స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యం
ABN , Publish Date - Dec 26 , 2025 | 12:27 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యం
ఫోటో: 25ఏకేపీ.3.
- పార్టీని మరింత బలోపేతం చేస్తా..
- అధిష్ఠానం నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతా..
- టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు
అనకాపల్లి, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేస్తానని, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తానని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షునిగా రెండోసారి ఎన్నికైన క్రమంలో గురువారం అనకాపల్లిలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ, విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావులు తనపై నమ్మకం ఉంచి మరోసారి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారన్నారు. దీని వలన తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి క్షేత్రస్ధాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తానన్నారు. అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి రానున్న స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కూటమి అభ్యర్ధులను గెలిపించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌లకు బహుమతిగా ఇస్తామన్నారు. టీడీపీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు మంచి గుర్తింపు ఉంటుందన్నారు. ముఖ్యంగా పార్టీలో యువతరానికి మంచి భవిష్యత్తు ఉందన్నారు. కాగా కూటమి నాయకుల మధ్య ఎటువంటి విభేదాలు రాకుండా అందరూ కలిసి సమన్వయకంతో పనిచేసేలా కృషి చేస్తానని ఆయన చెప్పారు. జిల్లాలో 42 మందితో ఏర్పాటైన కొత్త కమిటీ త్వరలోనే ప్రమాణ స్వీకారం చేస్తుందన్నారు. 2026 నాటికి అనకాపల్లి జిల్లాలో టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయం పనులు పూర్తి చేస్తామన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా మరోసారి ఎన్నికైన లాలం కాశీనాయుడు మాట్లాడుతూ జిల్లాలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి వంటి పార్టీ సీనియర్ నాయకుల సలహాలు, సూచనలతో పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యాలయం కార్యదర్శి ఏపీఎం సత్యనారాయణ, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కళ్లెంపూడి ఎర్రయ్యనాయుడు, శ్రీకాళహస్తి దేవస్థానం డైరెక్టర్ బీలా స్రవంతి, తదితరులు పాల్గొన్నారు.