‘ఏకలవ్య’ కష్టాలు!
ABN , Publish Date - Oct 24 , 2025 | 11:03 PM
అరకులోయ ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలకు బాలారిష్టాలు దాటలేదు. ఇక్కడ విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు కష్టాలు తప్పలేదు. ఏడాది క్రితం ఇక్కడి భవనాలను ప్రధానమంత్రి వర్చువల్‌లో ప్రారంభించినా నేటికీ సొంత గూటికి చేరలేదు.
15 ఎకరాల్లో అరకులోయ మోడల్
రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం
ఏడాది క్రితం ప్రధానమంత్రి ప్రారంభం
అయినా నేటికీ అందుబాటులోకి రాని భవనాలు
ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులు
అదనపు బిల్లుల పేరుతో భవనాలు అప్పగించని కాంట్రాక్టర్
అధికారులకు తెలిసినా పట్టించుకోని వైనం
అరకులోయ, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ‘దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వని’ చందంగా తయారైంది అరకులోయ ఏకలవ్య గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థుల పరిస్థితి. కేంద్రప్రభుత్వం గిరిజన ప్రాంతంలో విద్యాభివృద్ధికి పాడేరు డివిజన్‌లోని 11 మండలాలలకు 11 ఏకలవ్య గురుకుల పాఠశాలలను మంజూరు చేసింది. మొదటి విడతలో నాలుగు మండలాల్లోను.. రెండో దశలో ఏడు మండలాల్లో కేంద్ర ప్రభుత్వం వీటిని మంజూరు చేసింది. అరకులోయ మండలానికి మంజూరు చేసిన ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలకు 15 ఎకరాల స్థలానికి బొండాం పంచాయతీ మజ్జివలసలో ప్రభుత్వం కేటాయించింది. భవనాల నిర్మాణానికి తొలి విడతలో రూ.20 కోట్లు, మలి విడతలో రూ.20 కోట్లు మంజూరయ్యాయి. దీంతో భవన నిర్మాణాలను ప్రారంభించారు. పనులు దాదాపు పూర్తి కావడంతో 2024 అక్టోబరు రెండో తేదీన ఇతర రాష్ట్రాల్లో ఏకలవ్య గురుకుల పాఠశాలలతో కలిపి అరకులోయ పాఠశాలను వర్చువల్‌గా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. అప్పటి నుంచి పాఠశాల నిర్వహణ నూతన భవనాల్లో జరగాల్సి ఉన్నప్పటికీ నేటి వరకు పాఠశాల భవనాలు అందుబాటులోకి రాలేదు. దీంతో విద్యార్థులు, అధ్యాపకులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ ఏకలవ్య గురుకుల పాఠశాల భవనాలను ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే నిర్మించారు. పనులకు సంబంధించి అదనంగా బిల్లు రూ.2 కోట్లు రావల్సి ఉన్నందున పనులు పూర్తి చేయలేదు. ప్రారంభించిన భవనాన్ని అప్పగించకుండా జాప్యం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో విద్యార్థులు అరకులోయలో ఐటీడీఏకు చెందిన యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో చాలీచాలని వసతుల నడుమ చదువులు కొనసాగిస్తున్నారు. ఈ విషయం గురుకుల కార్యదర్శికి, జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవోలకు తెలిసినా వారు పట్టించుకోకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. బిల్లు సమస్య ఉన్నప్పుడు అసంపూర్తి భవనాన్ని ప్రధానమంత్రితో ప్రారంభించేందుకు జిల్లా అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు ఎలా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని వారు ప్రశ్నిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని అరకులోయ ఏకలవ్య గురుకుల భవనాలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
విద్యార్థుల అవస్థలు
-ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లు కో ఎడ్యుకేషన్ ఉంటుంది.
- అరకులోయ యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ ఏకలవ్య మోడల్ పాఠశాలల బాలురు, క్రీడా పాఠశాల విద్యార్థులు ఉంటున్నారు.
- ఇక్కడ ఏకలవ్య పాఠశాలలకు చెందిన 450 మంది బాలురు, క్రీడా పాఠశాలకు చెందిన 180 మంది విద్యార్థులు ఉంటున్నారు. ఇక్కడ ఉన్న పది గదుల్లో చాలీచాలని వసతి, బోధన ఒకేచోట నిర్వహిస్తున్నారు.
- అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ బాలికలు యండపల్లివలస గురుకుల బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో ఉంటూ చదువుతున్నారు. బాలికలు ఒకచోట.. బాలురు మరోచోట ఉండడం వల్ల ఉపాధ్యాయులు బోధించేందుకు అవస్థలు పడుతున్నారు.
-విద్యార్థులకు అవసరమైన టాయ్‌లెట్స్, బాత్‌రూమ్‌లు లేవు.
-ఉపాధ్యాయులు, సిబ్బంది పూర్తి స్థాయిలో ఉన్నప్పటికీ గురుకులంలో వసతి లేకపోవడంతో అరకులోయలో అద్దె ఇళ్లల్లో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు.