Share News

రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యం

ABN , Publish Date - Jul 26 , 2025 | 11:10 PM

రెవెన్యూ సంబంధ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపట్టాలని సర్వే సెటిల్‌మెంట్‌ అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ ఆర్‌.గోవిందరావు సూచించారు.

రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యం
మాట్లాడుతున్న రాష్ట్ర సర్వే విభాగం అడిషనల్‌ డైరెక్టర్‌ ఆర్‌.గోవిందరావు

సర్వే సెటిల్‌మెంట్‌ అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌

అడిషనల్‌ డైరెక్టర్‌ ఆర్‌.గోవిందరావు

రీసర్వేను వేగవంతం చేయండి

ప్రతి పేదవానికి సొంతింటి కల

నెరవేర్చాలని అధికారులకు ఆదేశం

పాడేరు, జూలై 26(ఆంధ్రజ్యోతి): రెవెన్యూ సంబంధ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపట్టాలని సర్వే సెటిల్‌మెంట్‌ అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ ఆర్‌.గోవిందరావు సూచించారు. కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌తో కలిసి రెవెన్యూ, సర్వే రికార్డులు, గృహ నిర్మాణం, రీ సర్వే, పీజీఆర్‌ఎస్‌ తదితర అంశాలపై శనివారం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భూముల రీసర్వేను వేగవంతం చేసేందుకు గ్రామ సర్వేయర్లు, గ్రామ రెవెన్యూ అధికారులు, మండల సర్వేయర్లు, డిప్యూటీ తహశీల్దార్లు మరింత ఉత్సాహంగా పనిచేయాలన్నారు. అలాగే రీసర్వే ప్రక్రియలో ప్రభుత్వ, ప్రైవేటు భూముల నిర్థారణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అలాగే 2027 డిసెంబరు నాటికి భూముల రీసర్వే ప్రక్రియ పూర్తికావాలనేది ముఖ్యమంత్రి ఆదేశమని, ఆ లక్ష్యంతో అందరూ పనిచేయాలన్నారు. అలాగే మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థతో వచ్చిన వినతులను పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు.

ప్రతి పేదవానికి ఇల్లు ఉండేలా చర్యలు

జిల్లాలో ప్రతి పేదవానికి సొంతిల్లు ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాలని సర్వే సెటిల్‌మెంట్‌ అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ ఆర్‌.గోవిందరావు అన్నారు. ఇళ్లు లేని వారిని గుర్తించి అర్హులైన వారందరికీ ఇళ్లు మంజూరుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అలాగే వివిధ శాఖల సమన్వయంతో పేదవారి సొంతింటి కలను నెరవేర్చాలన్నారు. అంతకు ముందు జిల్లాలోని రెవెన్యూ వ్యవస్థ, ప్రజలకు అందిస్తున్న సేవలు తదితర అంశాలపై కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వే విభాగం ట్రైనింగ్‌ అకాడమి జాయింట్‌ డైరెక్టర్‌ వీవీఎస్‌.కుమార్‌, సెంట్రల్‌ సర్వే ఆర్‌డీడీ కె.జియాకుమారి, డిప్యూటీ డైరెక్టర్‌ డీఎల్‌డీఎల్‌.కుమార్‌, ఎస్‌డీఏ నాగేశ్వరరావు, జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజే.అభిషేక్‌గౌడ, సబ్‌కలెక్టర్‌ శౌర్యమన్‌పటేల్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ కె.సాహిత్‌, జిల్లా రెవెన్యూ అధికారి కె.పద్మలత, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఎంవీఎస్‌.లోకేశ్వరరావు, తహసీల్దార్లు, సర్వే, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2025 | 11:10 PM