వైసీపీ ప్రభుత్వ మాయాజాలం!
ABN , Publish Date - Oct 31 , 2025 | 11:57 PM
అభివృద్ధి పేరుతో వైసీపీ ప్రభుత్వం గిరిజనులను మోసం చేసింది. నిధులు మంజూరు చేయకుండానే డౌనూరులో కాఫీ ప్రాసెసింగ్ యూనిట్‌కు శంకుస్థాపన చేశారనే వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఈ ప్రొసెసింగ్ యూనిట్‌కు ప్లాన్ లేదు.. నిధులు మంజూరు కాలేదు.. టెండర్లు పిలవలేదు.. కానీ పిల్లర్ల వరకు పనిచేయించారు. ఇది వైసీపీ ప్రభుత్వ మార్కు మాయాజాలం.
కాఫీ ప్రొసెసింగ్ యూనిట్ పేరుతో
గిరిజనులను మభ్యపెట్టిన వైసీపీ పాలకులు
నిర్మాణాలకు శంకుస్థాపన చేసి రెండేళ్లు
పిల్లర్లకే పరిమితమైన నిర్మాణాలు
ప్లాన్ అప్రూవల్ లేదు..
నిధులు మంజూరు కాలేదు..
టెండర్లు పిలవలేదు..
అయినా పనులు ప్రారంభించారు..
కొయ్యూరు, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి):
మండలంలోని డౌనూరులో గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సమీకృత కాఫీ ప్రొసెసింగ్ యూనిట్ గడిచిన రెండేళ్లు పిల్లర్లకే పరిమితమైంది. డౌనూరులో కాఫీ క్యూరింగ్, రోస్టింగ్, గ్రైండింగ్, ప్యాకింగ్ చేసేందుకు రూ. 4 కోట్లతో సమీకృత కాఫీ ప్రొసెసింగ్ యూనిట్ నిర్మాణానికి 2023 సంవత్సరం అక్టోబరు 20న అప్పటి రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖా మంత్రి రాజన్నదొర శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆరు నెలల్లో పూర్తి చేస్తామని ప్రకటించారు. అయితే మంత్రి ప్రకటించిన కాలపరిమితి పూర్తయి అదనంగా మరో ఏడాదిన్నర అయినా పిల్లర్లకే పరిమితమైంది. పనులు జరగడం లేదని ఆరా తీస్తే.. ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ఈ ప్రొసెసింగ్ యూనిట్‌కు అవసరమైన ప్లాన్ లేనేలేదు. టెండర్లు పిలవలేదు.. నిధులు మంజూరు అసలు కాలేదు. కాని ఒక కాంట్రాక్టర్‌కు చెప్పి పనులు చేయించారు. కట్ చేస్తే.. ఈ సమీకృత కాఫీ ప్రొసెసింగ్ యూనిట్‌కు కేటాయించిన స్థలంలో గతంలో ఉన్న జీసీసీ గొడౌన్, పక్కనే గల డిపో భవనాలు ఉండేవి. వాటిని తొలగించేందుకు కనీస అనుమతులు కూడా తీసుకోలేదు. వాటిలో ఉన్న సరుకులను యుద్ధప్రాతిపదికన తరలించి, ఖాళీ చేయించారు. తర్వాత ఆ భవనాలను కూల్చేశారు. భవనాలకు సంబంధించిన విలువైన కలప, ఇతర మెటీరియల్‌ను విక్రయించుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తర్వాత ఒక కాంట్రాక్టర్ చేపట్టారు. పిల్లర్లు వరకు పనులు చేశారు. బిల్లు విషయమై మాట్లాడగా నిధులు లేవని అధికారుల నుంచి సమాధానం రావడంతో పనులు నిలిపేశారు. ప్రొసెసింగ్ యూనిట్‌కు 2023 అక్టోబరులో శంకుస్థాపన జరపగా.. 2024 మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఈ ఐదు నెలల్లో పిల్లర్ల వరకు పనులు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం నిధులు లేకుండా గిరిజనులను మభ్యపెట్టేందుకు ఈ శంకుస్థాపన చేశారేతప్ప అభివృద్ధిలో భాగం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ యూనిట్ నిర్మాణాల జాప్యంపై జీసీసీ అధికారులను సంప్రదించగా.. యూనిట్ నిర్మాణాలకు సంబంధించిన ప్లాన్‌లో జాప్యం జరిగిందని అంటున్నారు. తర్వాత ప్లాన్ వచ్చిందని, త్వరలో పనులు ప్రారంభిస్తామంటూ చెబుతున్నారే తప్ప కార్యరూపం దాల్చడం లేదు. అయితే నిర్మాణానికి నిధులు విషయాన్ని జీసీసీ అధికారుల వద్ద ప్రస్తావిస్తే వారి నుంచి సమాధానం రాలేదు.