Share News

పొంచిఉన్న తుఫాన్‌ గండం

ABN , Publish Date - Nov 21 , 2025 | 12:40 AM

గత నెలలో సంభవించిన ‘మొంథా’ తుఫాన్‌ నష్టం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతుండగా.. బంగాళాఖాతంలో మరో తుఫాన్‌ ఏర్పడుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా వరి రైతులు బెంబేలెత్తిపోతున్నారు. జిల్లాలో ప్రస్తుతం వరిపైరు గింజ పాలుపోసుకునే దశ నుంచి కోత దశ వరకు వుంది. ఇటువంటి తరుణంలో తుఫాన్‌ సంభవిస్తే తీవ్రంగా నష్టపోతామని రైతులు వాపోతున్నారు. ముందస్తుగా వరినాట్లు వేసిన పొలాల్లో రెండు, మూడు రోజుల క్రితం కోతలు మొదలయ్యాయి. బోర్లు వున్నచోట కోతలు పూర్తిచేసి, కుప్పలు వేస్తున్నారు. కానీ సుమారు 90 శాతం విస్తీర్ణంలో పంట ఇంకా కోత దశకు చేరలేదు. తుఫాన్‌ వస్తుందన్న హెచ్చరికలతో కొంతమంది రైతులు గురువారం హడావిడిగా వరి కోతలు మొదలుపెట్టారు.

పొంచిఉన్న తుఫాన్‌ గండం
చోడవరంలో గింజ కట్టే దశలో వున్న వరిపైరు

అన్నదాతలు తీవ్ర ఆందోళన

వరి పంట చేతికి వచ్చే సమయంలో మరోసారి ప్రకృతి విపత్తు

హడావిడిగా కోతలు మొదలుపెట్టిన రైతులు

వారం, పది రోజుల్లో ముమ్మరం..

ఇదే సమయంలో తుఫాన్‌ హెచ్చరికలతో దిక్కుతోచని స్థితి

చోడవరం/ రావికమతం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): గత నెలలో సంభవించిన ‘మొంథా’ తుఫాన్‌ నష్టం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతుండగా.. బంగాళాఖాతంలో మరో తుఫాన్‌ ఏర్పడుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా వరి రైతులు బెంబేలెత్తిపోతున్నారు. జిల్లాలో ప్రస్తుతం వరిపైరు గింజ పాలుపోసుకునే దశ నుంచి కోత దశ వరకు వుంది. ఇటువంటి తరుణంలో తుఫాన్‌ సంభవిస్తే తీవ్రంగా నష్టపోతామని రైతులు వాపోతున్నారు. ముందస్తుగా వరినాట్లు వేసిన పొలాల్లో రెండు, మూడు రోజుల క్రితం కోతలు మొదలయ్యాయి. బోర్లు వున్నచోట కోతలు పూర్తిచేసి, కుప్పలు వేస్తున్నారు. కానీ సుమారు 90 శాతం విస్తీర్ణంలో పంట ఇంకా కోత దశకు చేరలేదు. తుఫాన్‌ వస్తుందన్న హెచ్చరికలతో కొంతమంది రైతులు గురువారం హడావిడిగా వరి కోతలు మొదలుపెట్టారు.

కాగా గత నెలలో సంభవించిన మొంథా తుఫాన్‌ సమయంలో కురిసిన భారీ వర్షాలతో జిల్లాలో సుమారు మూడు వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. కానీ వాస్తవంగా ఐదారు వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు సమాచారం. ఇతరచోట్ల అంతగా నష్టం లేకపోవడం, వాతావరణం పొడిగా వుండడంతో పంట బాగా పండి, ధాన్యం దిగుబడి ఆశాజనకంగా వుంటుందని రైతులు భావిస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల అంచనా ప్రకారం మరో రెండు, మూడు వారాల్లో జిల్లా అంతటా వరి కోతలు పూర్తవుతాయి. కానీ ఇప్పుడు తుఫాన్‌ రూపంలో ముప్పు పొంచివుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణ శాఖ సమాచారం మేరకు 22వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. 24వ తేదీకల్లా వాయుగుండంగా మారుతుంది. తదుపరి 48 గంటల్లో తుఫాన్‌గా బలపడి ఆంధ్రప్రదేశ్‌ తీరంవైపుగా రానున్నది. దీని ప్రభావంతో 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు తొలుత రాయలసీమ, దక్షిణ కోస్తాలో, తరువాత ఉత్తరకోస్తాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అంటే మరో వారం రోజుల్లో ఉత్తర కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం వుండడంతో వరి రైతులు అప్రమత్తంగా వుండాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అందివచ్చిన వరిపంటను ఒకటి, రెండు రోజుల్లో కోత కోసి, పనలు ఆరిన వెంటనే కుప్ప వేసుకోవాలని సూచిస్తున్నారు. మూడు రోజుల తరువాత వరి కోతలు కోయకుండా వుంటే మంచిదని, తుఫాన్‌ ప్రభావాన్నిబట్టి నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు.

రావికమతం మండలంలో మొదలైన వరికోతలు

రావికమతం మండలంలో ఈ ఏడాది మూడు వేల హెక్టార్లలో వరి సాగు చేపట్టారు. కొమిర, మత్స్యపురం, గుమ్మాళ్లపాడు, గుడివాడ, గర్నికం, కేబీపీ అగ్రహారం తదితర గ్రామాల్లో బోర్లు వున్న పొలాల్లో సుమారు వెయ్యి ఎకరాల్లో ముందుగా నాట్లు వేశారు. ఇందులో సుమారు 250 ఎకరాల్లో వరికోతలు పూర్తయ్యాయి. కొన్నిచోట్ల కుప్పలు వేయగా, మరికొన్నిచోట్ల పనలపై వుంది. తుఫాన్‌ వచ్చేనాటికి వరి కుప్పలు వేసుకుంటామని రైతులు చెబుతున్నారు. అయితే వారం, పది రోజుల్లో వరి పంట కోతకు వచ్చే అవకాశం వున్నచోట ఆయా రైతులు తుఫాన్‌ సమాచారంతో ఆందోళన చెందుతున్నారు.

Updated Date - Nov 21 , 2025 | 12:40 AM