నేడు 3.45 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం
ABN , Publish Date - Jun 04 , 2025 | 11:33 PM
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఒక్కరోజే జిల్లాలో 3 లక్షల 45 వేల మొక్కలను నాటాలని అధికారులను కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఆదేశించారు.
అధికారులకు కలెక్టర్ దినేశ్‌కుమార్ ఆదేశం
పాడేరు, జూన్ 4(ఆంధ్రజ్యోతి): ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఒక్కరోజే జిల్లాలో 3 లక్షల 45 వేల మొక్కలను నాటాలని అధికారులను కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఆదేశించారు. రంపచోడవరం నుంచి పర్యావరణ దినోత్సవంపై బుధవారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. పర్యావరణ దినోత్సవంలో భాగంగా డుంబ్రిగుడ మండలం అరకు పైనరీలో జిల్లా స్థాయి ‘వనం- మనం’ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో లక్షా 73 వేలు, అటవీ అభివృద్ధి సంస్ధ ద్వారా 86 వేలు, ఐటీడీఏ పీవోలు, డ్వామా ఆధ్వర్యంలో 43 వేలు, సబ్‌కలెక్టర్లు 17,200 మొక్కలు నాటాలన్నారు. అందరి సమన్వయంతో లక్ష్యానికి మించి మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ ఏడాది ప్రపంచ థీమ్ ప్లాస్టిక్ నిషేధమని, అందుకు అనుగుణంగా ప్లాస్టిక్ రహితం, పర్యావరణ హితానికి అధికారులు, సిబ్బంది, ప్రజలు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవోలు, సబ్‌కలెక్టర్లు, డీఎఫ్‌వోలు, డ్వామా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.