డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం
ABN , Publish Date - Nov 17 , 2025 | 01:52 AM
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యమని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి అన్నారు.
ప్రజల్లో చైతన్యానికి పోలీసు శాఖ ‘అభ్యుదయ’ యాత్ర
రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి
బుచ్చెయ్యపేట, నవంబరు 16 (ఆంధ్ర జ్యోతి):
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యమని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి అన్నారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నిర్మూలనే ధ్యేయంగా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ‘అభ్యుదయం’ పేరుతో పోలీసు శాఖ చేపట్టిన సైకిల్ యాత్ర ఆదివారం సాయంత్రం వడ్డాది చేరుకుంది. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ, తెలిసీతెలియని వయసుల్లో విద్యార్థులు, యువత మత్తుపదార్థాలకు అలవాటుపడి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను నిరంతరం గమనిస్తూ, చెడు అలవాట్ల దరికి చేరకుండా చూడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు, సీఐ కోటేశ్వరరావు, ఎస్‌ఐ ఎ.శ్రీనివాసరావు, పోలీసులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని విశాఖ రేంజి డీఐజీగోపీనాథ్ జట్టి బుచెయ్యపేట పోలీసులను ఆదేశించారు. ఆదివారం ఆయన పోలీసు స్టేషన్‌ను సందర్శించి, రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసులు, దర్యాప్తులో పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను కఠినంగా అమలు చేయాలని, వాహనచోదకులు సీటు బెల్ట్/ హెల్మెట్ వాడకం నిబంధలను కచ్చితంగా పాటించేలా చూడాలన్నారు. వివిధ రూట్లలో తరచూ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ మండలం మీదుగా గంజాయి రవాణాను పూర్తిగా కట్టడి చేయాలని ఆదేశించారు. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, ప్రజలు వీటి బారిన పడకుండా వుండేందుకు గ్రామాల్లో ప్రచారం నిర్వహించడంతోపాటు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, మహిళా చట్టాలు, హెల్స్‌లైన్ వినియోగంపై గ్రామాల్లో ప్రచారం చేయాలని అన్నారు. డీఐజీ వెంట ఎస్‌ఐలు ఎ.శ్రీనివాసరావు, రఘువర్మ, నారాయణరావు, పోలీసు సిబ్బంది వున్నారు.