గెడ్డల ఉధృతి తగ్గుముఖం
ABN , Publish Date - Aug 20 , 2025 | 11:44 PM
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం తగ్గుముఖం పట్టడంతో జిల్లాలో బుధవారం వర్ష ప్రభావం పెద్దగా లేదు. దీంతో గెడ్డలు, వాగుల ఉధృతి తగ్గింది. అయితే ఏజెన్సీలోని వర్ష ప్రభావంతో చింతూరు డివిజన్‌లోని గోదావరి, శబరి నదుల్లో వరద నీరు అధికంగా వచ్చి చేరడంతో అక్కడ ముంపు ప్రభావంపై ప్రజలు, అధికారులు ఆందోళన చెందుతున్నారు.
సాధారణ స్థితికి జనజీవనం
చింతూరు డివిజన్‌లో తగ్గని వరద నీరు
పాడేరు, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం తగ్గుముఖం పట్టడంతో జిల్లాలో బుధవారం వర్ష ప్రభావం పెద్దగా లేదు. దీంతో గెడ్డలు, వాగుల ఉధృతి తగ్గింది. అయితే ఏజెన్సీలోని వర్ష ప్రభావంతో చింతూరు డివిజన్‌లోని గోదావరి, శబరి నదుల్లో వరద నీరు అధికంగా వచ్చి చేరడంతో అక్కడ ముంపు ప్రభావంపై ప్రజలు, అధికారులు ఆందోళన చెందుతున్నారు.
చింతూరులో కంట్రోల్ రూమ్‌లు కొనసాగింపు
ఏజెన్సీ ప్రాంతంలో భారీ వర్షాలకు జిల్లాలోని గోదావరి, శబరి నదుల్లోకి వరద నీరు అధికంగా వచ్చి చేరింది. దీంతో ఆయా నదుల వద్ద ఒకటో నంబర్ భద్రతా సూచిక జారీ చేసిన అధికారులు, రెండవ నంబర్ హెచ్చరిక జారీ అయ్యే అవకాశముందని అంటున్నారు. ఈ నేపథ్యంలో చింతూరులోని ఐటీడీఏ, సబ్‌కలెక్టర్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లను కొనసాగిస్తున్నారు. జిల్లాలోని చింతూరు రెవెన్యూ డివిజన్‌లో వరద ముంపునకు గురయ్యే నాలుగు మండలాల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
చింతపల్లిలో..
చింతపల్లి: మండలంలో మోస్తరు వర్షం కురిసింది. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు విడతలవారీగా వర్షం పడింది. వర్షం వలన వారపు సంతలో వర్తకులు, వినియోగదారులు అవస్థలు పడ్డారు. కాగా లోతట్టు ప్రాంతాలు, పంట పొలాల్లో వర్షపు నీరు క్రమంగా తగ్గుతున్నది. అలాగే వాగుల్లో నీటి ప్రవాహ ఉధృతి తగ్గింది.