ప్రయాణం దూరాభారం
ABN , Publish Date - Sep 25 , 2025 | 01:07 AM
వర్షాలతో రహదారులు ఛిద్రం కావడం, విజయరామరాజుపేట వద్ద కాజ్‌వే కొట్టుకుపోవడంతో చోడవరం- పాడేరు మధ్య ప్రయాణ సమయం రెట్టింపు అయ్యింది. గతంలో చోడవరం నుంచి ఆర్టీసీ బస్సులో రెండు లేదా రెండున్నర గంటల్లో పాడేరు చేరుకునేవారు. ఐదేళ్లుగా రహదారులు దెబ్బతినడడంతో ప్రయాణ సమయం మరో అరగంట పెరిగింది. ఈ నేపథ్యంలో బుచ్చెయ్యపేట మండలం విజయరామరాజుపేట వద్ద తాచేరు నదిపై వున్న కాజ్‌వే వరద ఉధృతికి కొట్టుకుపోవడంతో ఆర్టీసీ బస్సులను చోడవరం నుంచి చీడికాడ, అప్పలరాజుపురం, కె.జె.పురం జంక్షన్ మీదుగా మళ్లించారు.
విజయరామరాజుపేట వద్ద కాజ్‌వే కొట్టుకుపోవడంతో ప్రజలకు రవాణా కష్టాలు
చోడవరం-పాడేరు బస్సులు చీడికాడ మండలం మీదుగా మళ్లింపు
22 కిలోమీటర్లు పెరిగిన ప్రయాణ దూరం
ఇరుకు రహదారి కావడంతో స్తంభిస్తున్న ట్రాఫిక్
పాడేరు వెళ్లడానికి ఐదు గంటలకుపైగా సమయం
గతంలో రెండున్నర గంటల్లో గమ్యానికి చేరిక
కాజ్‌వేలను వెంటనే పునరుద్ధరించాలని ప్రజల వినతి
చోడవరం, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): వర్షాలతో రహదారులు ఛిద్రం కావడం, విజయరామరాజుపేట వద్ద కాజ్‌వే కొట్టుకుపోవడంతో చోడవరం- పాడేరు మధ్య ప్రయాణ సమయం రెట్టింపు అయ్యింది. గతంలో చోడవరం నుంచి ఆర్టీసీ బస్సులో రెండు లేదా రెండున్నర గంటల్లో పాడేరు చేరుకునేవారు. ఐదేళ్లుగా రహదారులు దెబ్బతినడడంతో ప్రయాణ సమయం మరో అరగంట పెరిగింది. ఈ నేపథ్యంలో బుచ్చెయ్యపేట మండలం విజయరామరాజుపేట వద్ద తాచేరు నదిపై వున్న కాజ్‌వే వరద ఉధృతికి కొట్టుకుపోవడంతో ఆర్టీసీ బస్సులను చోడవరం నుంచి చీడికాడ, అప్పలరాజుపురం, కె.జె.పురం జంక్షన్ మీదుగా మళ్లించారు. కాజ్‌వే బాగున్నప్పుడు చోడవరం నుంచి విజయరామరాజుపేట, వడ్డాది మీదుగా పాడేరుకు బస్సులు నడిచేవి. ఇప్పుడు చుట్టూ తిరిగి వెళ్లాల్సి రావడంతో 22 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తున్నది. చోడవరం నుంచి 55 కిలోమీటర్ల దూరంలో వున్న పాడేరు వెళ్లేందుకు ఇటీవల వరకు మూడు గంటల సమ సమయం పట్టేది. ఇప్పుడు మరో 22 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి రావడంతోపాటు ఇరుకు రహదారి కావవడంతో ఐదు గంటలు పడుతున్నది. చీడికాడ మండలంలోని రోడ్డు బాగానే ఉన్నప్పటికీ, అది సింగిల్ లేన్ రోడ్డు కావడంతో భారీ వాహనాలు ఎదురైతే తప్పుకోవడం కష్టంగా వుంది. ఈ కారణంగా తరచూ ట్రాఫిక్ స్తంభిస్తున్నది. దీంతో ప్రయాణ సమయం మరింత పెరుగుతున్నది. గతంలో విశాఖ నుంచి చోడవరం మీదుగా పాడేరుకు ఆర్టీసీ బస్సు మూడున్నర గంటల్లో వెళ్లేది. ఇప్పుడు ఆరు లేదా ఏడు గంటలు పడుతున్నదని ప్రయాణికులు వాపోతున్నారు.
మూడు మండలాల ప్రజల ఇక్కట్లు
విజయరామరాజుపేట వద్ద సుమారు ఐదు వారాల క్రితం కొట్టుకుపోయిన కాజ్‌వేను ఇంతవరకు పునరుద్ధరించకపోవడంతో పాడేరు ప్రాంతంతోపాటు మాడుగుల, చీడికాడ, రావికమతం మండలాల ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో మాడుగుల మీదుగా నడిచే బస్సుల్లో మాడుగుల మండలానికి చెందిన ప్రయాణికులు ఎక్కేవారు. ఒకవేళ బస్సు లేకపోయినా ఆటోల్లో వెళ్లేవారు. కానీ విజయరామరాజుపేటతోపాటు వడ్డాది వద్ద కాజ్‌వేలు దెబ్బతినడంతో ఆర్టీసీ అధికారులు బస్సు సర్వీసులు తగ్గించారు. దీంతో బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఆటోలకు అదనంగా డబ్బులు చెల్లించి గౌరీపట్నం, వడ్డాది మీదుగా లేదంటే చీడికాడ మండలం మీదుగా మాడుగులకు రాకపోకలు సాగిస్తున్నారు. అధికార యంత్రాంగం వెంటనే స్పందించి విజయరామరాజుపేట, వడ్డాది కాజ్‌వేల పునరుద్ధరణ పనులు చేపట్టాలని పలు మండలాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.