తీరిన గర్భిణుల కష్టాలు
ABN , Publish Date - Aug 10 , 2025 | 11:57 PM
చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న గైనికాలజిస్టు, ఎనస్థీషియా పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా భర్తీ చేయడంతో ఆదివాసీ గర్భిణుల కష్టాలు తీరాయి. ఈ నెలాఖరు నుంచి సిజేరియన్లు ప్రారంభించేందుకు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.నీలవేణి చర్యలు ప్రారంభించడంతో అత్యవసర సమయంలో గర్భిణులు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి వెళ్లే అవస్థలు తప్పనున్నాయి.
చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో తాజాగా గైనికాలజిస్టు, ఎనస్థీషియా పోస్టుల భర్తీ
నెలాఖరు నుంచి సిజేరియన్లు ప్రారంభించేందుకు చర్యలు
ఆపరేషన్ థియేటర్ ఆధునికీకరణ
ఇకపై నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించాల్సిన అవసరం లేదు
చింతపల్లి, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న గైనికాలజిస్టు, ఎనస్థీషియా పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా భర్తీ చేయడంతో ఆదివాసీ గర్భిణుల కష్టాలు తీరాయి. ఈ నెలాఖరు నుంచి సిజేరియన్లు ప్రారంభించేందుకు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.నీలవేణి చర్యలు ప్రారంభించడంతో అత్యవసర సమయంలో గర్భిణులు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి వెళ్లే అవస్థలు తప్పనున్నాయి.
చింతపల్లి ఏరియా ఆస్పత్రి పరిధిలో 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. జీకేవీధి, చింతపల్లి మండలాల ప్రజలతో పాటు కొయ్యూరు, జి.మాడుగుల సరిహద్దు ప్రాంతాల గర్భిణులు వైద్యం, ప్రసవాల కోసం ఏరియా ఆస్పత్రికి వస్తున్నారు. ఏరియా ఆస్పత్రిలో ప్రతి రోజూ ఎనిమిది నుంచి పది మంది గర్భిణులు ప్రసవం కోసం వస్తుంటారు. రెండు మండల పరిధిలోనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధి గర్భిణులను సైతం ప్రసవం కోసం ఇక్కడికి తీసుకువస్తారు. చింతపల్లిలో ఐటీడీఏ నిర్వహిస్తున్న గర్భిణుల వసతి గృహం అందుబాటులో ఉంది. ఈ వసతి గృహంలో ప్రతి రోజూ పది మంది గర్భిణులు ఉంటున్నారు. నొప్పులు ప్రారంభమైన గర్భిణులను వసతి గృహం నుంచి ఏరియా ఆస్పత్రికి తీసుకొస్తున్నారు. అయితే ఇప్పటి వరకు సాధారణ ప్రసవాలు ఇక్కడే నిర్వహిస్తున్నారు. ప్రతి నెల 100కు పైగా సాధారణ ప్రసవాలు ఏరియా ఆస్పత్రిలో జరుగుతున్నాయి. కాస్త ప్రసవం కష్టమైతే నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించాల్సి వస్తుంది. ప్రతి నెల 25 నుంచి 30 మంది గర్భిణులను నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలిస్తున్నారు.
ప్రసవం కష్టమైతే..
స్థానిక ఏరియా ఆస్పత్రిలో ప్రసవం కష్టమైతే గర్భిణులను 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి, లేదా 69 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించడం తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గం లేదు. గర్భిణులు పురిటి నొప్పులతో అంబులెన్సులో సుమారు రెండు గంటల సేపు ప్రయాణించాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో మార్గమధ్యంలోనే ప్రసవాలు జరుగుతున్నాయి. వాస్తవానికి స్థానిక ఏరియా ఆస్పత్రిలో 2023 ఫిబ్రవరి 12వ తేదీన సిజేరియన్ ఆపరేషన్లు ప్రారంభించారు. ఆరు నెలల పాటు సిజేరియన్ ఆపరేషన్లు జరిగాయి. అనంతరం గైనికాలజిస్టులు, అనస్థీషియా వైద్యులు అందుబాటులో లేకపోవడం వలన ఆపరేషన్లు నిలిచిపోయాయి.
గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు
ఏరియా ఆస్పత్రిలో కొంత కాలంగా ఖాళీగా ఉన్న గైనికాలజిస్టు, ఎనస్థీషియా పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా భర్తీ చేసింది. ఏరియా ఆస్పత్రిలో మూడు గైనికాలజిస్టు, రెండు ఎనస్థీషియా పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వం నెల రోజుల క్రితం ఇద్దరు గైనికాలజిస్టులు, ఒక ఎనస్థీషియా పోస్టులను భర్తీ చేసింది. ప్రస్తుతం ఏరియా ఆస్పత్రిలో గైనికాలజిస్టులు వాసవి, శ్రీలత, ఎనస్థీషియా సాహితి అందుబాటులో ఉన్నారు. గైనికాలజిస్టులు అందుబాటులోకి రావడం వల్ల తనిఖీల కోసం వచ్చే గర్భిణుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రతి రోజు 50 మంది వరకు గర్భిణులు ఆరోగ్య తనిఖీలు, అలా్ట్రసౌండ్ స్కానింగ్‌ల కోసం వస్తున్నారు. ప్రతి నెల 9, 10 తేదీల్లో నిర్వహించే ప్రధానమంత్రి సురక్షిత మంత్రిత్వ అభియాన్ కార్యక్రమంలో 250 నుంచి 300 మంది గర్భిణులకు గైనికాలజిస్టులు ఆరోగ్య తనిఖీలు, స్కానింగ్‌లు చేస్తున్నారు.