Share News

గాడి తప్పిన వైద్య ఆరోగ్యశాఖ

ABN , Publish Date - Jun 23 , 2025 | 11:38 PM

జిల్లాలో గత రెండేళ్లుగా వైద్య ఆరోగ్యశాఖ గాడి తప్పిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పలువురు ఉద్యోగులు ముఠాగా ఏర్పడి దందాలు కొనసాగించారనే విమర్శలున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిగా ఇప్పటి వరకు బాధ్యతలు నిర్వర్తించిన డాక్టర్‌ జమాల్‌ బాషా తాజాగా కడపకు బదిలీ కావడం, ఆయన స్థానంలో స్థానికుడైన డాక్టర్‌ విశ్వేశ్వరనాయుడు సోమవారం బాధ్యతలు స్వీకరించడంతో ఇప్పటికైనా ఈ శాఖ గాడిన పడుతుందనే ఆశాభావాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

 గాడి తప్పిన వైద్య ఆరోగ్యశాఖ
పాడేరులో డీఎంహెచ్‌వో కార్యాలయం ఉండే ఐటీడీఏ కార్యాలయం

రెండేళ్లుగా పలువురు ఉద్యోగులు ముఠాగా ఏర్పడి దందాలు

డీఎంహెచ్‌వోను ప్రసన్నం చేసుకుని అక్రమాలు

కలెక్టర్‌, జేసీలను సైతం తప్పుదోవ పట్టించిన వైనం

తాజాగా జమాల్‌ బాషా బదిలీతో బయటపడుతున్న బాధితులు

డీఎంహెచ్‌వోగా విశ్వేశ్వరనాయుడు బాధ్యతల స్వీకరణ

ఇప్పటికైనా అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని పలువురి ఆశాభావం

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో గత రెండేళ్లుగా వైద్య ఆరోగ్యశాఖ గాడి తప్పిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పలువురు ఉద్యోగులు ముఠాగా ఏర్పడి దందాలు కొనసాగించారనే విమర్శలున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిగా ఇప్పటి వరకు బాధ్యతలు నిర్వర్తించిన డాక్టర్‌ జమాల్‌ బాషా తాజాగా కడపకు బదిలీ కావడం, ఆయన స్థానంలో స్థానికుడైన డాక్టర్‌ విశ్వేశ్వరనాయుడు సోమవారం బాధ్యతలు స్వీకరించడంతో ఇప్పటికైనా ఈ శాఖ గాడిన పడుతుందనే ఆశాభావాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

స్థానిక వైద్య ఆరోగ్యశాఖలోని పలువురు ఉద్యోగులు ఒక ముఠాగా ఏర్పడి రెండేళ్లుగా దందాలు చేశారని తెలిసింది. కడపకు చెందిన డీఎంహెచ్‌వో జమాల్‌ బాషా తరచూ స్వస్థలానికి రాకపోకలు సాగించేందుకు విమానం టికెట్‌లు తీసి ఇవ్వడంతో ఆయన ఆ ముఠా జోలికి వెళ్లలేదని తెలిసింది. ఇదే అదనుగా వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందికి అక్రమ డిప్యూటేషన్లు వేయడం, సర్వీసు మేటర్లను సెటిల్‌ చేయడం ద్వారా అధిక మొత్తంలో వారి నుంచి ముఠా సభ్యులు గుంజారని ఉద్యోగులే స్వయంగా చెబుతున్నారు. అలాగే పలు శాఖాపరమైన చర్యల్లో భాగంగా సస్పెన్షన్‌కు గురైన ఉద్యోగుల సస్పెన్షన్లను ఎత్తేయడంలోనూ బాగానే చేతివాటం చూపారని సమాచారం. ఫేషియల్‌ అటెండెన్స్‌ మొదలుకుని పలు రకాల సర్వీసు మేటర్లలోని లొసుగులను ఉపయోగించుకుని సిబ్బంది నుంచి అందినంత వసూలు చేశారని పలువురు చెబుతున్నారు.

కలెక్టర్‌, జేసీని సైతం తప్పుదోవ పట్టించి...

డీఎంహెచ్‌వో కార్యాలయంలో దందాలకు పాల్పడుతున్న ముఠా సాక్షాత్తూ కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌లను సైతం తప్పుదోవ పట్టించిన వైనం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తమ అక్రమాలకు అనుకూలంగా లేరనే అక్కసుతో తోటి ఉద్యోగులను దొంగలుగా చిత్రీకరించి సస్పెండ్‌ చేయించిన వైనంలో కలెక్టర్‌, జేసీలను తప్పుదోవ పట్టించారని తేలింది. ముగ్గురు ఉద్యోగులను టార్గెట్‌ చేసి, వాళ్ల ఆఫీసులోని ఫైళ్లను దొంగతనం చేశారని కలెక్టర్‌, జేసీలను సైతం తప్పుదారి పట్టించి వారిని సస్పెండ్‌ చేయించారు. తమకు జరిగిన అన్యాయంపై బాధిత ఉద్యోగులు కలెక్టర్‌ను స్వయంగా కలిసి వివరించడంతో వారి సస్పెన్షన్‌ను ఎత్తి వేయడంతో పాటు ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని ఏడీఎంహెచ్‌వోను ఆదేశించి అలక్ష్యంగా ఉన్న డీఎంహెచ్‌వో జమాల్‌బాషాను కలెక్టర్‌ మందలించారు. ఇవి వెలుగులోకి వచ్చిన వైనాలు మాత్రమేనని, ఇంకా వెలుగులోకి రాని ఎన్నో అక్రమాలు డీఎంహెచ్‌వో కార్యాలయంలో చోటుచేసుకున్నాయని, కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి సారిస్తే ఈ శాఖ గాడిన పడుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

డీఎంహెచ్‌వోగా విశ్వేశ్వరనాయుడు బాధ్యతల స్వీకరణ

జిల్లా అంధత్వ నివారణ సంస్థ జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్‌గా పని చేస్తున్న సీనియర్‌ అధికారి డాక్టర్‌ టి.విశ్వేశ్వరనాయుడు సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ సేవలను మరింతగా మెరుగుపరుస్తానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. గతంలో జరిగిన అక్రమాలు, దందాలకు అడ్డుకట్ట వేసి ఉద్యోగుల సంక్షేమం, ప్రజారోగ్యం మెరుగుకు ఆయన కృషి చేయాలని పలువురు ఉద్యోగులు కోరుతున్నారు.

Updated Date - Jun 23 , 2025 | 11:38 PM