Share News

గిరి రైతుల పంట పండింది!

ABN , Publish Date - Dec 27 , 2025 | 10:33 PM

వాతావరణం సంపూర్ణంగా అనుకూలించడంతో ఈ ఏడాది గిరిజన రైతుల పంట పండింది. వర్షాలు సైతం సమృద్ధిగా కురవడంతో అన్ని పంటలు ఆశాజనకంగానే పండాయి.

గిరి రైతుల పంట పండింది!
కాఫీ, మిరియాల తోట

ఈ ఏడాది సమృద్ధిగా కురిసిన వర్షాలు

రికార్డు స్థాయిలో ధరలు పెరిగిన కాఫీ, మిరియాలు

రాజ్‌మా, పసుపు, పిప్పళ్లు ధరలు సైతం ఆశాజనకం

ఆనందంలో గిరిజన రైతులు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

వాతావరణం సంపూర్ణంగా అనుకూలించడంతో ఈ ఏడాది గిరిజన రైతుల పంట పండింది. వర్షాలు సైతం సమృద్ధిగా కురవడంతో అన్ని పంటలు ఆశాజనకంగానే పండాయి. ప్రధానంగా గిరిజన రైతులకు అధిక ఆదాయాన్నిచ్చే కాఫీ, మిరియాలు ధరలు రికార్డు స్థాయికి చేరగా, మిగిలిన రాజ్‌మా, పసుపు, పిప్పళ్లు ధరలు సైతం ఆశాజనకంగానే ఉన్నాయి. దీంతో తమ కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కాఫీ, మిరియాలుతోనే అధిక ఆదాయం

ఏజెన్సీలోని గిరిజన రైతులకు కాఫీ, మిరియాలు సాగుతోనే అధికంగా ఆదాయం లభిస్తుంది. వరి, రాగులు, సామలు వంటి పంటలు తమ ఆహార అవసరాలకు వినియోగిస్తారు. కాఫీ, మిరియాలు ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తారు. దీంతో గిరిజన రైతులు సైతం ప్రతి ఏడాది ఆ రెండు పంటలపైనే అధిక శ్రద్ధ కనబరుస్తారు. ఏజెన్సీ వ్యాప్తంగా ప్రస్తుతం 2 లక్షల 72 వేల ఎకరాల్లో కాఫీ తోటలున్నాయి. వాటిలో సుమారు 1 లక్షా 52 వేల ఎకరాల్లో ఏడాదికి 71 వేల టన్నుల కాఫీ పండ్లు దిగుబడి, సుమారుగా 17 వేల టన్నుల క్లీన్‌ కాఫీ ఉత్పత్తి అవుతున్నదని ఒక అంచనా. ఏడాదికి ఒక ఎకరం కాఫీ తోటతో సుమారు రూ.50 నుంచి రూ.75 వేలు ఆదాయం సమకూరుతున్నది. దీంతో కాఫీ తోటల పెంపకంపై గిరిజన రైతులు ఆసక్తి చూపుతున్నారు. కాఫీ తోటలకు నీడ నిచ్చేందుకు పొడుగ్గా ఉండే సిల్వర్‌ ఓక్‌ చెట్లకు మిరియాలు పాదులు అల్లుతారు. వాటిని కాఫీ తోటల్లో అంతర పంటగా ఎటువంటి పెట్టుబడి లేకుండా సాగు చేస్తారు. మిరియాలు నుంచి గిరి రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది. ఏజెన్సీ వ్యాప్తంగా 2 లక్షల 72 వేల ఎకరాల్లో కాఫీ తోటల్లో సుమారుగా 35 వేల ఎకరాల్లోని మిరియాలు పాదులుంటాయనేది ఒక అంచనా. ఒక ఎకరం కాఫీ తోటల్లోని మిరియాలు దిగుబడి ద్వారా గిరిజన రైతులకు ఏడాదికి రూ.60 వేలు వరకు ఆదాయం వస్తుందని అధికారులు అంటున్నారు. దీంతో కాఫీ తోటలున్న గిరిజన రైతులు మిరియాలు పాదుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ అదనపు ఆదాయం సంపాదిస్తున్నారు.

ఆశాజనకంగా రాజ్‌మా, పసుపు, పిప్పళ్లు ధరలు

ఏజెన్సీలో కాఫీ, మిరియాలతో పాటు రాజ్‌మా, పసుపు, పిప్పళ్లు ధరలు సైతం ఆశాజనకంగానే ఉన్నాయి. సేంద్రీయ పద్ధతిలో సాగు చేసే పసుపు, పిప్పళ్లు, రాజ్‌మాకు సైతం జాతీయ మార్కెట్‌లో అధిక డిమాండ్‌ ఏర్పడింది. పసుపు, పిప్పళ్లలకు ఔషధ గుణాలుండడంతో పలు రకాల మందులు, సౌందర్య వస్తువుల తయారీకి వినియోగిస్తుంటారు. దీంతో జాతీయ మార్కెట్‌లో వాటిని కొనుగోలు చేసేందుకు వర్తకులు ఎగబడతారు. ఏజెన్సీలో పసుపు 45 వేలు, పిప్పళ్లు 20 వేల ఎకరాల్లో గిరిజన రైతులు సాగు చేస్తున్నారు. అలాగే కేవలం ఆహారంగా మాత్రమే వినియోగించే రాజ్‌మా సైతం గిరిజనులు 30 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. వాటికి సైతం మార్కెట్‌లో అధికంగా గిరాకీ ఉంది. వాటిలో ప్రోటిన్‌, ఫైబర్‌, బీ1, బీ6 వంటి విటమిన్‌లు, ఇనుము, పొటాషియం, మెగ్నీషియం, జింక్‌ వంటివి ఉండడంతో పాటు రుచి సైతం చక్కగా ఉంటుంది. దీంతో రాజ్‌మా గింజల వంటకాలకు ఉత్తరాది రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, పశ్చిమబంగా ప్రాంతాల్లోనూ అధిక డిమాండ్‌ ఉంది. ఈ ఏడాది పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించడంతో గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మన్యంలోని వివిధ పంటల ధరల వివరాలు

వ.సం. పంట పేరు 2025లో మార్కెట్‌ ధరలు

1. కాఫీ రూ.250 నుంచి రూ.320

2. మిరియాలు రూ.510 నుంచి రూ.630

3. పసుపు రూ.75 నుంచి రూ.130

4. రాజ్‌మా రూ.80 నుంచి రూ.100

5. పిప్పళ్లు రూ.260 నుంచి రూ.350

Updated Date - Dec 27 , 2025 | 10:33 PM