Share News

బీఈడీ కాలేజీల ఇష్టారాజ్యం

ABN , Publish Date - Oct 24 , 2025 | 01:09 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.

బీఈడీ కాలేజీల ఇష్టారాజ్యం

కన్వీనర్‌ కోటాలో చేరిన విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు

ఏయూ పరిధిలోని అనేక కాలేజీల్లో అడ్డగోలు వైఖరి

ఫీజులు చెల్లించని వారికి తీవ్ర వేధింపులు

విశాఖపట్నం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. కన్వీనర్‌ కోటాలో సీట్లు దక్కించుకుని కాలేజీలో చేరేందుకు వెళుతున్న విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. సాధారణంగా ఎడ్‌సెట్‌ రాసి సీట్లు దక్కించుకున్న విద్యార్థులు రూపాయి కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, అందుకు విరుద్ధంగా అనేక కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. దీనిపై విద్యార్థులు ప్రశ్నిస్తున్నా పట్టించుకునే నాఽథుడే కనిపించడం లేదు. అడ్మిషన్స్‌ సమయంలో అడ్డగోలు వసూళ్లకు పాల్పడే కాలేజీలను నియంత్రించే బాధ్యతను ఏయూ అధికారులు తీసుకోవాలి. అవసరమైతే హెల్ప్‌లైన్‌ నంబర్‌ను అందుబాటులోకి తేవాలి. అయితే, ఈ తరహా ఏర్పాట్లను చేయకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు.

ఫీజు చెల్లిస్తేనే చేరే చాన్స్‌..

ఎడ్‌సెట్‌లో ర్యాంకులు సాధించి వర్సిటీ పరిధిలోని కాలేజీల్లో పలువురు విద్యార్థులు సీట్లు దక్కించుకున్నారు. వారంతా కాలేజీలకు వెళ్లగా యాజమాన్యాలు ఒక్కో విద్యార్థి వద్ద రూ.10 వేల నుంచి రూ.26 వేల వరకు వసూలు చేస్తున్నాయి. కొన్ని కాలేజీలు ఒకేసారి మొత్తం చెల్లించాలని కోరుతుండగా, మరికొన్ని రెండు, మూడు వాయిదాలు ఇచ్చాయి. ముందుగా ఫీజు చెల్లిస్తేనే కాలేజీల్లో చేరే అవకాశాన్ని కల్పిస్తుండడం పట్ల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏయూ పరిధిలో 59 కాలేజీలు

ఏయూ పరిధిలో ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో 59 బీఈడీ కాలేజీలు ఉన్నాయి. వీటిలో కొన్ని కాలేజీలు అడ్డగోలుగా ఫీజులు వసూలుచేస్తున్నాయి. ఫీజుల వసూలుపై విద్యార్థులు కొందరు వర్సిటీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అధికారులు స్పందించి ఇప్పటికే వసూలు చేసిన ఫీజులను తిరిగి చెల్లించేలా చూడాలని విద్యార్థులు కోరుతున్నారు.

Updated Date - Oct 24 , 2025 | 01:09 AM