మెకానికల్‌లో మహా మాయ
ABN , Publish Date - Nov 30 , 2025 | 01:36 AM
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తరచూ అవినీతి ఆరోపణలు
నిధులు ఖర్చవుతున్నా కానరాని ఫలితాలు
అధ్వానంగా సీసీఎస్ ప్రాజెక్టుల నిర్వహణ
‘క్లాప్’ లోడర్ల సంఖ్యపై కాంట్రాక్టర్ కనికట్టు
తాజాగా స్వీపింగ్ యంత్రాల నిర్వహణలో లోపాలు బహిర్గతం
అధికారుల పర్యవేక్షణ లోపమే కారణమని విమర్శలు
కమిషనర్ పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తే సమస్యకు పరిష్కారం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్లోజ్డ్ కాంపాక్టర్ సిస్టమ్ (సీసీఎస్) ప్రాజెక్టుల నిర్వహణ, క్లాప్ వాహనాలకు లోడర్ల నియామకం, రోడ్లు శుభ్రం చేసే యంత్రాల నిర్వహణ...ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టు కాంట్రాక్టర్ల అక్రమాలు బయటపడుతుండడంతో ఆ విభాగంలో అసలేం జరుగుతోందనే చర్చ జరుగుతోంది.
జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగంలో పబ్లిక్ వర్క్స్, నీటి సరఫరా విభాగాల తర్వాత అత్యంత కీలకమైనది ‘మెకానికల్’. నగరంలో సేకరించిన చెత్త కాపులుప్పాడలోని డంపింగ్ యార్డుకు తరలించే వాహనాల నిర్వహణ, సీసీఎస్ ప్రాజెక్టులు, రోడ్లు శుభ్రం చేసే స్వీపింగ్ యంత్రాలు, జీవీఎంసీ అధికారులు వినియోగించే వాహనాల నిర్వహణ, పర్యవేక్షణ వంటి బాధ్యతలన్నీ మెకానికల్ విభాగం అధికారులే చూడాల్సి ఉంటుంది. చెత్తను కాపులుప్పాడలోని డంపింగ్ యార్డుకు తరలించే ప్రక్రియను స్మార్ట్‌గా నిర్వహించేందుకు వీలుగా సీసీఎస్ ప్రాజెక్టులను అందుబాటులోకి తెచ్చారు. వార్డుల నుంచి వచ్చే చెత్తను ఆయా జోన్లలోని చెత్త ట్రాన్స్‌ఫర్ స్టేషన్ (ఎంఎస్‌ఎఫ్)ల వద్ద ఏర్పాటుచేసిన సీసీఎస్ ప్రాజెక్టు ద్వారా కంప్రెస్ చేసి కేక్ మాదిరిగా మార్చి కంటెయినర్లలా ఉండే హుక్ లోడర్లలోకి లోడ్ చేసి కాపులుప్పాడలోని డంపింగ్ యార్డుకు తరలిస్తారు. ఈ ప్రాజెక్టు నిర్వహణను మెకానికల్ విభాగం అధికారులు టెండర్ ద్వారా కాంట్రాక్టర్‌కు అప్పగిస్తున్నారు. ఒక్కో సీసీఎస్ ప్రాజెక్టుకు సగటున ఏడాదికి రూ.రెండు కోట్లు చెల్లిస్తున్నా...కాంట్రాక్టర్ నిబంధనల ప్రకారం ప్రాజెక్టుల నిర్వహణ చేయకుండా బిల్లులు డ్రా చేసుకుంటున్నారు. దీనిపై అభ్యంతరం చెప్పాల్సిన అధికారులు మౌనం వహిస్తున్నారు. ఇటీవల కమిషనర్ కేతన్‌గార్గ్ సీసీఎస్ ప్రాజెక్టులను తనిఖీ చేయగా కాంట్రాక్టర్ నిర్వహణ లోపం గుర్తించి సుమారు రూ.56 లక్షలు రికవరీ చేయాలని అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టర్‌ను తొలగించేందుకు నోటీసు జారీచేయాలని ఆదేశించారు.
అలాగే క్లాప్ వాహనాలకు లోడర్ల పేరుతో కాంట్రాక్టర్ అవినీతికి పాల్పడుతున్నట్టు కొద్దిరోజుల కిందట బయటపడింది. జీవీఎంసీ పరిధిలో 574 క్లాప్ వాహనాలు ఉన్నాయి. వీటికి జీవీఎంసీ రూ.64 వేలు చొప్పున కాంట్రాక్టర్‌కు చెల్లిస్తోంది. ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి వాహనంలో లోడ్ చేసేందుకు లోడర్ అవసరమని కాంట్రాక్టర్ కోరడంతో ఒకరిని నియమించుకోవాలని, అందుకోసం నెలకు రూ.15 వేలు చొప్పున ఇస్తామని జీవీఎంసీ చెప్పింది. అయితే కాంట్రాక్టర్ మాత్రం తక్కువ మంది లోడర్లను నియమించుకుని...పూర్తిస్థాయిలో తీసుకున్నట్టు లెక్క చూపించి ప్రతి నెలా బిల్లు డ్రా చేసుకుంటున్నారు. లోడర్ల సంఖ్యతోపాటు వారి పనితీరును పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. దీనిపై కార్పొరేటర్ మూర్తియాదవ్ ఆధారాలతో కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో లోడర్‌లకు వేతనాల చెల్లింపు బాధ్యత నుంచి కాంట్రాక్టర్‌ను తొలగించారు. తాజాగా రోడ్లను శుభ్రం చేసే స్వీపింగ్ యంత్రాల నిర్వహణ తీరుపై కమిషనర్ ఆదేశించడంతో మెకానికల్ విభాగం అధికారులు దృష్టిపెట్టారు. ఆ కాంట్రాక్టర్ కూడా నిర్లక్ష్యంగా వాహనాలను నిర్వహించడం, మరమ్మతులు చేయకపోవడం, రోడ్లను తుడిచే బ్రష్‌లను మార్చకపోవడం వంటి కారణాలతో కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి లోపాలు బయటపడుతుండడంతో మెకానికల్ విభాగం అధికారుల పనితీరుపై తీవ్రస్థాయిలో చర్చ నడుస్తోంది. కమిషనర్ ఇప్పటికైనా దృష్టిసారించి మెకానికల్ విభాగాన్ని గాడిలో పెట్టాలని కోరుతున్నారు.