మన్యంలో పర్యాటకుల సందడి
ABN , Publish Date - Dec 20 , 2025 | 10:21 PM
మన్యంలోని శనివారం పర్యాటకుల సందడి నెలకొంది. ప్రస్తుతం శీతాకాలం కావడంతో పాటు ప్రకృతి అందాలు ఆస్వాదించేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు.
కిటకిటలాడిన లంబసింగి, వంజంగి
ప్రకృతి అందాలను ఆస్వాదించిన సందర్శకులు
వంజంగి హిల్స్‌లో ట్రాఫిక్ సమస్య
పాడే రు, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి):మన్యంలోని శనివారం పర్యాటకుల సందడి నెలకొంది. ప్రస్తుతం శీతాకాలం కావడంతో పాటు ప్రకృతి అందాలు ఆస్వాదించేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు పర్యాటక సందడి నెలకొంది. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు, అరకులోయ మండలంలో మాడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, డుంబ్రిగుడలో చాపరాయి జలవిహారీ, పాడేరు మండలంలో వంజంగి హిల్స్, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి రిజర్వాయర్, చెరువువేనం మేఘాలకొండ, లంబసింగి ప్రాంతాలకు అధిక సంఖ్యలో సందర్శకులు వస్తున్నారు.
లంబసింగి కిటకిట
చింతపల్లి: ఆంధ్రకశ్మీర్ లంబసింగి శనివారం పర్యాటకులతో కిటకిటలాడింది. లంబసింగి ప్రకృతి అందాలను వీక్షించేందుకు భారీ సంఖ్యలో పర్యాటకులు తరలి వచ్చారు. దీంతో ఉదయం ఐదు గంటల నుంచే లంబసింగి, చెరువులవేనం, తాజంగి జలాశయం వద్ద పర్యాటకుల తాకిడి పెరిగింది. చెరువులవేనం వ్యూపాయింట్ వద్ద పర్యాటకులు మంచు అందాలను వీక్షిస్తూ ఎంజాయ్ చేశారు. తాజంగి జలాశయంలో సాహస క్రీడలు, బోటింగ్ చేసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపారు.
మేఘాల కొండకు తాకిడి
పాడేరురూరల్: పాడేరు మండలం వంజంగి మేఘాల కొండకు శనివారం పర్యాటకుల తాకిడి పెరిగింది. వంజంగి మేఘాల కొండ అందాలను తిలకించేందుకు పర్యాటకులు శుక్రవారం సాయంత్రానికే పాడేరు చేరుకున్నారు. దీంతో పట్టణంలో రహదారులు, లాడ్జిలు, హోటళ్లు రద్దీగా మారాయి. శనివారం వేకువజామున పర్యాటకులు మేఘాల కొండకు చేరుకొని పాల సముద్రాన్ని తలపించే మంచు మేఘాలు, సూర్యోదయం వేళ మంచును చీల్చుకొని వచ్చే భానుడి కిరణాలు చూసి మంత్రముగ్ధులయ్యారు. శనివారం మేఘాల కొండను రెండు వేల మంది పర్యాటకులు సందర్శించగా.. ఎ-కో టూరిజంకు రూ.1,11,730 ఆదాయం వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. వంజంగి వచ్చిన పర్యాటకుల వాహనాలను ప్రధాన రహదారికి ఇరువైపులా నిలపడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువయ్యాయి. దాంతో కొంతమంది పర్యాటకులు కార్లు, జీపులను కొండ సమీపం వరకు తీసుకువెళ్ల లేక వంజంగి గ్రామంలోనే నిలిపి నడిచి వెళ్లారు. దీంతో పలువురు పర్యాటకులు చిన్న పిల్లలతో కొండపైకి వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు.