Share News

కదిలిన జగన్నాథుని రథం

ABN , Publish Date - Jun 27 , 2025 | 11:54 PM

జగన్నాథస్వామి రథయాత్ర శుక్రవారం పట్టణంలో అంగరంగ వైభవంగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొని స్వామివారి రథాన్ని ఉత్సాహంతో లాగారు.

కదిలిన జగన్నాథుని రథం
రథోత్సవాన్ని పారంభిస్తున్న ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ

భక్తి శ్రద్ధలతో ఘనంగా రథయాత్ర

అనకాపల్లి టౌన్‌, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): జగన్నాథస్వామి రథయాత్ర శుక్రవారం పట్టణంలో అంగరంగ వైభవంగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొని స్వామివారి రథాన్ని ఉత్సాహంతో లాగారు. అంతకుముందు ఉదయం అగ్గిమర్రిచెట్టు వద్ద గల జగన్నాథస్వామి ఆలయంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిల ఉత్సవమూర్తులకు అర్చకుడు బి.సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పదిన్నర గంటలకు ఉత్సవమూర్తులను ప్రత్యేక రథంపైకి తీసుకువచ్చి అలంకరించారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ రథోత్సవాన్ని ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, గవర కార్పొరేషన్‌ చైర్మన్‌ మళ్ల సురేంద్ర, వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్‌, తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రారంభమైన రథయాత్ర గవరపాలెంలో పలు వీధులగుండా సాగి మెయిన్‌రోడ్డుకు చేరుకుంది. వన్‌ వే ట్రాఫిక్‌ డౌన్‌, వేగివీధి, చింతావారివీధి, చిననాలుగురోడ్ల జంక్షన్‌, స్టేషన్‌రోడ్డు మీదుగా రాత్రికి గూడ్స్‌షెడ్డు వద్ద గల ఇంద్రదుమ్న మందిరానికి చేరుకుంది. రథంలో నుంచి ఉత్సవమూర్తులను బయటకు తీసుకువచ్చి వేదికపై ఉంచి పూజలు చేశారు. ఆలయ చైర్మన్‌ దాడి బుజ్జి, దేవదాయ శాఖ సహాయ కమిషనర్‌ సుధారాణి, ఆలయ ఈవో బి.మురళీ, పాలకవర్గ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Jun 27 , 2025 | 11:54 PM