Share News

వీడిన హత్య కేసు మిస్టరీ

ABN , Publish Date - Apr 30 , 2025 | 01:05 AM

కాకినాడ జిల్లాలో సంచలనం కలిగించిన గుర్తు తెలియని వ్యక్తి మృతి కేసులో మిస్టరీ వీడింది. రెండు నెలల క్రితం హత్యకు గురైన ఇతను అనకాపల్లి జిల్లా ఎలమంచిలి పట్టణానికి చెందిన తంగెళ్ల లోవరాజు (37)గా గుర్తించారు. భార్య, ఆమె ప్రియుడు, మరోవ్యక్తి కలిసి ఎలమంచిలిలో ఇంటి వద్ద హత్య చేసి, మృతదేహాన్ని కాకినాడ జిల్లా చేబ్రోలు బైపాస్‌ రోడ్డులో పడవేసినట్టు పోలీసు విచారణలో తేలింది. ఈ కేసును తదుపరి దర్యాప్తు నిమిత్తం ఎలమంచిలి పోలీసు స్టేషన్‌కు బదిలీ చేయనున్నట్టు గొల్లప్రోలు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.

వీడిన హత్య కేసు మిస్టరీ
హతుడు తంగెళ్ల లోవరాజు (ఫైల్‌ ఫొటో)

మృతుడు ఎలమంచిలి వాసిగా గుర్తింపు

రెండు నెలల క్రితం భార్య, ప్రియుడు, మరో వ్యక్తి కలిసి హత్య

కాకికాడ జిల్లా చేబ్రోలులో మృతదేహం పడవేత

మృతుడి తల్లి ఫిర్యాదుతో వీడిన మిస్టరీ

నిందితులను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు

గొల్లప్రోలు రూరల్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లాలో సంచలనం కలిగించిన గుర్తు తెలియని వ్యక్తి మృతి కేసులో మిస్టరీ వీడింది. రెండు నెలల క్రితం హత్యకు గురైన ఇతను అనకాపల్లి జిల్లా ఎలమంచిలి పట్టణానికి చెందిన తంగెళ్ల లోవరాజు (37)గా గుర్తించారు. భార్య, ఆమె ప్రియుడు, మరోవ్యక్తి కలిసి ఎలమంచిలిలో ఇంటి వద్ద హత్య చేసి, మృతదేహాన్ని కాకినాడ జిల్లా చేబ్రోలు బైపాస్‌ రోడ్డులో పడవేసినట్టు పోలీసు విచారణలో తేలింది. ఈ కేసును తదుపరి దర్యాప్తు నిమిత్తం ఎలమంచిలి పోలీసు స్టేషన్‌కు బదిలీ చేయనున్నట్టు గొల్లప్రోలు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.

కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు బైపాస్‌ రోడ్డులో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఇంటి సమీపంలో మార్చి మూడో తేదీన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహంపై ఉన్న గాయాలు, పడి ఉన్న తీరును పరిశీలించిన పోలీసులు... ఇది హత్యాగా నిర్ధారించారు. ఎస్పీ బిందుమాధవ్‌, ఏఎస్పీ మనీష్‌ దేవరాజ్‌ పాటిల్‌ స్వయంగా సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. ఎస్పీ ఆదేశాల మేరకు పిఠాపురం సీఐ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీలు, అత్యాధునిక సాంకేతిక పద్ధతులు, సెల్‌టవర్‌ సిగ్నల్స్‌ ఆధారంగా సీఐ శ్రీనివాస్‌, గొల్లప్రోలు ఎస్‌ఐ రామకృష్ణ, పోలీసులతో కూడిన బృందం చేసిన విచారణలో ఎర్ర రంగు కారు, ఇతర ఆధారాలు లభ్యమైనప్పటికీ వాటి ఆధారంగా కేసు ముందుకు వెళ్లలేదు. ఈ నేపథ్యంలో తన కుమారుడు తంగెళ్ల లోవరాజు రెండు నెలల నుంచి కనిపించడం లేదంటూ అనకాపల్లి జిల్లా ఎలమంచిలి పోలీసు స్టేషన్‌లో సోమవారం సాయంత్రం ఓ మహిళ ఫిర్యాదు చేసింది. పోలీసు శాఖ వెబ్‌సైట్‌లో నమోదైన ఈ కేసు వివరాలను పరిశీలించిన గొల్లప్రోలు పోలీసులు వెంటనే ఎలమంచిలి పోలీసులతో మాట్లాడారు. అనంతరం లోవరాజు తల్లి, భార్య, ఇతర కుటుంబ సభ్యులను మంగళవారం స్టేషన్‌కు పిలిపించి విచారించారు.

భార్య, ఆమె ప్రియుడు కలిసి హత్య?

ఎలమంచిలి పట్టణంంలోని ధర్మవరానికి చెందిన తంగెళ్ల లోవరాజు(37)కు ఏలూరుకు చెందిన శ్యామలతో వివాహమైంది. వీరికి ఇద్దరు ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్యామలకు బావ వరుసైన మోహనకుమార్‌తో వివాహేతర సంబంధం ఉంది. దీనిని గుర్తించిన లోవరాజు ఇద్దరినీ హెచ్చరించాడు. ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్న లోవరాజు ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి విధులు ముగిసిన తరువాత వచ్చి నిద్రపోయాడు. తరువాత శ్యామల, మోహన్‌కుమార్‌ కలిసి లోవరాజును కత్తితో పొడిచి హత్యచేశారు. మోహనకుమార్‌ వద్ద పనిచేసే గంగాధర్‌ వీరికి సహకరించాడు. లోవరాజు మృతదేహాన్ని ఎర్ర రంగు కారులో వేసుకుని కాకినాడ జిల్లా చేబ్రోలు బైపాస్‌ రోడ్డులోకి తీసుకువచ్చి పడవేశారు. మరుసటి రోజు ఉదయం శ్యామల ఇల్లు కడుగుతుండగా.. తన కుమారుడి గురించి లోవరాజు తల్లి ఆరా తీసింది. ఇప్పుడే బయటకు వెళ్లాడని శ్యామల చెప్పింది. రక్తపు మరకలు కనిపించడంతో ఆమె ప్రశ్నించగా పిల్లి చనిపోయిందని శ్యామల కప్పిపుచ్చింది. అప్పటి నుంచి కుమారుడు ఇంటికి రాకపోవడం, కోడలి ప్రవర్తన అనుమానాస్పదంగా వుండడంతో లోవరాజు తల్లి సోమవారం సాయంత్రం ఎలమంచిలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గొల్లప్రోలు, ఎలమంచిలి పోలీసులు లోవరాజు భార్య శ్యామల, ఆమె ప్రియుడు మోహనరావులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. తొలుత బుకాయించినప్పటికీ పోలీసులు అన్ని ఆధారాలను వారి ముందుంచడంతో నేరం చేసినట్టు ఒప్పుకున్నారు. గంగాధర్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. గొల్లప్రోలు పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసును ఎలమంచిలి పోలీసుస్టేషన్‌కు బదిలీ చేయనున్నారు.

Updated Date - Apr 30 , 2025 | 01:05 AM