గిరిజన సమగ్రాభివృద్ధే ధ్యేయం
ABN , Publish Date - Apr 21 , 2025 | 11:48 PM
గిరిజనుల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సంధ్యారాణి తెలిపారు. కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన ఐటీడీఏ 74వ పాలకవర్గ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడారు.
జీవో:3కి ప్రత్యామ్నాయంపై చర్యలు
1/70 చట్టం పటిష్ఠంగా అమలు
మెగా డీఎస్సీలో ఎస్టీలకు రెండు వేల టీచర్ పోస్టులు కేటాయింపు
ఏజెన్సీలో రోడ్ల నిర్మాణానికి అధిక నిధులు మంజూరు
గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం
ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి సంధ్యారాణి వెల్లడి
పాడేరు, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): గిరిజనుల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సంధ్యారాణి తెలిపారు. కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన ఐటీడీఏ 74వ పాలకవర్గ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడారు. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అనేక సందర్భాల్లో పేర్కొన్నారని ఆమె చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో గిరిజనులకు అన్యాయం జరిగిందని, వాటిని దృష్టిలో పెట్టుకుని అన్ని విషయాల్లోనూ గిరిజన ప్రాంతానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నదన్నారు. ముఖ్యంగా మారుమూల పల్లెలకు రోడ్ల నిర్మాణం చేపట్టి, భవిష్యత్తులో డోలీ మోతల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు. ఏజెన్సీలో మొత్తం మారుమూల గ్రామాలకు రోడ్ల నిర్మాణానికి రూ.3 వేల కోట్లు అవసరమవుతుందని, దీంతో దశల వారీగా ఆయా నిధులను మంజూరు చేసేందుకు నిర్ణయించామన్నారు. ఇప్పటికే రూ.వెయ్యి కోట్లతో మారుమూల ప్రాంతాలకు రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామని, విడతలుగా నిధులు మంజూరు చేసి ప్రతి మారుమూల పల్లెకు రోడ్డు నిర్మిస్తామని చెప్పారు. అలాగే ప్రతి మండల కేంద్రంలో పది, ఇంటర్ విద్యను మరింతగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
మెగా డీఎస్సీలో ఎస్టీలకు రెండు వేల టీచర్ పోస్టులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీలో గిరిజనులకు రెండు వేల టీచర్ పోస్టులు కేటాయించామని మంత్రి తెలిపారు. జీవో: 3 రద్దు నేపథ్యంలో మెగా డీఎస్సీలో గిరిజనులకు టీచర్ పోస్టులు లేవనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమె ఈ విధంగా తెలిపారు. డీఎస్సీలో గిరిజన అభ్యర్థులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగబోదని, వారికి రెండు వేల పోస్టులున్నాయన్నారు. అలాగే గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో వసతులను మెరుగుపరుస్తామని, విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం తదితర సేవలు సక్రమంగా అందేలా ఐటీడీఏ పీవో ఆధ్వర్యంలో పక్కా పర్యవేక్షణ జరగాలని మంత్రి సూచించారు. పాడేరు, అరకులోయ నియోజకవర్గాల పరిధిలో 11 విద్యాలయాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం రూ.34 కోట్లు మంజూరు చేసిందన్నారు. గత ప్రభుత్వంలో అసంపూర్తిగా ఉన్న అంగన్‌వాడీ కేంద్ర భవనాలను పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఏఎన్‌ఎంలను నియమించేందుకు చర్యలు చేపడుతున్నామని, త్వరలోనే అందుకు నియామకాలు జరుగుతాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో 1/70 చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయాలని, ప్రభుత్వ భూముల రక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఏజెన్సీకి వచ్చి ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు పొందుతున్న నకిలీ ఎస్టీలను నియంత్రించాలని, అటువంటి వారితో అసలైన గిరిజనులకు అన్యాయం జరుగుతుందన్నారు. గతం నుంచే గిరిజన సంక్షేమ శాఖ అధ్వానంగా ఉండేదని, దానిని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రక్షాళన మొదలు పెట్టామన్నారు.
గంజాయిపై ఉక్కుపాదం
తమ ప్రభుత్వం గంజాయి సాగు, రవాణాపై ఉక్కు పాదం మోపడంతోనే నిర్మూలన జరుగుతుందని మంత్రి సంధ్యారాణి అన్నారు. ప్రభుత్వం గంజాయి నిర్మూలనపై సీరియస్‌గా వ్యవహరించడంతోనే ఇది సాధ్యమైందన్నారు. ఇప్పటికీ విద్యాలయాల్లో మత్తు పదార్థాల విక్రయం, వినియోగం ఉంటే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. తల్లిదండ్రులు ఆడపిల్లల కంటే మగపిల్లల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఎస్‌సీ, ఎస్‌టీలకు ఉచితంగా సోలార్ విద్యుత్ యూనిట్‌లను ప్రభుత్వం అందిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్, అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ, సబ్ కలెక్టర్ శౌర్యమన్‌పటేల్, డీఎఫ్‌వో పీవీ సందీప్‌రెడ్డి, అరకులోయ ఎంపీ తనూజారాణి, పాడేరు, అరకులోయ, చోడవరం, వి.మాడుగుల ఎమ్మెల్యేలు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, రేగం మత్స్యలింగం, కేవీఎస్‌ఎన్.రాజు, బండారు సత్యనారాయణ, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, జడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్, ఆర్‌టీసీ విజయనగరం జోన్ చైర్మన్ దొన్నుదొర, 11 మండలాల్లోని ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.