ప్రయాణం నరకప్రాయం
ABN , Publish Date - Dec 17 , 2025 | 11:36 PM
రెండు జిల్లాలను కలిపే ప్రధాన రహదారి గోతులు, రాళ్లు తేలి అధ్వానంగా ఉండడంతో ఆరు పంచాయతీలకు చెందిన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ మార్గంలో ప్రయాణించాలంటే ఒళ్లు హూనమవుతోందని వాపోతున్నారు.
అధ్వానంగా రెండు జిల్లాలను కలిపే ప్రధాన రహదారి
ఆడాకులు- నాతవరం వరకు గోతులమయం
ఆరు పంచాయతీల ప్రజలకు తప్పని ఇబ్బందులు
కొయ్యూరు, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): రెండు జిల్లాలను కలిపే ప్రధాన రహదారి గోతులు, రాళ్లు తేలి అధ్వానంగా ఉండడంతో ఆరు పంచాయతీలకు చెందిన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ మార్గంలో ప్రయాణించాలంటే ఒళ్లు హూనమవుతోందని వాపోతున్నారు.
జిల్లాలోని ఆడాకుల నుంచి అనకాపల్లి, కాకినాడ జిల్లాలను కలిపే నాతవరం ప్రధాన రహదారి అధ్వానంగా తయారైంది. సుమారు ఆరు కిలోమీటర్లు ఉండే ఆడాకుల- నాతవరం రహదారిని సుమారు రెండు దశాబ్దాల క్రితం నిర్మించారు. అల్లూరి జిల్లా నుంచి అనకాపల్లి జిల్లా నాతవరం మీదుగా అటు నర్సీపట్నం, అలాగే నాతవరం నుంచి తాండవ జంక్షన్ మీదుగా కాకినాడ జిల్లా తుని వెళ్లేందుకు మండల వాసులకు ఇదే ప్రధాన రహదారి. ఈ రహదారి మీదుగా మండలానికి చెందిన ఆరు పంచాయతీల ప్రజలు నర్సీపట్నం వెళ్లాలంటే సుమారు 15 కిలోమీటర్లు, తుని వెళ్లాలంటే 25 కిలోమీటర్లు మేర ప్రయాణం కలిసివస్తుంది. అలాగే తుని నుంచి మండల కేంద్రానికి వచ్చే వారికి ఈ రహదారి గుండా ప్రయాణంతో సమయం, దూరం కలిసి వస్తాయి. అటువంటి ఈ రహదారి అధ్వానంగా తయారైనా పట్టించుకునే నాథుడు లేడు. దీంతో వాహనచోదకులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఈ రహదారికి మరమ్మతులు చేపట్టాలని గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులను, అధికారులను వేడుకున్నా ఫలితం లేకపోయిందని, కూటమి ప్రభుత్వమైనా స్పందించి ఈ రోడ్డును బాగు చేయాలని ఆరు పంచాయతీల ప్రజలు కోరుతున్నారు.