భావి తరాలకు ఆదివాసీ యోధుల చరిత్ర
ABN , Publish Date - Nov 01 , 2025 | 11:58 PM
ఆదివాసీ యోధుల చరిత్రను భావితరాలకు అందించేందుకు సమిష్టి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అన్నారు.
జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్
ఆది కర్మయోగి యోజనలోకి మరో 800 గ్రామాలు
తీసుకువచ్చేందుకు ప్రతిపాదనలు
బిర్సాముండా జయంతి ఉత్సవాలు ప్రారంభం
ఆకట్టుకున్న గిరిజన సంప్రదాయ ప్రదర్శనలు
పాడేరు, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీ యోధుల చరిత్రను భావితరాలకు అందించేందుకు సమిష్టి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అన్నారు. శనివారం ఆదివాసీ స్వాతంత్య్ర సమరయోధుడు భగవాన్ బిర్సాముండా జయంతి ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆదివాసీ యోధుల చరిత్ర చెరిగిపోకూడదనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం భగవాన్ బిర్సాముండా 150వ జయంతి ఈనెల 15న అయినప్పటికీ, ఉత్సవాలను శనివారం నుంచి పక్షం రోజులు నిర్వహించాలని సూచించిందన్నారు. జిల్లాలోని పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పరిధిలో 15 రోజుల పాటు భగవాన్ బిర్సాముండా జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. గిరిజన స్వాతంత్య్ర సమరయోధులు, గిరిజన సాంఘిక సమస్యలపై పోరాడిన సంస్కర్తల విజయాలు, వీరగాధలు కనుమరుగు కాకుండా భావితరాలకు అందించాలనే లక్ష్యంతోనే ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. గిరిజనుల సంక్షేమ, అభివృద్ధికి పెద్దపీట వేయాలనే లక్ష్యంతోనే దేశంలో మన రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఐటీడీఏలను ఏర్పాటు చేశారన్నారు. అదే స్ఫూర్తితో గిరిజనుల సమగ్రాభివృద్ధికి అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. ఆది కర్మయోగి యోజనలో జిల్లాలోని 521 గ్రామాల అభివృద్ధికి కేంద్ర ఆమోదం లభించిందని, మరో 800 గ్రామాలను ఈ పథకంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. అంతకుముందు బిర్సాముండా విగ్రహానికి కలెక్టర్ దినేశ్‌కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానిక ఐటీడీఏ కార్యాలయం నుంచి కిలోమీటరు దూరంలో ఉన్న కార్యక్రమం వేదిక వరకు గిరిజన సంప్రదాయ ప్రదర్శనలతో కార్నివాల్ నిర్వహించారు. ఆయా గిరిజన సంప్రదాయ ప్రదర్శనలు అందర్ని ఆకట్టుకోగా, కలెక్టర్ దినేశ్‌కుమార్, ఐటీడీఏ పీవో శ్రీపూజ కళాకారులతో కలిసి ధింసా నృత్యం చేసి ఉత్సాహపరిచారు. అలాగే పలువురు బాలలు చేసిన నృత్యాలు, వేషధారణలను అందరూ ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ సిటిజన్లను అధికారులు సత్కరించారు. ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు. ఏవో ఎం.హేమలత, జీసీసీ డైరెక్టర్ బొర్రా నాగరాజు, ట్రైకార్ డైరెక్టర్ కూడ కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.