అప్పన్న ఆలయ ఉద్యోగుల చేతివాటం
ABN , Publish Date - Sep 02 , 2025 | 01:22 AM
సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్న సమయంలో ఉద్యోగులు చేతివాటం చూపించారు.
హుండీ ఆదాయం లెక్కిస్తున్న క్రమంలో చోరీ
సీసీ టీవీ కెమెరాలో గుర్తించిన ఈఓ
అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి తొలగింపు, పర్మనెంట్ ఉద్యోగి సస్పెన్షన్
కేసు నమోదుచేసిన గోపాలపట్నం పోలీసులు
సింహాచలం, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్న సమయంలో ఉద్యోగులు చేతివాటం చూపించారు. ఇద్దరు ఉద్యోగులు రూ.500 నోట్లను తెల్లకాగితంలో చుట్టి బ్యాగులో దాచడం సీసీ టీవీ కెమెరాలో రికార్డు కావడంతో ఈవో వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపిన వివరాల ప్రకారం...సింహగిరిపై పరకామణి కేంద్రంలో సోమవారం ఈవో ఆధ్వర్యంలో హుండీలను తెరిచి ఆదాయం లెక్కింపు ప్రక్రియను చేపట్టారు. దేవస్థానం ఉద్యోగులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు ఆదాయం లెక్కింపు ప్రారంభించారు. మధ్యాహ్నం 12.15 గంటల సమయంలో దేవస్థానం ట్రాన్స్‌పోర్టు విభాగంలో క్లీనర్‌గా పనిచేస్తున్న కె.రమణ కొన్ని రూ.500 నోట్లను తెల్లకాగితాల్లో చుట్టి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి పంచదార్ల సురేష్‌కు అందజేశాడు. అతడు దానిని తన వద్ద ఉన్న హుండీ తాళాలు భద్రపరిచే బ్యాగ్‌లో దాచేశాడు. ఈ మొత్తం వ్యవహారం సీసీ టీవీ కెమెరాలో రికార్డయింది. ఈవో సీసీ టీవీ ఫుటేజిని పరిశీలిస్తుండగా చోరీ వ్యవహారం బయటపడింది. దీంతో ఆ ఇద్దరు ఉద్యోగులను తనిఖీ చేయాలని ఏఈఓ రమణమూర్తిని ఆదేశించారు. తనిఖీల్లో సురేష్ వద్ద ఉన్న బ్యాగ్‌లో 111 రూ.500 నోట్లు బయటపడ్డాయి. విచారించగా రమణ తనకు ఇచ్చినట్టు అంగీకరించాడు. ఈ ఘటనలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి సురేష్‌ను విధుల నుంచి తప్పించడంతో పాటు పర్మినెంట్ ఉద్యోగి కె.రమణను ఈవో సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు. అనంతరం వారిపై గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ తేజేశ్వరరావు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు.