మన్యం బంద్ సంపూర్ణం!
ABN , Publish Date - May 03 , 2025 | 12:56 AM
గిరిజన అభ్యర్థుల కోసం ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని, ఏజెన్సీలోని ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ స్థానిక ఎస్టీ అభ్యర్థులతో మాత్రమే భర్తీ చేయాలనే డిమాండ్ చేస్తూ ‘స్పెషల్ డీఎస్సీ సాధన సమితి’ తలపెట్టిన మన్యం బంద్ శుక్రవారం సంపూర్ణంగా, ప్రశాంతంగా ముగిసింది. గిరిజన ప్రాంతంలోని టీచర్ పోస్టులను ఇతరులతో భర్తీ చేయవద్దని డిమాండ్ చేస్తూ గిరిజనులు స్వచ్ఛందంగా బంద్ పాటించి, తమ నిరసనను బలంగా వినిపించారు.
డీఎస్సీ సాధన సమితి పిలుపుతో రోడ్డెక్కిన గిరిజనులు
ఏజెన్సీలోని టీచర్ పోస్టులన్నీ ఎస్‌టీలతో భర్తీ చేయాలి
గిరిజనులకు ప్రత్యేక డీఎస్‌సీ ప్రకటించాలి
షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగ నియామక చట్టం రూపొందించాలి
డీఎస్‌సీ సాధన సమితి ప్రతినిధులు డిమాండ్
బంద్‌కు మద్దతు పలికిన వైసీపీ
పాడేరు, మే 2 (ఆంధ్రజ్యోతి): గిరిజన అభ్యర్థుల కోసం ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని, ఏజెన్సీలోని ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ స్థానిక ఎస్టీ అభ్యర్థులతో మాత్రమే భర్తీ చేయాలనే డిమాండ్ చేస్తూ ‘స్పెషల్ డీఎస్సీ సాధన సమితి’ తలపెట్టిన మన్యం బంద్ శుక్రవారం సంపూర్ణంగా, ప్రశాంతంగా ముగిసింది. గిరిజన ప్రాంతంలోని టీచర్ పోస్టులను ఇతరులతో భర్తీ చేయవద్దని డిమాండ్ చేస్తూ గిరిజనులు స్వచ్ఛందంగా బంద్ పాటించి, తమ నిరసనను బలంగా వినిపించారు. మన్యం బంద్‌కు వైసీపీకి చెందిన అరకులోయ ఎంపీ డాక్టర్ జి.తనూజారాణి, జడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర, పాడేరు, అరకులోయ ఎమ్మెల్యేలు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, రేగం మత్స్యలింగం, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మద్దతుగా నిలిచారు. జిల్లా కేంద్రంతోపాటు అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో గిరిజనులు బంద్‌లో పాలుపంచుకున్నారు. పాడేరులో తెల్లవారుజామున ఐదు గంటలకే ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, డీఎస్‌సీ సాధన సమితి ప్రతినిధులు పి.అప్పలనర్స, కె.రాధాకృష్ణ, ఎస్.మాణిక్యం, కిల్లో సురేంద్ర, కె.కాంతారావు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు రోడ్లపైకి వచ్చి బంద్‌ను పర్యవేక్షించారు. సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ మేరకు జీవో-3 పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని, షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగ నియామక చట్టాన్ని రూపొందించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఎంపీ జి.తనూజారాణి, జడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి పాడేరులోని ఆర్‌టీసీ కాంప్లెక్స్ రోడ్డులో బైఠాయించి బంద్‌కు మద్దతు తెలిపారు.
మన్యం బంద్ కారణంగా ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితం అయ్యాయి. ప్రైవేటు జీపులు, ఆటోలను ఆందోళనకారులు ఎక్కడికక్కడ నిలిపేశారు. పాడేరులో దుకాణాలు, హోటళ్లు, ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు మూతపడ్డాయి. జనం సైతం ఇళ్లకే పరిమితం కావడంతో రహదారులు నిర్మానుష్యంగా మారాయి. నిత్యం జనంతో రద్దీగా ఉండే అంబేడ్కర్ కూడలి, మెయిన్ రోడ్లు బోసిపోయాయి.
అరకులోయలో..
అరకులోయ, మే 2 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ ఆధ్వర్యంలో అరకులోయలో శుక్రవారం నిర్వహించిన బంద్ విజయవంతమైంది. పర్యాటక కేంద్రాలైన గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్, కాఫీ మూజియంతోపాటు రిసార్టులు, హోటళ్లు, దుకాణాలు మూతబడ్డాయి. ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలు నడవలేదు. ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్, కిండంగి రామారావు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు, ఆదివాసీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు చట్టు మోహన్, కాంగ్రెస్ నాయకురాలు పాచిపెంట శాంతకుమారి, తదితరులు బంద్‌లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే రేగం మత్సలింగం, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, వైసీపీ నాయకులు బంద్‌కు మద్దతు తెలిపారు.
తెరుచుకోని బొర్రా గుహలు
అనంతగిరి, మే 2 (ఆంధ్రజ్యోతి): స్పెషల్ డీఎస్సీ సాధన సమితి బంద్ పిలుపు కారణంగా మండలంలో పర్యాటక ప్రదేశాలు మూతపడ్డాయి. బొర్రా గుహల ప్రవేశ మార్గంలోని ప్రధాన గేటుకు తాళం వేశారు. బంద్ విషయం తెలియక వచ్చిన పర్యాటకులు నిరాశతో వెనుదిరిగారు..
నేడూ మన్యం బంద్
పాడేరు, మే 2 (ఆంధ్రజ్యోతి): గిరిజనులకు ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలనే డిమాండ్‌పై రెండో రోజైన శనివారం కూడా బంద్‌ను చేపడతామని ప్రత్యేక డీఎస్సీ సాధన సమితి ప్రతినిదులు పి.అప్పలనర్స, కె.రాధాకృష్ణ ప్రకటించారు. శుక్రవారం మన్యం బంద్ సంపూర్ణంగా విజయవంతమైనప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో రెండో రోజు కూడా బంద్ నిర్వహించాలని నిర్ణయించామని, ఇందుకు అందరూ సహకరించాలన్నారు. మెగా డీఎస్సీలో గిరిజన అభ్యర్థులకు జరుగుతున్న అన్యాయంపై చేపడుతున్న ఈ కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని కోరారు. కాగా శనివారం బంద్‌కు సంపూర్ణంగా సహకరిస్తామని సీపీఎం, సీపీఐ, గిరిజన సంఘం, పలు ప్రజాసంఘాలు ప్రకటించాయి.