Share News

ఇళ్లు సరే...వసతులేవీ?

ABN , Publish Date - Dec 24 , 2025 | 01:22 AM

పేదల కోసం నగర శివారు ప్రాంతాల్లో నిర్మిస్తున్న కాలనీల్లో 33 వేల ఇళ్ల పనులు పూర్తిచేశారు.

ఇళ్లు సరే...వసతులేవీ?

పేదల కాలనీల్లో రోడ్లు, విద్యుత్‌, తాగునీటి సదుపాయాల కల్పనను పట్టించుకోని అధికారులు

నెలాఖరుకల్లా 33 వేల మంది

లబ్ధిదారులకు ఇళ్ల అప్పగింతకు చర్యలు

సౌకర్యాలు లేకుంటే ఎలా నివసించాలని ప్రశ్నిస్తున్న జనం

విశాఖపట్నం, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి):

పేదల కోసం నగర శివారు ప్రాంతాల్లో నిర్మిస్తున్న కాలనీల్లో 33 వేల ఇళ్ల పనులు పూర్తిచేశారు. వాటిని నెలాఖరులోగా లబ్ధిదారులకు అందజేయాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలను జిల్లా గృహ నిర్మాణ సంస్థ అమలుచేస్తోంది. ఇప్పటివరకూ సుమారు నాలుగు వేల మందికి ఇళ్ల కేటాయింపు పత్రాలు అందజేశారు. మిగిలిన 29 వేల మందికి నెలాఖరులోగా పత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు.

ఇంతవరకు బాగానే ఉన్నా నిర్మించిన ఇళ్లల్లో నివాసం ఉండేలా వసతుల విషయాన్ని అధికారులు పట్టించుకోలేదు. శివారు ప్రాంతాల్లో 65 లేఅవుట్‌లలో 88 వేల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించిన హౌసింగ్‌ అధికారులు, ఇప్పటివరకు 33 వేల ఇళ్లు పూర్తిచేయగా, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. అయితే ప్రతి కాలనీలో రోడ్లు, డ్రైన్లు, తాగునీరు, విద్యుత్‌, అప్రోచ్‌ రోడ్లు, పాఠశాలలు, అంగన్‌వాడీ, ఆరోగ్య శాఖ సబ్‌సెంటర్లు ఉండాలి. అయితే ప్రస్తుతం ఏ కాలనీలోనూ ఈ వసతులు లేవు. ఇళ్ల నిర్మాణాల కోసం తాత్కాలికంగా వేసిన బోరుబావుల నుంచి తాగునీరు కొంతవరకూ తీసుకునే వీలుంటుంది. కానీ విద్యుత్‌ సౌకర్యం లేకపోతే ఎలా ఉంటామని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. తాగునీటి సౌకర్యం కోసం సుమారు రూ.600 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. విద్యుత్‌ సౌకర్యం, డ్రైన్లు, రోడ్లకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం ఆమోదించి టెండర్లు పిలిచిన తరువాత పనులు పూర్తికి కనీసం రెండేళ్లు పడుతుంది. అప్పటివరకూ లబ్ధిదారుల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నగా మిగిలింది.

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద ప్రతి ఇంటి నిర్మాణానికి కేంద్రం రూ.1.8 లక్షలు మంజూరుచేసింది. ఆనిధులతో ఆప్షన్‌-3 కింద కాంట్రాక్టర్ల ద్వారా నిర్మాణాలు చేస్తున్నారు. అదనపు వసతుల కోసం మహిళా లబ్ధిదారులకు డ్వాక్రా సంఘాల ద్వారా రూ.35 వేలు మంజూరుచేసిన రుణాలను ఇళ్ల నిర్మాణాలకు కేటాయించారు. ఇలా సుమారు 30 వేల మంది మాత్రమే ముందుకువచ్చారు. అయితే లబ్ధిదారులు స్వయంగా అదనపు హంగులు ఏర్పాటుచేసుకుంటే బీసీ/ఎస్సీ లైతే రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేల వరకు రాష్ట్ర ప్రభుత్వం సాయం అందిస్తోంది. దీనిని పరిగణనలోకి తీసుకుని ఇప్పటివరకూ ఆప్షన్‌-3 కింద నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు అందజేసిన నేపథ్యంలో వాటిని ఆప్షన్‌-1 (లబ్ధిదారులు స్వయంగా నిర్మించుకునే విధానం) కిందకు తీసుకువస్తారు. అప్పుడు బీసీ/ఎస్సీ/ఎస్టీ వర్గాలకు సాయం అందించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఓపెన్‌ కేటగిరీ వారికి మాత్రం ప్రభుత్వం నుంచి సాయం ఉండదు.

Updated Date - Dec 24 , 2025 | 01:22 AM