Share News

కరుణించిన వరుణుడు

ABN , Publish Date - Jul 21 , 2025 | 12:13 AM

జిల్లాలోని చోడవరం, మాడుగుల, అనకాపల్లి, ఎలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో ఆదివారం మధ్యాహ్నం తరువాత మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అంతకుముందు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీక్షణంగా కాసింది. రెండు గంటల తరువాత వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమై వర్షం పడింది. అపరాలు, చిరుధాన్యాల పంటలతోపాటు వరి నారుమళ్లకు ఈ వర్షం ఎంతో మేలు చేస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కరుణించిన వరుణుడు
చోడవరంలో కురుస్తున్న వర్షంం

చోడవరం, మాడుగుల, ఎలమంచిలి, అనకాపల్లి నియోజకవర్గాల్లో వర్షం

అపరాలు, చిరుధాన్యాల పంటలకు మేలు

వరినారుమళ్లకు ఊపిరి పోసిన వాన

చోడవరంలో భారీ వర్షం

జిల్లాలోని చోడవరం, మాడుగుల, అనకాపల్లి, ఎలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో ఆదివారం మధ్యాహ్నం తరువాత మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అంతకుముందు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీక్షణంగా కాసింది. రెండు గంటల తరువాత వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమై వర్షం పడింది. అపరాలు, చిరుధాన్యాల పంటలతోపాటు వరి నారుమళ్లకు ఈ వర్షం ఎంతో మేలు చేస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

చోడవరం, జూలై20 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అంతకుముందు ఉదయం నుంచి మద్యాహ్నం రెండు గంటల వరకు తీక్షణంగా కాసిన ఎండ, ఉక్కపోతతో జనం అల్లాడిపోయారు. తరువాత వాతావరణం పూర్తిగా మారిపోయింది. మూడు గంటల సమయంలో ఉరుములు, పిడుగులతో గంటకు పైగా భారీ వర్షం కురిసింది. గాలుల కారణంగా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఉపశమం చెందారు. కాగా మండలంలో 37 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు.

రావికమతం మండలంలో..

రావికమతం, జూలై 20 (ఆంధ్రజ్యోతి): మండలంలో ఆదివారం మధ్యాహ్నం తరువాత ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. పల్లపు ప్రాంతాల్లో నీరు చేరింది. కొద్ది రోజుల నుంచి వర్షాలు లేకపోగా.. వేసవిని తలపించేలా ఎండలు కాస్తుండడంతో వరి నారుమళ్లు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. రైతులు ఆందోళన చెందుతున్న తరుణంలో వర్షం పడడంతో ఊటర చెందారు. వరి ఆకుమడులకు ఈ వర్షం ఊపిరి పోసిందని అంటున్నారు. అదే విధంగా ఇప్పటికే నాటిన సరుగుడు మొక్కలకు ఈ వర్షం ఎంతో దోహదపడుతుందని చెబుతున్నారు.

చీడికాడలో భారీ వర్షం

చీడికాడ, జూలై 20 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రం చీడికాడతోపాటు పలు గ్రామాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. రెండు, మూడు వారాల క్రితం వరి విత్తనాలు చల్లిన తరువాత వర్షాలు లేకపోవడంతో నారుమడులు ఎండిపోయి బీటులువారాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆదివారం భారీ వర్షం కురవడంతో రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. అయితే వరినాట్లు వేయడానికి భారీ వర్షాలు కురవాల్సిన అవసరం వుందని అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Jul 21 , 2025 | 12:13 AM