Share News

తగ్గని వరద ప్రభావం

ABN , Publish Date - Oct 04 , 2025 | 11:44 PM

బంగాళాఖాతంలోని వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలకు శనివారం కూడా గెడ్డలు, వాగుల ఉధృతి కొనసాగుతున్నది.

తగ్గని వరద ప్రభావం
ఏటిపాక మండలం మురుమూరులో నీటిలో మునిగిన పత్తి పంట

కొనసాగుతున్న గెడ్డల ఉధృతి

గోదావరి, శబరి నదుల్లోకి వరద నీరు

జిల్లాకు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించిన విపత్తుల నివారణ సంస్థ

పాడేరు డివిజన్‌లో గెడ్డలు, చింతూరులో ముంపు సమస్య

పాడేరు, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలోని వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలకు శనివారం కూడా గెడ్డలు, వాగుల ఉధృతి కొనసాగుతున్నది. దీంతో చింతూరు ప్రాంతంలోని గోదావరి, శబరి నదుల ప్రవాహం ఉధృతంగా ఉండడంతో జిల్లాకు ఆరెంజ్‌ అలర్ట్‌ను ప్రకటించారు. జిల్లా కేంద్రం పాడేరు మొదలుకుని అన్ని మండలాల్లోనూ వాయుగుండం ప్రభావంతో శనివారం మబ్బు వాతావరణం కొనసాగింది. గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలతో ఒడిశాను ఆనుకుని ఉన్న ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల, జీకేవీధి మండలాల్లోని గెడ్డల్లోని ప్రవాహ ఉధృతం కొనసాగుతోంది. దీంతో అక్కడి నుంచి వరద నీరు జిల్లాలోని చింతూరు డివిజన్‌లో ఉన్న గోదావరి, శబరి నదుల్లోకి వచ్చి చేరుతుండడంతో ఆ నదులు ఉప్పొంగుతున్నాయి. అలాగే చింతూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో శబరి, గోదావరి నదులు పొంగి ప్రవహిస్తుండడంతో పలు గ్రామాల్లో ముంపు సమస్య ఏర్పడింది. అలాగే అక్కడ వాగులు సైతం రోడ్లపై నుంచి ప్రవహించడంతో సరిహద్దులోని ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోతున్నాయి. తాజా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం సూచిస్తున్నది.

Updated Date - Oct 04 , 2025 | 11:44 PM