మహిళాభివృద్ధి, శిశు సంక్షేమమే లక్ష్యం
ABN , Publish Date - May 28 , 2025 | 01:00 AM
అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే ప్రతి ఒక్కరికీ పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కేవీ రామలక్ష్మి తెలిపారు.
జిల్లాలోని 776 అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో 9,354 మంది గర్భిణులు, 8,098 మంది బాలింతలు, 95,825 మంది చిన్నారులు
అందరికీ పోషకాహారం అందేలా చర్యలు
బాలికలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహణ
సిబ్బందికి ఇబ్బందులేమైనా ఉంటే నేరుగా నాతో మాట్లాడవచ్చు
గృహ హింస కేసులకు సామరస్యపూర్వకంగా పరిష్కారం
ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కేవీ రామలక్ష్మి
విశాఖపట్నం, మే 27 (ఆంధ్రజ్యోతి):
అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే ప్రతి ఒక్కరికీ పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కేవీ రామలక్ష్మి తెలిపారు. ఆమె కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేసి, కొద్దిరోజుల కిందట బదిలీపై ఐసీడీఎస్ పీడీగా వచ్చారు. జిల్లాలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అమలుచేస్తున్న కార్యక్రమాలతో పాటు అనేక అంశాలను ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో రామలక్ష్మి వెల్లడించారు.
ప్రశ్న: జిల్లాలో అంగన్‌వాడీ సెంటర్లు ఎన్ని ఉన్నాయి?, లబ్ధిదారుల సంఖ్య?
జవాబు: జిల్లాలో 776 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటిల్లో 766 మంది టీచర్లు పనిచేస్తున్నారు. మరో పది ఖాళీలు ఉన్నాయి. ఆయా కేంద్రాల పరిధిలో గర్భిణులు 9,354 మంది, బాలింతలు 8,098 మంది, ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులు 52,837 మంది, మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు 42,988 మంది ఉన్నారు. అందరికీ పోషకాలతో కూడిన కిట్లు అందించడంతోపాటు కేంద్రాల్లో ఆహారాన్ని కూడా అందిస్తున్నాం. వేసవి సెలవుల్లో కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహంచేలా సిబ్బందికి ఆదేశాలు ఇచ్చాం. మిషన్ వాత్సల్య, కిశోర వికాసం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. కిశోర వికాసంలో భాగంగా పది నుంచి 18 ఏళ్లలోపు మధ్య బాలికలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. అమ్మాయిల్లో అభద్రతా భావాన్ని పోగొట్టడం, పోషకాహారం తీసుకోవడం, యుక్తవయసులో వచ్చే సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి విషయాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నాం.
ప్ర: అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయా.?
జ: జిల్లాలో మొత్తం 776 అంగన్‌వాడీ సెంటర్లకుగాను 208 కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయి. మరో 360 కేంద్రాలను ప్రభుత్వ, సామాజిక భవనాల్లో నిర్వహిస్తున్నాం. మరో 207 అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. ప్రస్తుతం 10 కొత్త భవనాలు నిర్మాణ దశలో ఉండగా, మరో 16 భవనాల నిర్మాణానికి సంబంధించి గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు అందించేందుకు ఉన్నతాధికారులు సిద్ధంగా ఉన్నారు.
ప్ర: అంగన్‌వాడీ సిబ్బందిపై పని ఒత్తిడి, వేధింపులపై ఏమంటారు?
జ: ప్రస్తుతం వర్క్ అంతా యాప్‌లో చేయాల్సి వస్తోంది. దీనిని మొదట్లో కొందరు ఇబ్బందిగా ఫీల్ అయ్యేవారు. ప్రస్తుతం బాగానే చేస్తున్నారు. వేధింపులు ఎవరికీ ఉండవు. ఏమైనా ఇబ్బందులు ఉంటే నేరుగా నాతో మాట్లాడవచ్చు. అందరికీ అందుబాటులో ఉంటాను. ఫేస్ అటెండెన్స్ యాప్‌లో హాజరు వేయాల్సి వస్తోంది. ఇది కొందరికి ఇబ్బందిగా ఉంటోంది. కానీ, ఇప్పుడు అన్ని సమస్యలూ పరిష్కారమయ్యాయి. గతంలో నెట్‌వర్క్ సమస్యలు, యాప్ పనిచేయకపోవడం వల్ల ఇబ్బంది ఉండేది. ఇప్పుడు అటువంటివి ఏమీ లేవు.
ప్ర: జీతాలు, ఇతర అలవెన్సులు పెండింగ్‌లో ఉన్నాయా.?
జ: జీతాలు పెండింగ్‌లో లేవు. అద్దె బకాయిలు కొంతవరకు పెండింగ్‌లో ఉన్నాయి. అవి కూడా క్లియర్ అవుతాయి. ప్రతి ఫైల్ క్లియర్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నా. రోజులు తరబడి ఫైళ్లు పెండింగ్‌లో లేకుండా చూసుకుంటున్నా.
ప్ర: దత్తత ప్రోగ్రామ్‌ను అమలు ఎలా ఉంది.?
జ: పిల్లలు లేని తల్లిదండ్రులకు దత్తత ఇచ్చే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తోంది. పిల్లలు కావాలనుకునే వాళ్లు ఎవరైనా వెబ్‌సైట్‌లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. జాబితా ప్రకారం వారికి అవకాశం వచ్చినప్పుడు పిల్లలను అందిస్తాం. జిల్లాలో ఇప్పటివరకూ 160 మంది చిన్నారులను దత్తత ఇచ్చాం. 148 మందిని దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారికి ఇవ్వగా, 12 మందిని ఇతర దేశాలకు చెందిన వారికి అందించాం. శిశు గృహలో దత్తత ఇచ్చేందుకు సిద్ధంగా 20 మంది చిన్నారులు ఉన్నారు.
ప్ర: డీవీ సెల్‌లో నమోదయ్యే కేసులను సంగతేంటి?
జ: డొమెస్టిక్ వయలెన్స్ సెల్‌లో నమోదయ్యే కేసులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ఈ సెంటర్‌లో కౌన్సిలర్లు, లీగల్ కౌన్సిలర్లు ఉంటారు. అక్కడకు వచ్చే బాధితులకు వారు అండగా ఉంటున్నారు. వీలైనంత వరకూ గృహహింస, ఇతర వేధింపులపై నమోదయ్యే కేసులను సామరస్య పూర్వకంగా పరిష్కరించేందుకు ఈ సెల్ పనిచేస్తోంది. బాధిత మహిళలకు అండగా ఉంటోంది. ఈ ఏడాదిలో 260 కేసులను డీవీ సెల్ ద్వారా క్లియర్ చేశాం. మరో 50 వరకు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని త్వరితగతిని పూర్తి చేసేలా సిబ్బంది పని చేస్తున్నారు.