భావి ఉపాధ్యాయుల ఆనంద హేల
ABN , Publish Date - Aug 29 , 2025 | 01:18 AM
మెగా డీఎస్సీలో మెరిట్ ప్రకారం కాల్ లెటర్లు అందుకున్న భావి ఉపాధ్యాయుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.
డీఎస్సీ మెరిట్ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం
విశాఖ విమల విద్యాలయంలో ప్రక్రియ పర్యవేక్షించిన జిల్లా పరిశీలకుడు, డీఈవో
ఇబ్బందుల పరిష్కారానికి తాత్కాలిక కౌంటర్
విశాఖపట్నం/ఉక్కుటౌన్‌షిప్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి):
మెగా డీఎస్సీలో మెరిట్ ప్రకారం కాల్ లెటర్లు అందుకున్న భావి ఉపాధ్యాయుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. సుమారు ఏడేళ్ల తరువాత నిర్వహించిన డీఎస్సీలో ప్రతిభ కనబరచిన అభ్యర్థుల ధ్రువపత్రాలను గురువారం నుంచి విశాఖ విమల విద్యాలయంలో పరిశీలించనున్నట్టు పాఠశాల విద్యా శాఖ ప్రకటించింది. ఈ మేరకు కుటుంబ సభ్యులతో కలిసి అభ్యర్థులు ఉదయం ఎనిమిది గంటలకే విద్యాలయ ప్రాంగణానికి చేరుకున్నారు. తొలిరోజు గదికి 50 మంది వంతున అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు ఏర్పాట్లు చేశారు. ఒక్కొక్క గదిలో అన్ని కేటగిరీలకు చెందిన అభ్యర్థులను కేటాయించారు. గతంలో కేటగిరీ, ర్యాంకుల వారీగా ధ్రువపత్రాల పరిశీలన ఉండేది. కాగా అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు సంబంధించి ఇబ్బందులు ఉన్నా, ఇతరత్రా సందేహాలున్నా నివృత్తి చేసేందుకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మధుసూదనరావు నేతృత్వంలో రెవెన్యూ అధికారుల బృందం విమల విద్యాలయంలో అందుబాటులో ఉంది. ధ్రువపత్రాలపై గెజిటెడ్ అధికారి సంతకం అవసరమనుకుంటే అక్కడ విధులు నిర్వహించి హైస్కూల్ హెచ్‌ఎంలు సంతకం చేశారు.
ఉదయం పది గంటల నుంచి ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభించారు. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో ఒకేసారి పరిశీలన ప్రారంభం కావడంతో సర్వర్‌పై కొంత ఒత్తిడి పెరిగింది. దీంతో ఒక్కొక్క అభ్యర్థి ధ్రువపత్రాల పరిశీలనకు 15 నుంచి 20 నిమిషాల సమయం పట్టింది. మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్‌లో జరుగుతున్నప్పుడు పరీక్షలకు దరఖాస్తు చేసిన సమయంలో సమర్పించిన ధ్రువపత్రాలతో సరిపోల్చిన తరువాత వెరిఫికేషన్ అధికారి సెల్‌కు ఓటీపీ వస్తుంది. అక్కడితే పరిశీలన ప్రక్రియ పూర్తయినట్టుగా ప్రకటిస్తున్నారు. కొందరు మహిళా అభ్యర్థులు భర్త కులధ్రువీకరణ పత్రం తీసుకురాగా తిరస్కరించారు. తండ్రి కుల ధ్రువీకరణ పత్రం ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉన్నందున సర్టిఫికెట్ తీసుకురావడానికి సమయం ఇస్తున్నారు. కాగా ధ్రువపత్రాల పరిశీలనకు జిల్లా పరిశీలకుడిగా నియమితులైన కేజీబీవీ విద్యాలయాల సెక్రటరీ దేవానందరెడ్డి మొత్తం ప్రక్రియను పర్యవేక్షించారు. అవసరమైన సూచనలు చేశారు. పాఠశాల విద్యా శాఖ విశాఖ ప్రాంతీయ సంచాలకుడు విజయభాస్కర్ నేతృత్వంలో విశాఖ డీఈవో నిమ్మక ప్రేమ్‌కుమార్ ధ్రువపత్రాల పరిశీలన చూస్తున్నారు. జిల్లాలో ఎంఈవోలు, హెచ్‌ఎంలు, ఇతర సిబ్బంది ధ్రువపత్రాల పరిశీలన విధులు నిర్వహించారు. అయితే సర్వర్ నెమ్మదిగా పనిచేయడంతో ధ్రువపత్రాల పరిశీలన గురువారం రాత్రి వరకూ కొనసాగింది.
