Share News

ఆటో డ్రైవర్ల సంక్షేమమే ధ్యేయం

ABN , Publish Date - Oct 04 , 2025 | 11:41 PM

ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మహిళా, శిశు, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు.

ఆటో డ్రైవర్ల సంక్షేమమే ధ్యేయం
ఆటో డ్రైవర్లకు నమూనా చెక్‌ను అందిస్తున్న మంత్రి సంధ్యారాణి, కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, ఐటీడీఏ పీవో శ్రీపూజ, తదితరులు

రాష్ట్ర మహిళా శిశు, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సంధ్యారాణి

జిల్లాలో 4,217 మంది ఆటో డ్రైవర్లకు రూ.6.32 కోట్లు జమ

పాడేరు, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మహిళా, శిశు, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఆటో డైవర్ల సేవలో కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో స్త్రీశక్తి పథకం అమలుతో ఆటో డ్రైవర్లకు ఇబ్బందులు కలగకూడదనే ఆలోచనతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదన్నారు. జిల్లాలో 4,217 మంది ఆటోవాలాలకు రూ.15 వేలు చొప్పున రూ.6.32 కోట్లు జమ చేసిందన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు. వాహనాల గ్రీన్‌ ట్యాక్స్‌ను 75 శాతం వరకు ప్రభుత్వం తగ్గించిందన్నారు. ప్రజలకు ఎటువంటి సమస్యలున్నా వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రభుత్వ పథకాల అమల్లో ఇబ్బందులుంటే తెలపాలన్నారు.

జిల్లా అభివృద్ధికి ప్రత్యేక కృషి

జిల్లా అభివృద్ధికి ప్రత్యేకంగా కృషిచేస్తామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఈ జిల్లాకు వస్తే పుట్టింటికి వచ్చినట్టు ఉంటుందన్నారు. అరకు కాఫీ బ్రాండ్‌తో సీఎం చంద్రబాబునాయుడు కాఫీని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారన్నారు. తాజా అరకు కాఫీకి కేంద్ర అవార్డు రావడం సంతోషమని, ఈక్రమంలో గిరిజన రైతులు, అధికారులకు సీఎం చంద్రబాబునాయుడు అభినందనలు తెలిపారని మంత్రి చెప్పారు. అలాగే జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ చొరవతో అనేక గ్రామాలకు రోడ్లు మంజూరుకాగా, మంత్రి నారా లోకేశ్‌ చొరవతో పాఠశాలలకు భవనాలను మంజూరయ్యాయన్నారు. అలాగే జీఎస్‌టీ సంస్కరణలతో ప్రజలందరికీ ఎంతో మేలు జరిగిందన్నారు.

గూగుల్‌ డేటా సెంటర్‌పై రాద్ధాంతం తగదు

విశాఖపట్నం కేంద్రంగా ఐటీ రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. అందులో భాగంగా విశాఖపట్నంలో గూగూల్‌ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతుంటే.. వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తుందన్నారు. వారికి అభివృద్ధి చేయడం రాదు.. చేసే వాళ్లకు అడ్డుపడడం మాత్రమే తెలుసునని విమర్శించారు. ప్రజలు అభివృద్ధి, ఉపాధిని కోరుకుంటున్నారని సంద్యారాణి అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌, ఐటీడీఏ పీవో శ్రీపూజ, జీసీసీ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, జానపద కళలు, నైపుణ్య అకాడమీ చైర్మన్‌ వంపూరు గంగులయ్య, తదితరులు మాట్లాడారు. అంతకుముందు మంత్రి, కలెక్టర్‌, తదితరులు స్థానిక అంబేడ్కర్‌ సెంటర్‌ నుంచి ఐటీడీఏ కార్యాలయానికి ఆటోలో ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ రవాణాధికారి కేవీ.ప్రకాశరావు, ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, జీసీసీ డైరెక్టర్‌ బొర్రా నాగరాజు, ట్రైకార్‌ డైరెక్టర్‌ కూడా కృష్ణారావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొట్టగుళ్లి సుబ్బారావు, టూరిజం డైరెక్టర్‌ కేవీ రమేశ్‌నాయుడు, మాజీ ఎంపీపీ బొర్రా విజయరాణి, టీడీపీ నేతలు చల్లంగి లక్ష్మణరావు, పాండురంగస్వామి, టి.సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 04 , 2025 | 11:41 PM