Share News

గెడ్డల ఉధృతి తగ్గుముఖం

ABN , Publish Date - Oct 31 , 2025 | 11:58 PM

మొంథా తుఫాన్‌ ప్రభావంతో గత నాలుగు రోజులుగా ఉగ్రరూపం దాల్చిన గెడ్డలు శుక్రవారం నాటికి తగ్గుముఖం పట్టాయి.

గెడ్డల ఉధృతి తగ్గుముఖం
హుకుంపేట మండలంలో లివిటి కాజ్‌వేలో శుక్రవారం కింద నుంచి ప్రవహిస్తున్న నీరు

సాధారణ స్థితికి చేరిన జనజీవనం

మోస్తరుగా ప్రవహిస్తున్న గెడ్డలు, వాగులు

వర్షాలు తగ్గడంతో ఊరట చెందుతున్న గిరిజనం

(పాడేరు-ఆంధ్రజ్యోతి)

మొంథా తుఫాన్‌ ప్రభావంతో గత నాలుగు రోజులుగా ఉగ్రరూపం దాల్చిన గెడ్డలు శుక్రవారం నాటికి తగ్గుముఖం పట్టాయి. వర్షాలు గురువారం మఽధ్యాహ్నం నుంచి కురవకపోవడంతో జన జీవనం సాధారణ స్థితికి వచ్చింది. వాస్తవానికి గత కొన్నాళ్లుగా జిల్లా వ్యాప్తంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో మొంథా తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీవర్షాలకు పాడేరు, జి.మాడుగుల మండలాల్లోని మత్స్యగెడ్డ ఉగ్రరూపం దాల్చింది. పాడేరు మండలంలోని మత్స్యగెడ్డ, రాయిగెడ్డ, చిలకలమామిడి గెడ్డ, పాడేరు, పెదబయలు మండలాలకు సరిహద్దున ఉన్న పరదానిపుట్టు గెడ్డ, జి.మాడుగుల మండలంలోని కోడిమామిడి గెడ్డ, మత్స్యగెడ్డ, ముంచంగిపుట్టు మండలంలో బూసిపుట్టు, లక్ష్మిపురం, రంగబయలు ప్రాంతాల్లోని గెడ్డలు, డుంబ్రిగుడలోని చాపరాయిగెడ్డ, సంపంగిగెడ్డ, లోచలిగెడ్డ వరద నీటితో ఉధృతంగా ప్రవహించాయి. అలాగే ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల, జీకేవీధి మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లోని గెడ్డలకు అవతల ఉన్న పల్లెల్లోని గిరిజనం నాలుగు రోజులు ఇళ్లకే పరిమితమయ్యారు. జిల్లా, మండల కేంద్రాల్లోని రోడ్లన్నీ జలమయం కావడంతో జన జీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే మొంథా తుఫాన్‌ తీరం దాటినప్పటి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు వర్షాలు కురిశాయి. తర్వాత వర్షాలు లేకపోవడంతో గెడ్డలు శాంతించాయి.

ముంపు మండలాల్లో తొలగిన ఆందోళన

జిల్లాలోని పాడేరు డివిజన్‌ పరిధిలోని ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల మండలాల్లో భారీ వర్షాలతో చింతూరు డివిజన్‌లోని గోదావరి, శబరి నదులు ఉగ్రరూపం దాల్చుతాయి. దీంతో చింతూరు, కూనవరం, వీఆర్‌.పురం, ఎటపాక మండలాల్లో వరద ముంపు ఏర్పడుతుంది. అయితే వర్షాలు తగ్గడంతో ఏజెన్సీలో గెడ్డల ఉధృతి తగ్గుముఖం పట్టాయి. దీంతో చింతూరు డివిజన్‌లోని ప్రజల్లో ఆందోళన తగ్గింది. దీంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది.

కొయ్యూరులో..

తుఫాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాలు తగ్గిపోవడంతో కొండవాగుల ఉధృతి తగ్గాయి. దీంతో జనజీవనం సాధారణ స్థితికి వచ్చింది. గడిచిన ఐదు రోజులుగా తుఫాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాలకు మండలంలోని యు.చీడిపాలెం పంచాయతీ వేట్లపాలెం బూడిద వాగు, గొట్లపాడు వద్ద బండి గెడ్డ పొంగి ప్రవహించాయి. దీంతో 22 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అలాగే కాకరపాడు వాగు, శింగవరం ఐటీడీఏ కాలనీ సమీప వట్టివాగు పొంగి ప్రవహించడంతో మండల కేంద్రానికి రాకపోకలు నిలిచాయి. శరభన్నపాలెం వద్ద కొండవాగు ఉధృతంగా ప్రవహించడంతో బట్టుమెట్ట, కంపరేగుల గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. రత్నంపేట-పాడి మధ్య కొండవాగుపై నిర్మించిన వంతెన గతంలో కురిసిన వర్షాలకు శిథిలం కాగా.. మొంథా తుఫాన్‌ వర్షాలకు కొట్టుకుపోయింది. దీంతో నాలుగు గ్రామాలకు రహదారి సౌకర్యం లేకుండా పోయింది. తొంపడం జలపాతానికి వెళ్లే రహదారిలో పెదమాకవరం సమీపం గానుగుల వద్ద కొండవాగు పొంగి ప్రవహించడంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. గడిచిన 24 గంటల పాటు వర్షాలు కురవకపోవడంతో మండలంలో కొండవాగుల ఉధృతి తగ్గింది. శుక్రవారం నుంచి సాధారణ స్థితికి రావడంతో మండల వాసులు ఊపిరిపీల్చుకున్నారు.

Updated Date - Oct 31 , 2025 | 11:58 PM