శ్రమించారు, సాధించారు
తండ్రి లక్ష్యం కోసం ఒకరు...
అవమానాలను తట్టుకుని మరొకరు
ఎస్జీటీలో జిల్లా ప్రథమ,
ద్వితీయ ర్యాంకర్ల విజయగాథ
ఉమ్మడి జిల్లాలో ఎస్జీటీ పోస్టులకు 14,500 మంది పోటీపడితే వారిలో 92.9 మార్కులతో గనివాడ సుజాత ప్రథమ ర్యాంకు, 92.58 మార్కులతో తాటికొండ ధనలక్ష్మి రెండో ర్యాంకు సాధించారు. ఇరువురూ అనేక సవాళ్లను ఎదుర్కొని ఉపాధ్యాయ ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకుని అనుకున్నది సాధించారు.
చోడవరం మండలం రేవళ్లు గ్రామానికి చెందిన గనివాడ సత్యనారాయణకు ఇద్దరు కుమార్తెలు. ఉపాధ్యాయునిగా పనిచేయాలని సత్యనారాయణ ఆశపడినా కోర్కె నెరవేరలేదు. అయితే తాను చేయాలనుకున్న టీచర్ ఉద్యోగంలో తన ఇద్దరు కుమార్తెలను చూడాలనుకున్న సత్యనారాయణ అదే ఆశయంతో చదివించారు. పెద్దకుమార్తె ఉపాధ్యాయురాలిగా ఎంపికై ప్రస్తుతం పాడేరు సమీపాన ఒక స్కూలులో పనిచేస్తున్నారు. రెండో కుమార్తె సుజాత ఇటీవల నిర్వహించిన డీఎస్సీ (ఎస్జీటీ)లో ఏకంగా జిల్లాస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించి తండ్రి లక్ష్యాన్ని నేరవేర్చారు.
చెప్పలేనంత ఆనందంగా ఉంది
గనివాడ సుజాత, ఎస్జీటీ ప్రథమ ర్యాంకరు
ఎస్జీటీ కేటగిరీలో ప్రథమ ర్యాంకు వచ్చినందుకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. తండ్రి ఆశయం కోసం కష్టపడి చదివాను. ఇప్పుడు ఆయన లక్ష్యం, ఆశయం నెరవేరడం సంతోషంగా ఉంది. డీఎస్సీ నిర్వహిస్తామన్న ప్రభుత్వం హామీ నిలబెట్టుకుంది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే ఆశయంగా పనిచేస్తాను.
అవమానించిన చోట విజయగర్వంతో మరొకరు..
మాడుగుల మండలం జమ్మాదేవిపేటకు చెందిన తాటికొండ ధనలక్ష్మిది పేద కుటుంబం. భర్తకు అర ఎకరా పొలం మాత్రమే ఉంది. వారికి ఇద్దరు పిల్లలు. చదువు పట్ల ధనలక్ష్మిలో ఆసక్తిని గమనించిన భర్త అనేక కష్టాలకు ఓర్చి చదివించారు. ఇద్దరు పిల్లలు కలిగిన తరువాత ఽచదువు ఎందుకు? అంటూ గ్రామంలో అనేకమంది హేళన చేశారు. అన్నింటినీ భరిస్తూ డీఎస్సీకి ప్రిపేరైన ధనలక్ష్మి ఎస్జీటీ కేటగిరీలో జిల్లాలో ఏకంగా రెండో ర్యాంకు సాధించారు. అవమానాలు ఎదుర్కొన్న చోటే..భర్తను తల ఎత్తుకునేలా చేశారు.
మా జీవితాల్లో వెలుగులు నింపింది
తాటికొండ ధనలక్ష్మి, ఎస్‌జీటీ రెండో ర్యాంకు,
ఎస్టీటీ కేటగిరీలో రెండో ర్యాంకు సాధించడం ద్వారా ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఎంపిక కావడం మా కుటుంబంలో వెలుగులు నింపింది. నాకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. చదువంటే చాలా ఇష్టం. నా ఇష్టాన్ని గుర్తించి నా భర్త చదివించారు. మా గ్రామంలో కొంతమంది నా భర్తను, నన్ను హేళన చేశారు. అయినా వెనకడుగువేయకుండా కష్టపడి చదివాను. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి కలిగించేలా బోధన చేస్తాను.