టి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టే పథకాన్ని గిరిజన మహిళలకు దూరం చేయడం సమంజసం కాదని మన్యం వాసులు అంటున్నారు. కాగా స్ర్తీశక్తి పథకంపై ప్రభుత్వం జారీ చేసిన జీవోలో పాడేరు ప్రాంతాల్లోని ఘాట్‌ మార్గాల్లో ఉచిత ప్రయాణం కల్పించబోమని పేర్కొనలేదు. అధికారులు చేసే ఇటువంటి చర్యలతో మహిళలకు పథకం అందకపోగా, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని పలువురు అంటున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ ఉన్నతాధికారులు పునరాలోచన చేసి గిరిజన ప్రాంతంలోని మహిళలందరికీ స్ర్తీశక్తి పథకంలో అన్ని రూట్లలో ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి తీసుకురావాలని గిరి మహిళలు కోరుతున్నారు.

Updated Date - Aug 14 , 2025 | 11:33 PM