కన్నుల పండువగా సీతారాముల కల్యాణం
ABN , Publish Date - Apr 06 , 2025 | 11:15 PM
జిల్లాలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. జిల్లాలో పాడేరు, అరకులోయ, రంపచోడవరం అసెంబ్లీ స్థానాల్లో ఉన్న అన్ని రామాలయాల్లోనూ నవమి వేడుకలను వైభవంగా నిర్వహించారు.
జిల్లాలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
పాడేరు, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): జిల్లాలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. జిల్లాలో పాడేరు, అరకులోయ, రంపచోడవరం అసెంబ్లీ స్థానాల్లో ఉన్న అన్ని రామాలయాల్లోనూ నవమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. జిల్లా కేంద్రం పాడేరులోని సుండ్రుపుట్టు వీధిలో మొదలుకుని వాడవాడలా సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే రామాలయాలకు భక్తులు తరలివచ్చారు. అర్చకులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి సీతారాముల కల్యాణాన్ని వైభవంగా జరిపించారు. స్థానిక సుండ్రుపుట్టులో, మండలంలోని సూకూరుపుట్టు, ఇరడాపల్లి, కిండంగి, సలుగు, హుకుంపేట మండలం గడుగుపల్లిలో అత్యంత వైభవంగా శ్రీరామనవమి వేడుకలు జరిపారు. ఆదివారం ఎక్కడ చూసినా నవమి సందర్భంగా భక్తుల కోలాహలంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.