స్థానికులకు ఉక్కు మొండిచెయ్యి
ABN , Publish Date - Sep 14 , 2025 | 01:16 AM
విశాఖపట్నం స్టీల్ ప్లాంటు యాజమాన్యం కాంట్రాక్టు వర్కర్ల విషయంలో మొండిగా వ్యవహరిస్తోంది.
నాలుగు నెలల క్రితం 4,500 మంది కాంట్రాక్టు కార్మికుల తొలగింపు
వారి స్థానంలో ఇతర రాష్ట్రాల వారికి అవకాశం
నాలుగు రోజులుగా శిక్షణ
వ్యతిరేకిస్తున్న నిర్వాసితులు
ఆందోళనలు ప్రారంభం
విశాఖపట్నం, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం స్టీల్ ప్లాంటు యాజమాన్యం కాంట్రాక్టు వర్కర్ల విషయంలో మొండిగా వ్యవహరిస్తోంది. అవసరానికి మించి ఉన్నారంటూ మే నెలలో 4,500 మందిని తొలగించింది. ఇప్పుడు వివిధ పనులకు కాంట్రాక్టు వర్కర్లు అవసరం కావడంతో స్థానికులకు అవకాశం కల్పించకుండా బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి కూలీలను దిగుమతి చేసుకుంటోంది. ఈ విధంగా గత నాలుగు రోజులుగా రోజుకు 100 నుంచి 150 మందికి భద్రతా విభాగంలో శిక్షణ ఇస్తోంది.
ప్లాంటుకు కొత్తగా ఎవరైనా పని చేయడానికి వస్తే వారికి పని ప్రాంతంలో ఎలా ఉండాలి?, ఎలాంటి భద్రత పరికరాలు ధరించాలి?...అనే అంశాలపై వారం రోజులు శిక్షణ ఇస్తారు. అది పూర్తయిన వెంటనే ‘సేఫ్టీ పాస్’ అని ఒక సర్టిఫికెట్ ఇస్తారు. దాంతో వారు కాంట్రాక్టు వర్కర్లుగా ఏ విభాగంలోనైనా పనిచేసుకోవచ్చు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి ఇప్పుడు ఈ సేఫ్టీ పాస్‌లు ఇస్తున్నారు. అంటే తొలగించిన 4,500 కాంట్రాక్ట్ వర్కర్లలో ఎవరికీ పనిచేసే అవకాశం ఇవ్వకుండా పొరుగు రాష్ట్రాల వారిని తెప్పించి పనిచేయిస్తున్నారు. దీనిపై కాంట్రాక్ట్ వర్కర్ల సంఘం శనివారం ఆందోళనకు దిగింది. శిక్షణ కార్యాలయం ముందు నిరసన వ్యక్తంచేసింది. స్టీల్ ప్లాంటుకు భూములు ఇచ్చిన నిర్వాసితులకు, ఆ తరువాత ఇక్కడి స్థానికులకు ప్లాంటులో పనిచేసే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత నాలుగు దశాబ్దాలుగా ఆ నిబంధన అమలవుతున్నదని, ఇప్పుడు దానిని పక్కన పెట్టి పొరుగు రాష్ట్రాల వారితో పనిచేయిస్తున్నందున తాము ఆందోళనలు ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. మే నెలలో తొలగించిన కాంట్రాక్టు వర్కర్లలో 300 మంది నిర్వాసితులు ఉన్నారని, వారిని వీలైనంత త్వరగా మళ్లీ తీసుకుంటామని ఇటీవల జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ కు సీఎండీ సక్సేనా హామీ ఇచ్చారని, దానిని తుంగలో తొక్కారని, స్థానికులకు అన్యాయం చేస్తున్నారని సంఘ నాయకులు ఆరోపించారు. తొలగించిన కాంట్రాక్టు కార్మికులకు పనులు ఇవ్వాలని, లేదంటే నిరవధికంగా ఆందోళనలు కొనసాగిస్తామని నాయకులు ప్రసాద్, పరంధామయ్య, వంశీకృష్ణ ప్రకటించారు.
డీసీపీ-1 అజితా వేజెండ్ల బదిలీ
నెల్లూరు జిల్లా ఎస్పీగా నియామకం
విశాఖపట్నం, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి):
నగర పోలీస్ కమిషనరేట్‌లో డీసీపీ-1గా పనిచేస్తున్న అజితా వేజెండ్లకు శనివారం బదిలీ అయింది. ఆమెను నెల్లూరు జిల్లా ఎస్పీగా పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 14 మంది ఎస్పీ స్థాయి అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. అందులో భాగంగా ఆమెను నెల్లూరు జిల్లాకు బదిలీ చేశారు. ఆమె స్థానంలో కొత్తగా ఎవరినీ నియమించలేదు.
---------------
స్పా ముసుగులో వ్యభిచారం
గాజువాక ఎస్‌ఎస్ థాయ్ స్పాపై
టాస్క్‌ఫోర్స్, పోలీసుల దాడి
అదుపులో ఏడుగురు...
విశాఖపట్నం/గాజువాక, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి):
వ్యభిచారం నిర్వహిస్తున్న స్పా సెంటర్‌పై సిటీ టాస్క్‌ఫోర్స్, గాజువాక పోలీసులు శనివారం రాత్రి దాడి చేశారు. నిర్వాహకురాలితోపాటు ఒక విటుడు, ఐదుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గాజువాక చైతన్యనగర్‌లో గల ‘ఎస్‌ఎస్ థాయ్ స్పా’లో మసాజ్ పేరిట వ్యభిచారం నిర్వహిస్తున్నారు. మసాజ్ చేయడానికి అని చెప్పి ఉద్యోగంలోకి తీసుకున్న మహిళలను బలవంతంగా అందుకు ఉపయోగిస్తున్నారు. దీనిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో శనివారం గాజువాక పోలీసులతో కలిసి దాడి చేశారు. నిర్వాహకురాలితోపాటు విటుడిని అరెస్టు చేశారు. మహిళలను పునరావాస కేంద్రానికి అప్పగించారు.