కొండలు కొల్లగొడుతున్నారు
ABN , Publish Date - Jul 18 , 2025 | 01:14 AM
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో అనుమతులు లేకుండా మట్టి, గ్రావెల్, రాయి తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి.
అనుమతులు లేకుండా యథేచ్ఛగా తవ్వకాలు
గుర్రంపాలెం, పెదముషిడివాడ, ఊడేరుల్లో యంత్రాలు స్వాధీనం చేసుకున్న గనుల శాఖ అధికారులు
విజిలెన్స్ అధికారులకు నేతల ఫోన్
అక్రమ క్వారీయింగ్‌పై ఉన్నతాధికారులకు నివేదిక
విశాఖపట్నం, జూలై 17 (ఆంధ్రజ్యోతి):
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో అనుమతులు లేకుండా మట్టి, గ్రావెల్, రాయి తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. సుమారు వందచోట్ల అక్రమంగా క్వారీయింగ్ జరుగుతుంది. ఈ విషయమై గనుల శాఖ విజిలెన్స్ విభాగం ఉన్నతాధికారులకు నివేదించినట్టు తెలిసింది.
గనుల శాఖ రెగ్యులర్, విజిలెన్స్ విభాగాల అధికారులు వేర్వేరుగా పగటిపూట దాడులు చేస్తున్నారు. అక్రమ క్వారీయింగ్ చేస్తున్న యంత్రాలను సీజ్ చేస్తున్నారు. అయితే మాఫియా మాత్రం పగటిపూట కంటే రాత్రి సమయాల్లోనే ఎక్కువగా క్వారీయింగ్ చేస్తోంది. గనుల శాఖలో పరిమితంగా ఉన్న సిబ్బంది రాత్రిపూట దాడులు చేయడం లేదు. ఒకవేళ ఒకరు, ఇద్దరు తనిఖీలకు వెళితే మాఫియా ఎదురు దాడులకు పాల్పడే అవకాశం ఉంది. దీనికితోడు అనేకచోట్ల అక్రమంగా చేపడుతున్న క్వారీయింగ్‌ను అరికట్టేంత యంత్రాంగం గనుల శాఖకు లేదు. దీంతో అధికార పార్టీ నాయకుల పేరు చెబుతూ క్వారీ మాఫియా కొండలను కొల్లగొడుతోంది.
కొత్తగా క్వారీయింగ్‌కు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు ఉండాలి. అంత సులువుగా అనుమతులు రావడం లేదు. దీంతో ఉమ్మడి జిల్లాలో కొంతమంది ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే కొందరు కొండలను తవ్వేస్తున్నారు. స్థానికంగా ఎవరైనా ఫిర్యాదు చేస్తే గనుల శాఖ దాడులు చేస్తోంది. ఒకేరోజు ఎక్కువ ఫిర్యాదులు వస్తే ఒకటి లేదా రెండుచోట్ల మాత్రమే దాడులు చేయగలుగుతోంది. అనకాపల్లి జిల్లాలోని పలుచోట్ల నుంచి ప్రతిరోజు రాత్రి రాంబిల్లిలో నిర్మాణంలో ఉన్న నేవల్ ప్రాజెక్టుకు 100 లారీల బండరాళ్లు వెళుతున్నాయి. గడచిన వారం, పది రోజుల్లో పెందుర్తి మండలం గుర్రంపాలెం, నరవల్లో అక్రమంగా గ్రావెల్ తవ్వుతున్న యంత్రాలను సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు. ఆనందపురంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసం కేటాయించిన కొండను చదునుచేసే కాంట్రాక్టర్ ఎటువంటి అనుమతి తీసుకోలేదు. అక్కడ మట్టి, గ్రావెల్‌ను తవ్వుతున్న మిషనరీని, లంకెలపాలెం సమీపాన పెదముషిడివాడలో సెంటు భూమి ఇళ్ల కోసం వేసిన లేఅవుట్ పక్కనే గ్రావెల్ తవ్వుతున్న యంత్రాలను పట్టుకున్నారు. గురువారం అనకాపల్లి సమీపాన ఊడేరులో రాళ్ల క్వారీలో యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే గనుల శాఖ విజిలెన్స్, రెగ్యులర్ సిబ్బంది దాడులు చేసి యంత్రాలను స్వాధీనం చేసుకున్న వెంటనే కూటమి పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులు రంగంలోకి దిగుతున్నారు. కొందరు అయితే బెదిరింపులకు పాల్పడుతున్నారు. నగర శివారుల్లో ఒక అక్రమ క్వారీ వద్ద యంత్రాలు పట్టుకుని పోలీసులకు అప్పగించిన వెంటనే కూటమి నేతలు ...గనుల శాఖ విజిలెన్స్ అధికారులకు ఫోన్ చేసి బెదిరించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో అక్రమ క్వారీయింగ్‌పై ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్టు తెలిసింది. అక్రమ క్వారీయింగ్‌ను అడ్డుకట్ట వేసేందుకు కీలక ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటుచేస్తే మంచిదని విజిలెన్స్ విభాగం అధికారి ఒకరు పేర్కొన్నారు.