ఇంటికో ఉద్యోగమే లక్ష్యం
ABN , Publish Date - Nov 25 , 2025 | 12:28 AM
నియోజకవర్గంలో ఇంటికో ఉద్యోగం వుండాలన్నదే తన లక్ష్యమని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగపరచుకోవడం, ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా ప్రజల తలసరి ఆదాయం పెరిగేలా దృష్టి పెట్టానని హోం మంత్రి అనిత తెలిపారు.
బొమ్మల పరిశ్రమ ఏర్పాటుకు జీవో జారీ
ప్రజల తలసరి ఆదాయం పెరగాలి
టీడీపీకి కార్యకర్తల ఐక్యతే బలం
పార్టీ శ్రేణుల సమావేశంలో హోం మంత్రి అనిత
నక్కపల్లి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో ఇంటికో ఉద్యోగం వుండాలన్నదే తన లక్ష్యమని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగపరచుకోవడం, ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా ప్రజల తలసరి ఆదాయం పెరిగేలా దృష్టి పెట్టానని హోం మంత్రి అనిత తెలిపారు. త్వరలో నక్కపల్లి మండలంలో బొమ్మల పరిశ్రమ ఏర్పాటవుతుందని, దీనికి జీవో కూడా విడుదలైందన్నారు. సోమవారం మధ్యాహ్నం తన క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించిన నియోజకవర్గం టీడీపీ శ్రేణుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ముందుగా పార్టీ, పార్టీ అనుబంధ సంస్థల పదవులు పొందిన వారితో హోం మంత్రి అనిత పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే పునాదని, పార్టీ శ్రేణుల ఐక్యతే పార్టీకి బలమన్నారు. పదవులంటే అధికారం చెలాయించడం కోసం కాదని, బాధ్యతగా వుంటూ నిరంతరం ప్రజలకు సేవ చేయాలన్నారు. వైసీపీ పాలనలో పెట్టుబడుదారుల సమ్మిట్‌లో భోజనాల కోసం కొట్టుకున్నారని, తమ ప్రభుత్వ హయాంలో ఇటీవల జరిగిన సమ్మిట్‌లో రూ.13 లక్షల కోట్ల మేర పెట్టుబడులతో పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందం కుదిరిందన్నారు. ఇందులో అనకాపల్లి జిల్లాలో అధిక పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకువచ్చాయని చెప్పారు. వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు, అవమానాలు పడ్డారని, అయినా పోరాటంలో వెనక్కి తగ్గలేదన్నారు. కార్యకర్తల సంక్షేమానికి కూడా పార్టీ అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. కోటవురట్ల- అడ్డరోడ్డు ప్రధాన రహదారి పనులు త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీలో యువతకు పెద్దపీట వేస్తున్నామని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో వుంచుకుని ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, కాపు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పెదిరెడ్డి చిట్టిబాబు, పార్టీ నియోజకవర్గం కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేశ్, మాజీ ఎంపీపీ వినోద్‌రాజు, నియోజకవర్గం నేతలు విలియం కేరీ, కురందాసు నూకరాజు, గింజాల లక్ష్మణరావు, దేవర సత్యనారాయణ, చించలపు పద్దు, వైబోయిన రమణ, అబద్దం, అల్లు నర్సింహమూర్తి, గుర్రం రామకృష్ణ, వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు.